అలరించిన వెంకన్న ఆటాపాట | Sakshi
Sakshi News home page

అలరించిన వెంకన్న ఆటాపాట

Published Mon, Jul 21 2014 3:18 AM

అలరించిన వెంకన్న ఆటాపాట - Sakshi

మహబూబ్‌నగర్ అర్బన్: ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న తన ఆటాపాటతో అలరించారు. తన పాటలో పల్లె కన్నీరు పెడుతున్న తీరు, పాలమూరు వలసగోసను చూపారు. పాలకుల నిర్లక్ష్యపు వైఖరిని ఎండగట్టారు. నవ తెలంగాణ నిర్మాణానికి ఏం కావాలో తెలియజేశారు. పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని గాయత్రీ ఫంక్షన్‌హాల్‌లో ‘గోరటి వెంకన్న కవిత్వంతో ఒక రోజు’ అనే సాహితీ సదస్సు నిర్వహించారు.
 
 ముఖ్యఅతిథిగా హాజరైన ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ మట్లాడుతూ.. ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిన తెలంగాణ రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమానికి ప్రజాకవి గోరటి వెంకన్న పాటనే బాట వేసిందన్నారు. ‘స్థానికత.. గోరటి ఎంకన్న కవిత్వం’ అనే అంశంపై ప్రధాన ప్రసంగం చేసిన ఆయన మనుషులే కాకుండా సమస్త ప్రాణికోటి స్వేచ్ఛగా ఉండాలని పరితపించిన కవి, గాయకుల్లో వెంకన్న ప్రథముడని అన్నారు.
 
 ఆయన పాట, మాట, ఆట తెలంగాణ కదనరంగానికి ఊతమిచ్చిందన్నారు. ప ల్లెసీమలు, వాగులు, వంపులు, చెరువులు, చెట్లు, పక్షలు తదితర ప్రకృతి సంపద వైభవాన్ని చాటి చెబుతూనే వాటి పట్ల పాలకుల విధ్వంసకర చర్యలను ఎత్తిచూపిందన్నారు. సాంస్కృతిక ఉద్యమాల ద్వారానే తెలంగాణ రాష్ట్రం వచ్చినా ఇప్పటికీ ప్రజాస్వామ్యం శేషప్రశ్నగానే మిగిలిందన్నారు. నూతన తెలంగాణ ఏర్పాటు పట్ల వెంకన్న రూపొందించిన కార్యాచరణను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందిస్తానని చెప్పారు.
 
 పోలవరం బాధితుల కోసం గళం విప్పాలి
 ‘ప్రపంచీకరణ, ప్రజారాజకీయాలు-ఎంకన్న కవిత్వం’ అనే అంశంపై ప్రసంగించిన వరవరరావు మాట్లాడుతూ.. మూడు లక్షల మంది ఆదివాసీలను పోలవరం ప్రాజెక్టులో ముంచి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరికోసమో అర్థం కావడం లేదన్నారు.
 
 పోలవరం బాధితులు, పాలస్తీనా ప్రజల కోసం గళం విప్పాలని ఆయన వెంకన్నను కోరారు. ప్రొఫెసర్ రంగనాథాచార్యులు తన ప్రారంభోపన్యాసంలో వెంకన్న రచనలు, వాటి ప్రత్యేకతను విశ్లేషించారు. సంపాదకులు కె.శ్రీనివాస్, ప్రముఖ సాహితీవేత్తలు శిలాలోలిత, అంబటి సురేంద్రరాజు, బండి నారాయణస్వామి, ఆర్టిస్ట్ మోహన్, ఖాదర్ మొహియోద్దీన్, సీతారాం తదితరులు వెంకన్న కవిత్వంలోని వివిధ అంశాలను వివరించారు. కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, ప్రతినిధులు ఎక్బాల్, వెంకటేశ్వర్లు, కొండన్న తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement