
'కేసీఆర్ కళ్లు తెరిపించేందుకు రాహుల్ వచ్చారు'
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కళ్లు తెరిపించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించారని ఆ పార్టీ సీనియర్ నేత వీ హనుమంత రావు అన్నారు.
హైదరాబాద్: తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కళ్లు తెరిపించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించారని ఆ పార్టీ సీనియర్ నేత వీ హనుమంత రావు అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో రాహుల్ రైతు భరోసా యాత్రలో పాల్గొన్న సంగతి తెలిసిందే.
ఆదిలాబాద్లో ఆత్మహత్యకు పాల్పడ్డ ఐదుగురు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసినట్టుగా, మిగిలిన వారికి కాంగ్రెస్ పార్టీ ఆదుకునేలా తమ పార్టీ నేతలతో చర్చిస్తానని వీహెచ్ చెప్పారు. పెట్రోల్ ధరలు తగ్గినపుడు ప్రధాని మోదీ ఘనతని చెప్పే బీజేపీ నేతలు, ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. భూదాన్ అక్రమాలపై ప్రభుత్వం విచారణ జరిపించి బాధ్యులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ కమిటీతో ఫలితం లేకపోతే సీబీఐ విచారణ జరిపించాలని వీహెచ్ అన్నారు.