పాత కక్షల నేపథ్యంలో ఇంటి ఆవరణలో ఉంచిన మూడు బైక్‌లను గుర్తు తెలియని దుండగులు దహనం చేశారు.
మేడ్చల్ (రంగారెడ్డి) : పాత కక్షల నేపథ్యంలో ఇంటి ఆవరణలో ఉంచిన మూడు బైక్‌లను గుర్తు తెలియని దుండగులు దహనం చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం రాయిలాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మేడ్చల్ సీఐ శశాంక్‌రెడ్డి , గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... రాయిలాపూర్ గ్రామానికి చెందిన వెంకటస్వామి గౌడ్, అంజయ్య గౌడ్ కల్లు వ్యాపారం చేస్తున్నారు. గ్రామ ప్రధాన రోడ్డు పక్కన ఉన్న రెండంతస్తుల భవనంలో వెంకటస్వామి, అంజయ్య కుటుంబాలు ఉంటున్నాయి. వారికి చెందిన ఒక పల్సర్, రెండు హీరో హోండా బైకులను ఇంటి ఆవరణలో పార్క్ చేసి ఇంట్లో వారు నిద్ర పోయారు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో వెంకటస్వామి ఇంటి నుంచి మంటలు చెలరేగాయి.
రోడ్డుపై వెళుతున్న కంకర తరలించే టిప్పర్ డ్రైవర్లు గమనించి వెంకటస్వామిని నిద్రలేపారు. వారు ఇరుగుపొరుగు వారి సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. మంటల్లో వాహనాలు పూర్తిగా కాలిపోగా ఇంటి పైకప్పు పాక్షికంగా దెబ్బతింది. వాహనాలు పార్క్ చేసిన ప్రాంతానికి పక్కనే వంట గది ఉంది. మంటలు ఏమాత్రం వంట గదిలోకి చేరి గ్యాస్ సిలిండర్ల వరకు పాకి ఉంటే పెను ప్రమాదం చోటు చేసుకునేది. వారి విరోధులెవరో కక్ష తీర్చుకునేందుకు ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.