సర్టిఫికెట్లకని వెళ్లి కానరానిలోకాలకు!

two students died in road accident - Sakshi

టిప్పర్‌ రూపంలో కబలించిన మృత్యువు 

ఇద్దరు భావి ఇంజనీర్లు దుర్మరణం  

ఇబ్రహీంపట్నంరూరల్‌: ఇద్దరు భాబి ఇంజనీర్ల రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. బీటెక్‌  పూర్తి చేసుకొని సర్టిఫికెట్లు తెచ్చుకోవడానికి వెళ్లి.. కానరాని లోకాలకు పోయారు. టిప్పర్‌ రూపంలో వచ్చిన మృత్యువు వారిని బలితీసుకుంది. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం జరిగిన ఈ ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం మాలిపురం గ్రామానికి చెందిన శీల రామచందర్, ఎల్లమ్మ దంపతుల కుమారుడు మహేష్‌(22), రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట్‌ నగర పంచాయతీకి చెందిన గూడురూ రాంబాబు కుమారుడు లోకేష్‌ దుర్గా ప్రసాద్‌(22)లు  ఇబ్రహీంపట్నం మండలం మంగళ్‌పల్లి సమీపంలోని భారత్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ (ఈఈఈ) పూర్తి చేశారు.

శీల మహేష్, దుర్గాప్రసాద్‌  ఇద్దరు కలిసి సోమవారం సర్టిపికెట్లు తెచ్చుకోవడానికి కళాశాలకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆదిబట్ల టీసీఎస్‌ రోడ్డు వైపు వస్తుండగా.. బొంగ్లూర్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి ఆదిబట్ల గ్రామం వైపు వెళ్తున్న టిప్పర్‌ వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో వీరు టిప్పర్‌ వెనక చక్రాల కింద పడిపోయారు. మహేష్, లోకేష్‌కుమార్‌లపై నుంచి టిప్పర్‌ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. విషయం తెలుసుకున్న ఆదిబట్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను ఇబ్రహీంపట్నం మార్చురీకి తరలించారు. మహేష్‌ బ్యాగులో భారత్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ఐడీ కార్డు లభించడంతో వీరు భారత్‌ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులుగా గుర్తించారు.

కళాశాలకు చెందిన రిజిస్ట్రార్, ఈఈఈ హెచ్‌ఓడీలు వచ్చి మార్చురీ వద్ద మృతదేహాలను పరిశీలించగా భారత్‌ కళాశాల పూర్వ విద్యార్థులగా నిర్ధారించారు. సర్టిఫికెట్ల కోసం వచ్చినట్లు తెలియజేశారు. ప్రస్తుతం వీరిద్దరు నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో విశ్వ కోచింగ్‌ సెంటర్‌లో గేట్‌ కోచింగ్‌ తీసుకున్నట్లు వారి వద్ద ఉన్న ఐడీ కార్డుల  ఆధారంగా తెలిసింది. మహేష్‌ తండ్రి చిన్నప్పుడే మరణించడంతో తల్లి కష్టపడి చదివించినట్లు తెలిసింది. ప్రస్తుతం మృతుడు మహేష్‌ సోదరుడు కూడా భారత్‌ కళాశాలలోనే ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు తెలిసింది. మృతదేహాలను ఇబ్రహీంపట్నం ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. టిప్పర్‌ డ్రైవర్‌ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. ఘటనా స్థలాన్ని ఆదిబట్ల సీఐ గోవింద్‌రెడ్డి, ఎస్‌ఐ మోహన్‌రెడ్డి పరిశీలించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top