జిల్లాలో అంతటా టీఆర్‌ఎస్సే

TRS Won All Municipalities In Mancherial - Sakshi

 జిల్లాలోని ఆరు బల్దియాలకు కొత్త పాలకవర్గం

అన్నిచోట్లా చైర్మన్, వైస్‌చైర్మన్లు ఏకగ్రీవం

లక్సెట్టిపేటలో బహిష్కరించిన కాంగ్రెస్‌

పోలీసుల భారీ బందోబస్తు

మంచిర్యాలటౌన్‌: జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగిరింది. అన్నిచోట్లా చైర్మన్, వైస్‌ చైర్మన్‌ స్థానాలను అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ చేజిక్కించుకుంది. బలమున్న చోట అలవోకగా.. బలం తక్కువున్న చోట స్వతంత్రుల మద్దతుతో దక్కించుకుంది. మొత్తంగా జిల్లావ్యాప్తంగా గులాబీ గుబాళించింది. సోమవారం ప్రమాణ స్వీకారం ఉండడంతో పోలింగ్‌ రోజే క్యాంపులకు వెళ్లిన సభ్యులు.. నేరుగా ఆయా మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి చేరుకున్నారు. ఈ మేరకు వారితో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. 

చెన్నూర్‌ మున్సిపాలిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం కన్నుల పండువగా జరిగింది. 18 మందితో కౌన్సిలర్లతో స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో డీఆర్వో రాజేశ్వర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మధ్యాహ్నం 12:30 గంటలకు చైర్‌పర్సన్‌ ఎన్నిక చేపట్టారు. చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా అర్చనరాంలాల్‌గిల్డా ఒక్కరే నామినేషన్‌ వేయడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. అలాగే వైస్‌చైర్మన్‌గా నవాజోద్దిన్‌ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి సంజీవరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ కురికాల బాపు తదితరులు పాల్గొన్నారు.

లక్సెట్టిపేట చైర్మన్‌గా నల్మాసు కాంతయ్య
లక్సెట్టిపేట మున్సిపల్‌ పాలకవర్గంతో స్థానిక మున్సిపాలిటీలో డీఆర్‌డీఎ అధికారి శేషాద్రి ప్రమాణ స్వీకారం చేయించారు. టీఆర్‌ఎస్‌కు చెందిన తొమ్మిది మంది కౌన్సిలర్‌ అభ్యర్థులు ఉదయం పదకొండు గంటలకు ప్రత్యేక వాహనంలో మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. టీఆర్‌ఎస్‌కు కోరం ఉండడంతో చైర్మన్, వైస్‌ చైర్మన్‌ రెండు పదవులూ వారే దక్కించుకున్నారు. చైర్మన్‌గా నల్మాసు కాంతయ్య, వైస్‌ చైర్మన్‌గా పొడేటి శ్రీనివాస్‌గౌడ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్‌ కమిషనర్‌ రాజలింగం, సిబ్బంది కొత్త పాలకవర్గాన్ని సన్మానించారు.

నస్పూర్‌ చైర్మన్‌గా ఈసంపల్లి ప్రభాకర్‌
నస్పూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌కు చెందిన ఈసంపల్లి ప్రభాకర్‌ ప్రమాణ స్వీకారం చేశారు. వైస్‌ చైర్మన్‌గా తోట శ్రీనివాస్‌ను ఎన్నుకున్నారు. నస్పూర్‌ మున్సిపల్‌ కార్యాలయంలో ప్రత్యేక అధికారి శ్యామలాదేవి కొత్త పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. మున్సిపాలిటీలో మొత్తం 25 మంది కౌన్సిలర్లలో 10 మంది టీఆర్‌ఎస్, ఆరుగురు కాంగ్రెస్, ముగ్గురు స్వతంత్రలు, ఒకరు ఫార్వర్డ్‌ బ్లాక్, ఇద్దరు బీజేపీ, ఇద్దరు సీపీఐ అభ్యర్థులు విజ యం సాధించారు. టీఆర్‌ఎస్‌ నుంచి 9వ వార్డు కౌన్సిలర్‌గా గెలిచిన ఈసంపల్లి ప్రభాకర్‌ చైర్మన్‌గా నామినేషన్‌ వేయగా.. 22వ వార్డు కౌన్సిలర్‌ వంగ తిరుపతి ప్రతిపాదించారు. 7వ వార్డు కౌన్సిలర్‌ చిందం మహేశ్‌ బలపరిచారు.

కాంగ్రెస్‌ నుంచి మరొకరు నామినేషన్‌ వేయడంతో ఎన్నిక అనివార్యమైంది. అయితే టీఆర్‌ఎస్‌తో పాటు ముగ్గురు స్వతంత్రులు, ఫార్వర్డ్‌ బ్లాక్‌ కౌన్సిలర్, ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా ఎమ్మెల్యే దివాకర్‌రావు ఈసంపల్లి ప్రభాకర్‌కు మద్దతుగా ఓటు వేయడంతో ప్రభాకర్‌ ఎన్నిక లాంఛనమైంది. వైస్‌చైర్మన్‌గా తోట శ్రీని వాస్‌ను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. ఎన్నిక సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఏసీపీ లక్ష్మీనారాయణ బందోబస్తును సమీక్షించారు. మున్సిపల్‌ క మిషనర్‌ రాధాకిషన్, సిబ్బంది పెద్దింటి మో హన్‌రావు, శ్రీపతి సురేశ్‌కుమార్, నారాయణ కొత్త పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. 

అభివృద్ధికి పాటుపడండి..
కొత్త పాలకవర్గం మున్సిపల్‌ అభివృద్ధికి పాటుపడాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు సూచించారు. చైర్మన్, వైస్‌ చైర్మన్లను అభినందించారు. ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని పేర్కొన్నారు. టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు బి.వెంకట్రావు మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ హవా కొనసాగిందన్నారు. టీబీజీకేఎస్‌ బ్రాంచీ ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, నాయకులు ఏనుగు రవీందర్‌రెడ్డి, మంద మల్లారెడ్డి, వెంగళ కుమారస్వామి పాల్గొన్నారు.

మంచిర్యాల చైర్మన్‌గా పెంట రాజయ్య
మంచిర్యాల మున్సిపల్‌ పాలకవర్గంతో ఆర్డీవో శ్రీనివాస్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌కు చెందిన పెంట రాజయ్య, గాజుల ముఖేశ్‌గౌడ్‌ ఎన్నికైనట్లు ఆర్డీవో ప్రకటించారు. అసిస్టెంట్‌ ఎన్నికల అధికారి జి.స్వరూపరాణి పాల్గొన్నారు.

క్యాతనపల్లి చైర్‌పర్సన్‌గా జంగం కళ
క్యాతనపల్లి బల్దియా పాలకవర్గంతో జెడ్పీ సీఈఓ నరేందర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్‌పర్సన్‌గా జంగం కళ, వైస్‌చైర్మన్‌గా ఎర్రం సాగర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన చైర్మన్, వైస్‌ చైర్మన్‌తోపాటు కౌన్సిలర్లకు మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటనారాయణ, మేనేజర్‌ కీర్తి నాగరాజు పాల్గొన్నారు. మందమర్రి సీఐ ఎడ్ల మహేష్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
బెల్లంపల్లి చైర్‌పర్సన్‌గా శ్వేత..
బెల్లంపల్లి మున్సిపల్‌ పీఠంపై గులాబీ జెండా ఎగిరింది. చైర్‌పర్సన్‌ , వైస్‌చైర్మన్‌గా జక్కుల శ్వేత, బత్తుల సుదర్శన్‌ ఏకగ్రీవమయ్యారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌  ప్రత్యేకాధికారి, సబ్‌ కలెక్టర్‌ పీఎస్‌ రాహుల్‌ రాజ్‌ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top