పాటే ప్రాణం | Sakshi
Sakshi News home page

పాటే ప్రాణం

Published Sat, Nov 3 2018 11:56 PM

TRS Plan To Conduct Telangana Dhoom Dham Programs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ఎన్నికల్లోకి దిగిన టీఆర్‌ఎస్‌.. ప్రజలకు చేరేలా వీటిని వివరించాలని నిర్ణయించింది. బహిరంగ సభలు, ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు చక్కని పాటలు తోడవుతున్నాయి. ఎన్నికల ప్రచారం కోసం టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు మంచి పాటలను రూపొందిస్తున్నారు. నాలుగేళ్ల సంక్షేమం, అభివృద్ధి పథకాలను ఇతివృత్తాలుగా చేసుకుని... ప్రజలకు బాగా చేరే ట్యూన్లతో పాటల తయారీలో నిమగ్నమయ్యారు. కేసీఆర్‌ శనివారం రోజంతా పలువురు కవులు, కళాకారులతో చర్చలు జరిపారు. వీరు రాసుకొచ్చిన పాటలను, తీసుకొచ్చిన ట్యూన్లను పరిశీలించారు. ప్రజలకు సులభంగా చేరేలా తెలంగాణ యాసను జోడించి మార్పులు చేయించారు. టీఆర్‌ఎస్‌ ప్రచారంలో ఇప్పటికే పాటలు కీలకంగా మారాయి. ప్రతి సభలోనూ, అభ్యర్థుల ప్రచారంలోనూ ఇవే ఉంటున్నాయి. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు బహిరంగ సభలకు ప్రత్యేక సాంస్కృతిక బృందాలు పనిచేస్తున్నాయి.

అయితే పోలింగ్‌పై ప్రభావం చూపే స్థాయి పాటలను రూపొందించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. దీనికి అనుగుణంగా ప్రస్తు తం పాటల రూపకల్పన ప్రక్రియ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రజలను భాగస్వాములను చేయడంలో పాటలే ప్రధాన భూమికయ్యాయి. ఇదే తరహాలో ఓటర్లు టీఆర్‌ఎస్‌ను ఆదరించేలా పాటలను సిద్ధం చేశారు. బహిరంగ సభలు, ఇంటింటి ప్రచారం, సోషల్‌ మీడియా... ఇలా అన్నింటికీ వేర్వేరుగా ప్రచార పాటలను రూపొందించడంలో కేసీఆర్‌ అన్నీ తానై చూసుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత ఎన్నికల ప్రచార పూర్తి స్థాయి షెడ్యూల్‌ విడుదలకు ముందే ఈ పాటల పెన్‌డ్రైవ్‌లను, సీడీలను అన్ని నియోజకవర్గాలకు పంపిణీ చేయాలని నిర్ణయించారు.

ఈసీ నిబంధనలు పాటించాలి...
కేంద్ర ఎన్నికల సంఘం మార్గ దర్శకాలకు అనుగుణంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారం నిర్వహించేలా పార్టీ అధిష్టానం కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసింది. నామినేషన్‌ పత్రాల దాఖలు, అఫిడవిట్‌ తయారీ, రోజువారీ ఖర్చులు, ప్రచారంలో ప్రత్యర్థుల ఫిర్యాదులకు ఇవ్వాల్సిన వివరణ వంటి అంశాలను వెంటవెంటనే సిద్ధం చేసేందుకు టీఆర్‌ఎస్‌ ప్రతి జిల్లాలో ఎన్నికల సెల్‌ను ఏర్పాటు చేసింది. ఈసీ మార్గదర్శకాలపై పూర్తి అవగాహన ఉన్న న్యాయవాదిని, చార్టర్డ్‌ అకౌంటెంట్‌ను, జిల్లాలోని పార్టీ ముఖ్య నేతలను ఈ ఎన్నికల సెల్‌లో నియమించింది. జిల్లాల ఎన్నికల సెల్‌లో పని చేసే న్యాయవాదులతో టీఆర్‌ఎస్‌ ముఖ్య నేత, న్యాయవాది బోయినపల్లి వినోద్‌కుమార్, సీనియర్‌ న్యాయవాది సుధాకర్‌రెడ్డిలు శనివారం భేటీ అయ్యారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను సంక్షిప్తంగా రూపొందించి అభ్యర్థులకు, నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలకు పంపించాలని నిర్ణ యించారు. ప్రచారంలో ఎప్పటికప్పుడు అవసరమయ్యే సూచనలను ఇవ్వాలని అన్ని జిల్లాల న్యాయవాదులకు సూచించారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆధ్వర్యంలోనే ఈ సమావేశం జరగాల్సి ఉంది. అయితే కేసీఆర్‌ పాటల రూపకల్పనలో నిమగ్నం కావడంతో వినోద్‌కుమార్‌
ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement