‘కొత్త’ ఆశలు

TRS New Candidates List In Adilabad - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: కొత్త ముఖాలు ఈ ఎన్నికల బరిలో నిలిచేందుకు ఉత్సాహం కనబరుస్తున్నాయి. ప్రధాన పార్టీల నుంచి టికెట్‌ దక్కించుకునేందుకు ఇప్పటికే వీరు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయాల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందులో పలువురు వైద్యులు, ఉద్యోగులు ఉండడం గమనార్హం. కొంత మంది గృహిణులు కూడా రాజకీయాల్లో రాణించేందుకు ముందుకు వస్తున్నారు. ఇందులో కొందరు పేరున్న రాజకీయ కుటుంబం నుంచే మళ్లీ తెరపైకి వస్తుండడం గమనార్హం. వారికి అదృష్టం ఎలా కలిసి వస్తుందో ఈ ఎన్నికల్లో తేలనుంది.

ముందు నుంచే వచ్చే ఎన్నికల్లో బరిలో దిగాలనే ఉద్దేశ్యంతో పలు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లారు. ముఖ్యంగా అధికార పార్టీలో ప్రస్తుతం సిట్టింగ్‌ నేతలపై వ్యతిరేకత కారణంగా టికెట్‌ వచ్చే పరిస్థితి ఉంటే టీఆర్‌ఎస్‌లోకి వెళ్లాలని ఆది నుంచి భావిస్తూ వచ్చారు. అయితే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలతో పాటు ముందస్తు టికెట్లు సిట్టింగ్‌లకే కేటాయించడంతో వీరి ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. దీంతో ఇతర ప్రధాన పార్టీల్లో చేరి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సంసిద్ధులవుతున్నారు. ప్రధానంగా ఇప్పటికే కొంత మంది ప్రధాన పార్టీలో చేరి టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ఈ పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.

రాజకీయ కుటుంబం నుంచి..
ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో రాజకీయాలను శాసించిన నేతల వారసులు ప్రస్తుతం ఈ ఎన్నికల ద్వారా రాజకీయ రంగం ప్రవేశం చేస్తుండడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ప్రధానంగా నిర్మల్‌ నుంచి దివంగత డిప్యూటీ స్పీకర్‌ అయిండ్ల భీంరెడ్డి కుమార్తె, ప్రముఖ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ స్వర్ణారెడ్డి శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా సమక్షంలో ఆ పార్టీలో చేరారు. నిర్మల్‌ ని యోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉండాలని ముందునుంచే వ్యూహరచనతో ఆమె ‘గడపగడపకూ స్వర్ణమ్మ’ పేరిట ఆ నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఆమె ఏ పా ర్టీ నుంచి బరిలోకి దిగుతారనే విషయంలో మొదటి నుంచి ఉత్కంఠగా ఉండగా, తాజాగా ఆమె బీజేపీలో చేరారు. అయితే ఇప్పటికే ఆ పార్టీ నుంచి మరో డాక్టర్‌ మల్లికార్జున్‌ రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు. దీంతో పాటు ఇతర సీనియర్‌ నాయకులు కూడా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆమె టికెట్‌ భరోసాతోనే పార్టీలో చేరారా అనే ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

‘పాల్వాయి’ తనయుడు..
సిర్పూర్‌ నియోజకవర్గంలో డాక్టర్‌ పాల్వాయి హరీశ్‌రావు రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. మాజీ ఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తంరావు కుమారుడైన పాల్వాయి హరీశ్‌రావు ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. గతంలో పురుషోత్తంరావు స్వతంత్య్ర అభ్యర్థిగా ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. మావోయిస్టుల చేతిలో మృతి చెందిన పురుషోత్తంరావు రాజకీయ వారసత్వంగా ఆయన సతీమణి పాల్వాయి రాజ్యలక్ష్మీ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరినప్పటికీ కిందటి ఎన్నికల్లో టికెట్‌ దక్కకపోవడంతో నిరాశ చెందారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ నుంచి కుమారుడు హరీశ్‌రావుకు టికెట్‌ కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించడంతో ఈ కుటుంబానికి మరోసారి చుక్కెదురైంది. ఈ పరిస్థితుల్లో ఇటీవల కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న హరీశ్‌రావు టికెట్‌ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇది  వరకే పార్టీలో ఉన్న రావి శ్రీనివాస్, గోసుల శ్రీనివాస్‌ యాదవ్‌ కూడా ఆది నుంచి పార్టీలో టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హరీశ్‌రావుకు పరిస్థితి ఎలా ఉంటుందనేది ఈ ఎన్నికల్లో తేలనుంది.

మరికొంత మంది వైద్యులు..
నిర్మల్‌ నుంచి బీజేపీలో చేరిన స్వర్ణారెడ్డి, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పాల్వాయి హరీష్‌రావు  వృత్తి రీత్యా వైద్యులు. ప్రస్తుతం ఎన్నికల్లో తమ నాడిని పరీక్షించుకోనున్నారు. కాగా ఉమ్మడి జిల్లాలో పలువురు వైద్యులు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదిలాబాద్‌ నియోజకవర్గం నుంచి డాక్టర్‌ రవికిరణ్‌ యాదవ్‌ ప్రధాన పార్టీ నుంచి బరిలో నిలవాలని ఆశిస్తున్నారు. సినీ నిర్మాతగా కూడా ఉన్న ఆయన ఈ ఎన్నికల ద్వారా రాజకీయ రంగం ప్రవేశం చేయాలని ముందు నుంచి ప్రణాళికబద్ధంగా వస్తున్నారు.

ప్రధానంగా పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. తాజాగా తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో ఏ పార్టీ నుంచి ఆయన రంగంలోకి దిగుతారనేది ఆసక్తికరం. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీల్లో ఇప్పటికే సీనియర్‌ నాయకులు ఉండడంతో మరి ఆయన అడుగులు ఎటువైపు ఉంటాయనేది వేచి చూడాల్సిందే. ముథోల్‌ నియోజకవర్గంలో తెలంగాణ జన సమితి నుంచి డాక్టర్‌ ముష్కం రామకృష్ణాగౌడ్‌ టికెట్‌ను ఆశిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ మిత్ర పక్షాల పొత్తులో భాగంగా ముథోల్‌ స్థానం ఎవరికి దక్కుతుందో అనే దానిపై ఆయన పోటీ చేసేది తేలనుంది.

ఉద్యోగాలకు రాజీనామా..
ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా బరిలో దిగాలని కొంతమంది ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేసి ముందుకు వస్తున్నారు. ప్రధాన పార్టీల్లో తమకు ఉన్న పరిచయాల ద్వారా టికెట్‌ విషయంలో భరోసా తీసుకొని ముందుకు కదులుతుండడం ఆసక్తి కలిగిస్తుంది. దండేపల్లి మండలానికి చెందిన ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ బొర్లకుంట వెంకటేశ్‌ నేత చెన్నూర్‌ నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ను ఆశిస్తున్నారు. ఎక్సైజ్‌ డీసీగా పని చేసిన ఆయన ఇప్పటికే ఉద్యోగానికి రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్‌ పార్టీలో జాతీయ స్థాయి నేత కొప్పుల రాజు ఆశీస్సులతో టికెట్‌పై గంపెడు ఆశలు పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతేడాది రేవంత్‌రెడ్డితో పాటు పార్టీలో చేరిన బోడ జనార్ధన్‌ స్థానికంగా టికెట్‌ను ఆశిస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంటుందోననేది ఆసక్తికరంగా మారింది.

ఆదిలాబాద్‌ పరిశ్రమల శాఖ జీఎం రాంకిషన్‌నాయక్‌ ఖానాపూర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ను ఆశిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో కొంతమంది సీనియర్ల ద్వారా టిక్కెట్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఖానాపూర్‌ నుంచి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన చారులత టికెట్‌ను ఆశిస్తున్నారు. ఆమె భర్త నీటి పారుదల శాఖలో ఇంజినీర్‌గా పని చేస్తున్నా రు. గతంలో కేసీఆర్‌ సేవాదళంలో పని చేసిన ఆమె కొద్ది నెలల కిందట కాంగ్రెస్‌లో చేరారు. ఖానాపూర్‌ నుంచి పలువురు నేతలు టిక్కెట్‌ ఆశతో కాంగ్రెస్‌ పార్టీలో ప్రయత్నాలు చేస్తుండగా, తాజాగా టీఆర్‌ఎస్‌ అసంతృప్తి నేత రాథోడ్‌ రమేశ్‌ కాంగ్రెస్‌ వైపు వస్తున్నారనే ప్రచారం జరుగుతుండడం వీరిలో ఆందోళన కలిగిస్తోంది. బెల్లంపల్లి లో హైకోర్టు న్యాయవాది ఉదయ్‌కాంత్‌ కాంగ్రెస్‌ టికెట్‌ను ఆశిస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి బోథ్‌లో డీసీఎంఎస్‌ డైరెక్టర్‌గా ఉన్న కుమ్ర కోటేశ్వర్, ఆదిలాబాద్‌లో మైనార్టీసెల్‌ జిల్లా అధ్యక్షుడు సా జిద్‌ఖాన్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా పలువురు కొత్త ముఖాలు రాజకీయ భవిష్యత్‌ కోసం పరితపిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top