మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పక్కా వ్యూహం 

TRS Following Strategic Plans Regarding Muncipal Elections - Sakshi

మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షణ..

రిజర్వేషన్లు ఖరారు కాగానే అభ్యర్థుల ఎంపిక

సాక్షి, మెదక్‌: ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ విడుదల చేసి వారం రోజులవుతుండడంతో ఇప్పటికే ఎన్నికల వ్యూహంపై జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు అంతర్గతంగా మంతనాలు జరుపుతున్నారు. మున్సిపాలిటీల వారీగా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించి ఎన్నికల సమరానికి శంఖం పూరించడానికి సర్వ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేశారు. ఈ నెల 5న రిజర్వేషన్ల ప్రకటన, 7వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల నాటికి అన్ని మున్సిపాలిటీల్లో కార్యకర్తల సమావేశాలు పూర్తి చేయాలని నిర్ణయించారు.

గత అన్ని ఎన్నికల్లోనూ అనూహ్య ఫలితాలు 
ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లోనూ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అనూహ్య ఫలితాలను సాధించింది. 18 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో ఇంత ఉచ్ఛస్థితి ఫలితాలను ఆ పార్టీ ఊహించి ఉండదు. ఆశించిన, అనుకున్నదాని కంటే కూడా ఎక్కువ ఫలితాలను సాధించింది. అదే ఉత్సాహంతో 100 శాతం ఫలితాలను సాధించాలనే పట్టుదలతో పార్టీ జిల్లా అగ్ర నేతలున్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని ఐదు స్థానాల్లో ఒక్క సంగారెడ్డిలో కాంగ్రెస్‌ అభ్యర్థి మినహా మిగతా నాలుగు నియోజకవర్గాలైన జహీరాబాద్, అందోల్, పటాన్‌చెరు, నారాయణఖేడ్‌లలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులే గెలుపొందారు.

జిల్లా పరిధిలోకి వచ్చే జహీరాబాద్, మెదక్‌ పార్లమెంట్‌ స్థానాల్లో సైతం టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డిలు గెలుపొందారు. గత ఏడాది జనవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలోని 647 సర్పంచ్‌ స్థానాలకు గాను 446, మొత్తం 295 ఎంపీటీసీ స్థానాలకు గాను 178, 25 జెడ్పీటీసీ స్థానాలకు గాను 20 చోట్ల టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించింది. ఇదే ఉత్సాహంతో మున్సిపల్‌ ఎన్నికల్లో పాగా వేయాలని కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.  

ఇన్‌చార్జిల నియామకం.. 
మున్సిపల్‌ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ అధిష్టానం పక్కా వ్యూహంతో వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ ముఖ్య నేతలతో మంత్రి హరీశ్‌రావు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు.  జిల్లాలోని 8 మున్సిపాలిటీల్లో తప్పనిసరిగా గెలవాలనే ఉద్దేశంతో ఎన్నికల ఇన్‌చార్జిలను నియమించారు. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నేత పట్లోళ్ల జైపాల్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి బక్కి వెంకటయ్యలను నియమించారు. ఈ నెల 7న నోటిఫికేషన్‌ అనంతరం వీరు పూర్తి స్థాయిలో పని చేయడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.  

ఎమ్మెల్యేలకే అభ్యర్థుల ఎంపిక, గెలుపు బాధ్యతలు 
జిల్లాలో మొత్తం 8 మున్సిపాలిటీలు ఉన్నాయి. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, అందో ల్‌/జోగిపేట్, నారాయణఖేడ్, తెల్లాపూర్, బొల్లారం, అమీన్‌పూర్‌ మున్సిపాలిటీలు ఉన్నా యి.  కోర్టులో కేసు ఉన్న కారణంగా జహీరాబా ద్‌ మున్సిపాలిటీలో  ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం లేదు. స్థానిక పరిస్థితులు, రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థుల ఎంపికతోపాటు గెలిపించే బాధ్యతలను సైతం స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే లకే అప్పగించాలని టీఆర్‌ఎస్‌ అధిష్టానం నిర్ణయించింది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు లేని చో ట మాజీ ఎమ్మెల్యేలు లేదా పార్టీ ఇన్‌చార్జిలు ఈ బాధ్యతలను నిర్వహించనున్నారు.

కాగా సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే లేకపోవడంతో ఇక్కడ 2018లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు ఈ బాధ్యతలు అప్పగించినట్లు స మాచారం. ఈ మేరకు అధిష్టానం నుంచి ఇప్పటికే సంకేతాలు అందినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఏ ఎన్నికలొచ్చినా ట్రబుల్‌ షూటర్‌గా పేరొందిన మంత్రి హరీశ్‌రావుకు ఉమ్మడి జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల పర్యవేక్షణ, గెలుపు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.

ఈ మేరకు ఆయన ఇప్పటికే ప్రజాప్రతినిధులు, పార్టీకి చెందిన ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపుకోసం టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాచరణను సిద్ధం చేసి అందుకు అనుగుణంగా ముందుకు వెళ్తోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top