టీఆర్‌ఎస్‌ క్లీన్‌స్వీప్‌

TRS Clean Sweep In Peddapalli Municipal Elections - Sakshi

గులాబీ ఖాతాలో పుర పీఠాలు

సాక్షి, పెద్దపల్లి : బల్దియా ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సంపూర్ణమైంది. స్పష్టమైన మెజార్టీ వచ్చిన మూడు మున్సిపాలిటీలతోపాటు, కాస్త వెనుకపడిన కార్పొరేషన్‌ అధ్యక్ష పీఠాలను అధికార టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. నాలుగు పురపాలికల్లో మేయర్, డిప్యూటీ మేయర్, చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ల ఎన్నిక సోమవారం నిర్వహించారు. ఊహించినట్లుగానే రామగుండం మేయర్‌గా బంగి అనిల్‌ ఎన్నికయ్యారు. పెద్దపల్లిలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కోడలు మమతారెడ్డి, మంథనిలో జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధు భార్య పుట్ట శైలజ, సుల్తానాబాద్‌లో చైర్‌పర్సన్‌గా ముత్యం సునీత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

క్యాంపుల నుంచి కౌన్సిల్‌కు
మేయర్, చైర్మన్‌ ఎన్నికల కోసం క్యాంపుల్లో ఉన్న విజేతలు నేరుగా ఆయా మున్సిపల్‌ కౌన్సిళ్లకు ఉదయం చేరుకున్నారు. రామగుండంలో టీఆర్‌ఎస్, ఫార్వర్డ్‌బ్లాక్, స్వతంత్ర, బీజేపీ కార్పొరేటర్లు స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో కలిసి కార్పొరేషన్‌ కార్యాలయానికి వచ్చారు. ముందే నిర్ణయించిన ప్రకారం మేయర్‌గా బంగి అనిల్‌కుమార్, డిప్యూటీ మేయర్‌గా నడిపెల్లి అభిషేక్‌రావును సభ్యులు ప్రతిపాదించగా, 18 మంది టీఆర్‌ఎస్, 9 మంది ఫార్వర్డ్‌బ్లాక్, ఇద్దరు బీజేపీ, స్వతంత్రులు ఆరుగురుతోపాటు ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా కోరుకంటి చందర్‌ మద్దతు ప్రకటించారు. దీనితో బంగి అనిల్‌ మేయర్‌గా, నడిపెల్లి అభిషేక్‌రావు డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. పెద్దపల్లి మున్సిపాలిటీలో ప్రమాణస్వీకారం అనంతరం ఎన్నిక నిర్వహించగా, చైర్‌పర్సన్‌గా చిట్టిరెడ్డి మమతారెడ్డి, వైస్‌ చైర్‌పర్సన్‌గా నజ్మీన్‌ సుల్తానా నామినేషన్లు మాత్రమే రావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.

ఇక మంథనిలో ముందు నుంచి ప్రచారంలో ఉన్నట్లుగానే జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధు భార్య, మాజీ సర్పంచ్‌ పుట్ట శైలజ చైర్‌పర్సన్‌గా, ఆరెపల్లి కుమార్‌ వైస్‌చైర్మన్‌గా ఎన్నికయ్యారు. సుల్తానాబాద్‌లో చైర్‌పర్సన్‌కు ముత్యం సునీత, బిరుదు సమత, గాజుల లక్ష్మి పోటీపడగా, ముత్యం సునీతను చైర్‌పర్సన్‌ పీఠం వరించింది. మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కోడలు బిరుదు సమత వైస్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అన్ని మున్సిపాల్టీల్లో టీఆర్‌ఎస్‌కు ఆధిక్యం ఉండడంతో ఇతర పార్టీలు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్లకు పోటీకూడా పడలేదు. కాగా ఎన్నికల ప్రక్రియలో రామగుండం కార్పోరేషన్‌కు జేసీ వనజాదేవి, పెద్దపల్లి మున్సిపాల్టీకి ఆర్డీవో శంకర్‌కుమార్, సుల్తానాబాద్‌ మున్సిపాల్టీకి ఇన్‌చార్జి డీఆర్‌వో కె.నరసింహామూర్తి, మంథనికి జిల్లా సహకారాధికారి చంద్రప్రకాశ్‌రెడ్డి ఇన్‌చార్జీలుగా వ్యవహరించారు. సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top