పంపులకు ‘పవర్‌’ కట్‌!

TRANSCO Stops Power Supply To Kalwakurthy Pumps For Pending Dues - Sakshi

పాలమూరు జిల్లాలోని ఎత్తిపోతల పథకాల్లో ఏడాదిగా విద్యుత్‌ బకాయిలు

ఏకంగా రూ. 957 కోట్ల బిల్లులకు దక్కని మోక్షం

కల్వకుర్తి పంపులకు విద్యుత్‌ సరఫరా నిలిపివేసిన ట్రాన్స్‌కో

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలకు విద్యుత్‌ బకాయిలు చెల్లించడంలో నీటిపారుదల శాఖ చేతులెత్తేస్తుండటంతో విద్యుత్‌ శాఖ కొరడా ఝళిపిస్తోంది. ఇప్పటివరకు చార్జీలు చెల్లించాలని నోటీసులు మాత్రమే ఇచ్చిన ట్రాన్స్‌కో ఇప్పుడు ఏకంగా పంపులకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తుండటంతో నిధులు లేక నీటిపారుదల శాఖ దిక్కులు చూస్తోంది. ముఖ్యంగా పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమాల పరిధిలో ఏకంగా రూ.957 కోట్ల మేర బిల్లులు చెల్లించకపోవడంతో వచ్చే ఖరీఫ్‌ నుంచి పంపులు నడపడంపై అయోమయం నెలకొంది.
 
ఏడాదిగా దాటవేతే.. 
రాష్ట్రంలో ప్రస్తుతం అలీసాగర్, గుత్ప, ఉదయసముద్రం, దేవాదుల, ఎల్లంపల్లి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి వంటి ఎత్తిపోతల పథకాల ద్వారా నిర్దేశించిన ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తున్నారు. నీటిని తీసుకునే సామర్థ్యాన్ని బట్టి ఒక్కో ప్రాజెక్టు పరిధిలో పంపు మోటార్లు, వాటికి అనుగుణంగా విద్యుత్‌ అవసరాలను గుర్తించారు. ప్రస్తుతం 14 ఎత్తిపోతల పథకాలు పనిచేస్తుండగా, వీటికోసం 1,410 మెగావాట్ల మేర విద్యుత్‌ వినియోగం జరుగుతోంది. 90 రోజులపాటు నడిచే ఈ ఎత్తిపోతల పథకాలకు యూనిట్‌కు 6.40 చొప్పున గణించినా, రూ.1,750 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. ఇందులో పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి పరిధిలో 450 మెగావాట్లు, భీమాలో 96, నెట్టెంపాడులో 119 మెగావాట్ల విద్యుత్‌ అవసరం ఉంటుందని లెక్కించారు. ఇందులో ఇప్పటికే కల్వకుర్తి పరిధిలో మూడు స్టేజీల లిఫ్టు పరిధిలో 50 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న 5 పంపులను పాక్షికంగా నడిపి 2018 ఖరీఫ్, రబీలో మొత్తంగా 31 టీఎంసీల నీటిని ఆయకట్టుకు తరలించారు. దీనికోసం 270 మెగావాట్ల మేర విద్యుత్‌ను వినియోగించారు.

దీనికి సంబంధించి 2018లోనే రూ.550 కోట్ల మేర విద్యుత్‌ చార్జీలను ట్రాన్స్‌కోకు చెల్లించాల్సి ఉంది. దీంతో పాటే అంతకుముందు ఏడాది ఉన్న బకాయిలు కలిపి మొత్తంగా  రూ.777.45 కోట్లు విద్యుత్‌ బిల్లు కట్టాల్సి ఉంది. ఏడాదికి పైగా ఈ బిల్లులు చెల్లించడం లేదు. దీంతో అడపాదడపా నోటీసులు ఇస్తున్న ట్రాన్స్‌కో తొలి దశలో ప్రాజెక్టు క్యాంపు కార్యాలయాలకు కరెంట్‌ కట్‌ చేసింది. తదనంతరం తాజాగా జొన్నలబొగడ పంప్‌హౌజ్‌కు విద్యుత్‌ సరఫరా నిలిపివేసింది. ఇక భీమా పరిధిలో 12 మెగావాట్లు, 4 మెగావాట్ల సామర్థ్యంతో 6 మోటార్లు ఉండగా, ఈ ప్రాజెక్టు పరిధిలో 12.12 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. దీనికి సంబంధించి రూ.74.85 కోట్ల బిల్లులు కట్టలేదు. వీటికి సంబంధించి ట్రాన్స్‌కో ఇదివరకే నోటీసులు పంపింది. ఇక నెట్టెంపాడు పరిధిలో 17 మెగావాట్లున్న 7 మోటార్ల ద్వారా 6.78 టీఎంసీల నీటిని ఎత్తిపోయగా, ఇక్కడ విద్యుత్‌ బిల్లులు రూ.104.70 కోట్లు చెల్లించాల్సి ఉన్నా వాటికి మోక్షం లేదు. ఈ మూడు ప్రాజెక్టుల పరిధిలోనే ఏకంగా రూ.957 కోట్ల మేర బకాయిలు పేరుకుపోవడం, వాటి విడుదలలో ఆర్థిక శాఖ చేస్తున్న జాప్యం పథకాలకు గుదిబండగా మారింది. గతంలోనే ఇలాంటి సమస్య వచ్చినప్పడు, విద్యుత్‌ సరఫరా నిలిపినప్పుడు అప్పటి సాగునీటిశాఖ మంత్రి హరీశ్‌రావు స్వయంగా జోక్యం చేసుకొని ట్రాన్స్‌కో అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో అధికారులు తల పట్టుకుంటున్నారు.

మున్ముందు సవాళ్లే... 
ఇక ఈ ఏడాది ఖరీఫ్‌ నుంచి ఈ మూడు ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికింద నిర్ణీత 7 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది. అదే జరిగితే కనిష్టంగా వీటి కిందే 600 మెగావాట్ల మేర విద్యుత్‌ అవసరాలు ఉంటాయి. పాత బకాయిలు చెల్లించకుండా ఈ స్థాయిలో విద్యుత్‌ సరఫరా చేయాలంటే ట్రాన్స్‌కో ఎలా స్పందిస్తుందన్నది పెద్ద ప్రశ్న. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జోక్యం అవసరం ఉంటుందన్న అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. 

ప్రాజెక్టుల్లో బకాయిలు ఇలా.. 
ప్రాజెక్టు      ఎత్తిపోసిన నీరు (టీఎంసీల్లో)    విద్యుత్‌ బిల్లు బకాయి(రూ. కోట్లలో) 
కల్వకుర్తి         31                                777.45 
నెట్టెంపాడు      6.78                             104.70 
బీమా            12.12                           74.85 
మొత్తం           49.90                           957   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top