ఒమన్‌లో విషవాయువులతో ముగ్గురు మృతి 

three people died of poisons in Oman - Sakshi

మృతుల్లో ఇద్దరు తెలంగాణ కార్మికులు, మరొకరు తమిళనాడు వాసి

మోర్తాడ్‌ (బాల్కొండ): ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని ఒమన్‌ దేశానికి వెళ్లిన ఇద్దరు తెలంగాణ కార్మికులు విషవాయువు ప్రభావంతో మృత్యువాత పడ్డారు. శనివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో మొత్తం ముగ్గురు కార్మికులు మరణించారు. అందులో ఒకరు నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ వాసి తిరుమలేశ్‌ కాగా, మరొకరు జగిత్యాల జిల్లా కొండగట్టు ప్రాంతానికి చెందిన రమేశ్‌ అని తెలిసింది. మరో వ్యక్తి తమిళనాడు రాష్ట్రానికి చెందిన మణిగా గుర్తించారు. ఉపాధి కోసం ఒమన్‌కు వెళ్లిన తెలంగాణ, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల కార్మికులు అక్కడి షిప్‌యార్డులో ఓడల నుంచి సరుకులను లోడింగ్, అన్‌లోడింగ్‌ చేస్తుంటారు. ఎప్పటిలాగే శనివారం ఒడ్డుకు చేరుకున్న షిప్‌ నుంచి సరుకులను దించేందుకు తిరుమలేశ్‌ కిందికి దిగగా, విషవాయువు ప్రభావంతో సొమ్మసిల్లి పడిపోయాడు.

అతడిని రక్షించాలనే ఉద్దేశంతో రమేశ్‌ కార్గో షిప్‌లోకి దిగడంతో అతను కూడా సొమ్మసిల్లాడు. వీరిద్దరిని గమనించిన మణి అరుస్తూ కార్గో షిప్‌లోకి వేగంగా వెళ్లడంతో విషవాయువు గుప్పుమని అతనూ కింద పడిపోయాడు. ముగ్గురు కార్మికులు ఒకరి వెనుక మరొకరు సొమ్మసిల్లి పడిపోవడంతో మిగతా కార్మికులు, సేఫ్టీ బృందం గమనించి విషవాయువు వస్తున్న ప్రాంతంలో దాన్ని నిరోధించే మందును స్ప్రే చేశారు. కాగా, సొమ్మసిల్లి పడిపోయిన ముగ్గురు కార్మికులను ఆస్పత్రిలోకి తీసుకెళ్లే క్రమంలోనే వారు మరణించారు.

కార్గో షిప్‌ సముద్రంలో ప్రయాణించే సమయంలో ప్రాణాంతకమైన జలచరాలు వచ్చి చేరుతుంటాయి. వీటిని సంహరించడానికి రసాయనాలను షిప్‌లో చల్లుతారు. కార్గో షిప్‌ ఒడ్డుకు చేరుకున్న తరువాత రసాయనాలు నింపి ఉన్న అరల తలుపులను గంటపాటు తెరిచి ఉంచాలి. అయితే సేఫ్టీ బృందం ఇదేమీ పట్టించుకోక పోవడంతో కార్మికులు విషవాయువుల బారిన పడి మృత్యువాత పడినట్లు మృతుల సన్నిహితులు కుదురుపాక ప్రదీప్, నూగూరు రణధీర్‌ ఫోన్‌లో ‘సాక్షి’కి వివరించారు. తిరుమలేశ్‌ ఆరోగ్యం బాగాలేక పోవడంతో నెలరోజుల క్రితమే ఇంటికి వచ్చి చికిత్స చేయించుకుని ఒమన్‌ వెళ్లాడు. అక్కడకు వెళ్లిన కొన్నిరోజులకే మృత్యువాత పడటాన్ని అతని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. తమవారి మృతదేహాలను త్వరగా రప్పించాలని మృతుల కుటుంబీకులు కోరుతున్నారు.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top