పంట పొలాల్లో మృత్యుహేల

Three Died In Bellampalli For Power Shock - Sakshi

విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి

ఐదుగురికి గాయాలు

పొలంలో స్తంభాలు వేస్తుండగా ప్రమాదం

హైటెన్షన్‌ వైర్లకు తాకడంతో స్తంభానికి విద్యుత్‌ సరఫరా

అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన రైతులు

అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం

వేమనపల్లి(బెల్లంపల్లి): విద్యుత్‌ తీగలు యమపాశాలయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం ఖరీదు మూడు నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి. విద్యుత్‌ స్తంభాలు వేస్తుండగా పై నున్న హైటెన్షన్‌ వైర్లు తగిలి విద్యుత్‌ సరఫరా కావడంతో ముగ్గురు మృతిచెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం వేమనపల్లి మండలంలోని ముల్కలపేట గ్రామ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. అధికారుల నిర్లక్ష్యంతో గ్రామానికి చెందిన గొండె చిన్నరామన్న(60), చిన్న సురేందర్‌(22), వశాఖ భీంరావ్‌(25) బలయ్యారు.

వివరాల్లోకి వెళితే.. ముల్కలపేట శివారులో ఉన్న వ్యవసాయ పొలాలకు విద్యుత్‌ లైన్‌ కోసం చిన్నగొడె రామన్న, రామగిరి పున్నం, సూసర్ల రమేశ్, జంబోజి వెంకటస్వామి దరఖాస్తు చేసుకున్నారు. వీరికి తలా ఎకరం, అర ఎకరం పొలాలున్నాయి. ఒక్కో రైతు మామూళ్ల కింద సుమారు రూ.25వేలు చొప్పున అధికారులకు చెల్లించారు. వీరికి గతేడాది విద్యుత్‌ లైన్‌ మంజూరయింది. ఆరు నెలల క్రితం మండల ఏఈ ట్రాన్స్‌ఫార్మర్‌ అందజేశారు. రైతులే సబ్‌స్టేషన్‌కు వెళ్లి తెచ్చుకున్నారు. నిబంధనల ప్రకారం ట్రాన్స్‌కో కాంట్రాక్టర్‌ విద్యుత్‌ లైన్‌ అమర్చాలి.

కనెక్షన్‌ ఇవ్వడంలో కాలయాపన..
రైతులు ఆరు నెలలుగా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. కాంట్రాక్టర్‌ వచ్చి విద్యుత్‌లైన్‌ అమర్చాలంటే ఆలస్యం అవుతుందని ఏఈ మాట దాటవేస్తూ వచ్చాడు. దీంతో రైతులే లైన్‌ నిర్మాణానికి ముందుకు వచ్చారు. ఏఈ ఆదేశాలతో నిబంధనలకు విరుద్ధంగా నీల్వాయికి చెందిన విద్యుత్‌ శాఖ కాంట్రాక్ట్‌ వర్కర్‌ శంకర్‌ లైన్‌ అమర్చేందుకు రైతులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. తానే కూలీలను తీసుకొచ్చి లైన్, ట్రాన్స్‌ఫార్మర్‌ అమర్చుతానని 15 రోజులుగా తిప్పుకుంటున్నాడు. కాని కూలీలను తీసుకురాకుండా రైతులతోనే స్తంభాల కోసం గోతులు తవ్విం చాడు. రైతులతోనే ట్రాన్స్‌ఫార్మర్‌కు ప్లాట్‌ఫారమ్‌(గద్దె) కట్టించాడు. తాళ్ల సహాయంతో ఆదివారం ఆరు స్తంభాలను గోతుల్లోకి దించి నిలబెట్టారు. ఎల్‌సీ తీసుకోకుండానే స్తంభాలను లైన్‌గా సరిచేస్తున్నారు. పైన ఉన్న లెవన్‌కేవీ(మేన్‌లైన్‌)కు విద్యుత్‌ లైన్‌కు సరఫరా ఉండడంతో స్తంభంలో ఉన్న చువ్వలకు విద్యుత్‌ సరఫరా అయింది. దీంతో స్తంభం చేతితో పట్టుకుని సరి చేస్తున్న చిన్నగొండె రామన్న, అతని సోదరుడు పోచన్న కొడుకు సురేందర్, వెంట వచ్చిన కూలీ వశాఖ భీంరావ్‌ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. తాడు సహాయంతో అదే స్తంభాన్ని పట్టుకున్న తేర్కరి లచ్చన్న, రామగిరి పున్నం, జంబోజి వెంకటస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరు రైతులు బోర్కుటి పరవేశి, కొండ్ర రమేశ్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

రాత్రి దాకా ఆందోళన..
మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ మండలానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు, బంధువులు మృతదేహాలతో రాత్రి వరకూ పొలాల్లోనే ఆందోళనకు దిగారు. మృతుల కుటంబాలకు రూ.20 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేయాలని డిమాండ్‌ చేశారు. బాధ్యులైన సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నూర్‌రూరల్‌ సీఐ జగదీష్, నీల్వాయి, చెన్నూర్, కోటపల్లి ఎస్సైలు భీమేష్, ప్రమోద్, వెంకన్న ఆందోళనకారుల వద్దకు వెళ్లి సముదాయించే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. రాత్రి జైపూర్‌ ఏసీపీ వెంకటరెడ్డి, బెల్లంపల్లి ట్రాన్స్‌కో డీఈ ఘటనా స్థలానికి వెళ్లి నచ్చజెప్పారు. ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల చొప్పున నష్టపరిహారం, రైతుబీమా, ఆపద్బంధు సాయం, డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు అందేలా సహకరిస్తామన్నారు. కాంట్రాక్టర్, సంబధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది.  

అధికారుల నిర్లక్ష్యంతోనే...
బెల్లంపల్లి: ఆరు నెలల క్రితం విద్యుత్‌ లైన్‌ వేసి ఉంటే ఆ ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసేవి కావు. ముమ్మాటికీ విద్యుత్‌ అధికారులు, విద్యుత్‌ కాం ట్రాక్టర్‌ పూర్తి నిర్లక్ష్యం వల్లే మూడు నిండు ప్రాణా లు బలయ్యాయి. వాస్తవంగా విద్యుత్‌ లైన్‌ను కాంట్రాక్టర్‌తో ఏర్పాటు చేయించాల్సి ఉంది. కాని తీవ్ర కాలయాపన చేయడంతో రైతులే ముం దుకొచ్చి లైన్‌ వేసుకునే పనులకు సిద్ధపడ్డారు. లైన్‌ ఏర్పాటు చేయడంలో రైతులు, కూలీలకు సరైన అవగాహన లేకపోవడం వల్ల అనూహ్యంగా ప్రమాదం జరిగి మృతుల కుటుం బాల్లో తీవ్ర వేదన మిగిల్చింది. సదరు రైతులకు వ్యవసాయ విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు చేయడం కోసం కాంట్రాక్టర్‌ కేదారినాథ్‌తో విద్యుత్‌ అధికారులు అగ్రిమెంట్‌ కూడా చేసుకున్నారు. కాని కాంట్రాక్టర్‌ సకా లంలో విద్యుత్‌ లైన్‌ పనులు చేపట్టకుండా జాప్యం చేసినట్లు ఆరోపణలు న్నాయి. ఆ ప్రాంతంలో ఆరునెలల క్రితం ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేశారు. అదే క్రమంలో రైతులకు విద్యుత్‌ లైన్‌ వేయడానికి కరెంట్‌ మెటీరియల్‌ను కూడా కొన్ని నెలల క్రితమే కాంట్రాక్టర్‌ డ్రా చేసుకున్నట్లు తెలుస్తోంది. కాని మృతి చెందిన రైతులకు సంబంధించిన విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వకుండా తీవ్ర నిర్లక్ష్యం చేశారు. ఆరునెలల క్రితం ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేసినప్పుడే విద్యుత్‌లైన్‌ వేసి, కనెక్షన్‌ ఇచ్చి ఉంటే ఇప్పడు ఆ ప్రమాదం జరిగి ముగ్గురు మృతిచెంది, మరో ఐదుగురు గాయపడే వారు కాదని బాధిత కుటుంబీకులు, గ్రామస్తులు అంటున్నారు.

అక్కల పెళ్లి ఎప్పుడు చేస్తవ్‌ తమ్మి..
‘అక్కల పెళ్లి చేయందే తాను పెళ్లి చేసుకోనంటివి. అందరినీ అనాథలను చేసి అందని లోకాలకు పోతివా.. తమ్మీ’ అంటూ విద్యుత్‌ శాఖలో దినసరి కూలీగా పనిచేస్తూ మృత్యువాత పడిన వశాఖ భీంరావ్‌ నలుగురు అక్కలు మృతదేహంపై పడి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటన ప్రమాద స్థలంలో పలువురి గుండెలను పిండేసింది. నీల్వాయికి చెందిన భీంరావ్‌ పదేళ్లుగా విద్యుత్‌ శాఖలో దినసరి కూలీగా పని చేస్తున్నాడు. తండ్రి బిక్కుమేర చిన్ననాటనే చనిపోయాడు. తల్లి మల్లక్క వృద్ధురాలు. ఇద్దరు సోదరులు పెద్ద అన్న వెంకటేశ్‌ మానసిక వికలాంగుడు. చిన్న అన్న మధునయ్య వేరే కాపురం ఉంటున్నాడు. నలుగురు అక్కలు శంకరక్క, సత్తక్క, లక్ష్మి, రమకు వివాహం కాలేదు. వీరందరూ భీంరావ్‌ చేసే కూలీ పని పైనే ఆధారం.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top