
అలంపూర్ రూరల్: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ వద్ద భూగర్భంలో క్రూడాయిల్, పెట్రోల్, గ్యాస్ వంటి చమురు నిక్షేపాలు ఉన్న ట్టు భారతీయ ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్‌జీ సీ) గుర్తించినట్లు సమాచారం. సహజ సిద్ధ వాయువులు గ్యాస్, పెట్రో, డీజిల్‌పై నిత్య పరిశోధనల్లో భాగంగా శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా ఈ ప్రాంతంలో చమురు నిక్షేపాలు ఉండటాన్ని గుర్తించారు. మరింత సమాచారం కోసం పరిశోధనల బాధ్యతలను ‘గ్లోబల్ ఎకాలజిస్ట్ ప్రైవేట్ లిమిటెడ్’కు అప్పగించారు.
ఈ సందర్భంగా సంస్థ ఉద్యోగులు మూడు రోజులుగా జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ తుంగభద్ర నదీ తీరమైన సుల్తానాపూర్ నుంచి నదీ తీర గ్రామాలైన అలంపూర్, కాశీపురం, సింగవరం, భైరాపురం పరిసరాల్లో చమురు నిక్షేపాల అన్వేషణకు పరిశోధనలు జరిపారు. చమురు నిక్షేపాల ప్రకంపనల వివరాలను ఉప గ్రహాల ద్వారా గమనిస్తూ వాటి నిష్పత్తిని ఓఎన్‌జీసీ ప్రధాన కార్యాలయమైన డెహ్రాడూన్‌కు పంపారు. అలంపూర్‌లో మూడు రోజుల పాటు చేపట్టిన పరిశోధనలు సోమవారం ముగియగా.. ప్రస్తుతం కర్నూలు జిల్లా పంచ లింగాలకు వెళ్లారు. తెలంగాణలోని రాజోళిలో కూడా పరిశోధన సాగే అవకాశం ఉంది. ఖమ్మం వంటి ప్రాంతాల్లో కూడా పరిశోధనలు చేసే అవకాశముందని సమాచారం.