ఎట్టకేలకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. దామరచర్ల మండలం దిలావర్‌పూర్ అటవీరేంజ్‌లో
ఈనెల 8న సాయంత్రం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన
అదే రోజు నక్కలగండి, వాటర్‌గ్రిడ్ పైలాన్‌కు కూడా..
నల్లగొండలో భారీ బహిరంగసభ
పవర్‌ప్లాంటు నిర్వాసితులతో భేటీ అయిన మంత్రి జగదీశ్‌రెడ్డి
(సాక్షి ప్రతినిధి, నల్లగొండ): ఎట్టకేలకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. దామరచర్ల మండలం దిలావర్‌పూర్ అటవీరేంజ్‌లో భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) సహకారంతో నిర్మించతలపెట్టిన 4వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుకు ఈనెల 8వ తేదీన సాయంత్రం 4:40 నిమిషాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేయనున్నారు. యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంటుకు ఇప్పటికే పలుమార్లు శంకుస్థాపనల తేదీలను ప్రకటించినా అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని, ఈనెల 8న శంకుస్థాపన ము హూర్తంఖరారైందని అధికార వర్గాలు తెలిపాయి. అదే రోజు నక్కలగండి ప్రాజెక్టు, చౌటుప్పల్‌లోని వాటర్‌గ్రిడ్ పైలాన్‌కు కూడా సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. ఇందుకోసం ఆయన హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో జిల్లాకు రానున్నారు. తొలుత దామరచర్లలో శంకుస్థాపన అనంతరం నక్కలగండి ప్రాజెక్టుకు సాయంత్రం 5:20 నిమిషాలకు, ఆ తర్వాత చౌటుప్పల్‌లో సాయంత్రం ఆరుగంటలకు వాటర్ గ్రిడ్ పైలాన్‌ను ఆయన ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమాల అనంతరం రోడ్డు మార్గంలో నల్లగొండకు వచ్చి ఎన్జీ కళాశాల మైదానంలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాల కోసం అటు అధికార యం త్రాంగం, ఇటు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
మంచి ప్యాకేజీ ఇచ్చే యోచన
దామరచర్ల పవర్‌ప్లాంటు నిర్మాణం కారణంగా నిర్వాసితులయ్యే వారికి, భూములు కోల్పోయే వారికి మంచి ప్యాకేజీ ఇచ్చే యోచనలో ఉన్నట్టు అధికార వర్గాలు చెపుతున్నాయి. ఇదే విషయమై స్థానికులతో చర్చించేందుకు మంగళవారం మం త్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కరరావు, కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, జేసీ సత్యనారాయణతో కలిసి దామరచర్ల మండలంలో పర్యటించారు. మోదుగుల తండా, కప్పూరి తండాలలో గిరిజనులతో కలిసి ఆయన చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్వాసితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పారు. సీఎం కేసీఆర్ కూడా నిర్వాసితుడేనని, మిడ్‌మానేరు ప్రాజెక్టు కింద కేసీఆర్ గ్రామం మునిగిపోవడంతో ఆయన కుటుం బం చింతమడకకు వెళ్లిందని చెప్పారు.
ఓ నిర్వాసితుడిగా, ఓ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అందరికీ న్యాయం చేస్తారని చెప్పారు. అయితే కొత్త భూసేకరణ చట్టం అమలు రాష్ట్రంలో దామరచర్ల నుంచే చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు 1710 ఎకరాల భూములు కోల్పోయే వారికి మార్కెట్ ధర కన్నా మూడు రెట్ల నష్టపరిహారాన్ని ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు ఇళ్లు కోల్పోయేవారికి పరిహారంతో పాటు కొత్త ఇల్లు క ట్టిస్తామని, ఇల్లు మారేందుకు గాను రూ.50వేలు ఇస్తామని, అనంతరం నెలకు రూ.3వేల చొప్పున 12 నెలల పాటు ఖర్చులు చెల్లిస్తామని, ఇల్లు పూర్తయిన అనంతరం వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద మరో 50వేల రూపాయలు ఇస్తామని కలెక్టర్ నిర్వాసితులకు వివరించారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న ఆందోళనలను కూడా సర్దుమణిగేలా చేసి సీఎం శంకుస్థాపన కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించే దిశలో అధికార యంత్రాంగం పనిచేయనుంది.
నాలుగేళ్లలో పూర్తి
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు పేరుతో నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు బీహెచ్‌ఈఎల్‌తో రూ.17950 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు ఇటీవలే ఒప్పందం కూడా కుదుర్చుకుంది. మొత్తం నాలుగు వేల మెగావాట్లకు గాను 800 మెగావాట్ల చొప్పున 5 టర్బైన్‌లను నిర్మించనున్నారు. మొదటి రెండు టర్బైన్లను మూడేళ్లలో, మిగిలిన మూడు టర్బైన్లను నాలుగేళ్లకాలంలో నిర్మించేలా ప్రణాళికలు తయారయ్యాయి. ఒక్కో మెగావాట్‌కు 4.8 కోట్ల రూపాయల చొప్పున వ్యయం చేయనున్నారు.