ఆవిరవుతున్న ప్రాణాలు

Temperature Hike In Nizamabad - Sakshi

ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌): జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఎండ తీవ్రత తో ఉపాధి హామీ కూలీలకు ప్రాణసంకటం గా మారింది. పనులకు వెళ్తున్న వారు తిరిగి ఇంటికి  క్షేమంగా చేరుతారనే గ్యారంటీ లే కుండా పోయింది. నెల రోజుల్లో ఇద్దరు కూలీలు ఎండదెబ్బకు ప్రాణాలు కోల్పోయారు. ఉష్ణాగ్రతలు 44 డిగ్రీలు దాటుతుండగా.. ఎలాంటి రక్షణ, వసతులు లేకుండా నే కూలీలు ఉపాధిహామీ పనులను చేయా ల్సి వస్తోంది. జిల్లాలో 394 గ్రామాల్లో ఉపాధిహామీ పనులు కొనసాగుతున్నాయి. మొత్తం జాబ్‌ కార్డులు 2,59,338 ఉండగా, ఇందులో 5,32,044 మంది కూలీలుగా నమోదై ఉన్నారు.

అప్పుడప్పుడూ పనులకు వస్తున్న కూలీలతో కలిపి 2,16,819 మంది ఉన్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. అయితే పనులకు వస్తున్న వారి సంఖ్య 90 వేలు దాటడం లేదు. చాలా మంది వడదెబ్బతో అస్వస్థతకు గురవుతూ పనులకు వెళ్లడం లేదని తెలుస్తోంది. దీంతో కూలీల హాజరు శాతం తక్కువగా నమోదవుతోంది. హాజరు శాతం పెంచాలనే ఉద్దేశంతో  పనులు కల్పిస్తున్న అధికారులు మండుటెండలో అవస్థలు పడుతున్న కూలీలకు మాత్రం ఎలాంటి రక్షణ కల్పించడం లేదు. తాగునీరు, టెంట్లు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్‌లు, మెడికల్‌ కిట్లు ఉపాధి హామీ పనులు జరిగే ప్రాంతాల్లో కనిపించడం లేదు. కూలీలే వారి వెంట తాగునీటిని తెచ్చుకుంటున్నారు.

11 గంటల వరకు పనుల్లోనే..
వాస్తవానికి ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో పని వేళలను ప్రభుత్వం మార్చింది. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు పని చేయించాలని అధికారులకు సూచించింది. అయితే ఉదయం 8 గంటల నుంచే భానుడు ఉగ్ర రూపాన్ని దాల్చుతున్నాడు. 9 గంటల నుంచి 11 గంటల వరకు 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత నమోదవుతోంది. చెరువుల్లో పనులు చేయిస్తున్నందున అక్కడ అధిక ఉష్ణోగ్రతతో కూలీలు పనులు చేయలేకపోతున్నారు. ఇచ్చిన కొలతల ప్రకారం గుంతను తవ్విన తరువాతే ఇంటికి వెళ్లాలని ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు చెప్పడంతో ఎండలో కూడా కూలీలు పనులు చేయాల్సి వస్తోంది. ఎండాకాలం కావడంతో నేల గట్టిగా ఉండటం కారణం చేత పని త్వరగా జరగడం లేదు. దీంతో ఒక్కో సారి మధ్యాహ్నం 12 గంటలు కూడా దాటుతోంది.

పత్తాలేని టెంట్లు, మెడికల్‌ కిట్‌లు..
వేసవిలో పనిచేసే కూలీలు సేద తీరడానికి ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం టెంట్లు అందజేసింది. వీటిని గ్రూపునకు ఒకటి చొప్పున మేట్లకు అందజేశారు. కామారెడ్డి, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలుగా ఉన్న సమయంలో టెంట్‌లను అందజేశారు. అవి కూడా అందరికి సరిపడా ఇవ్వలేదు. ఒక్కో టెంటును రూ.540 చొప్పున టెండరు ద్వారా 29,129 కొనుగోలు చేశారు. ఇప్పుడా టెంట్లు కొన్ని చోట్ల కనిపిస్తున్నా, చాలా చోట్ల వాటి ఆచూకీ లేదు. వాటిని ఎప్పుడో మాయం చేసినట్లు  ఆరోపణలు ఉన్నాయి. కాగా మేట్లు పనికి వచ్చే సమయంలో వెంట తేవడం లేదని ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు చెబుతున్నారు. అలాగే ఎండలో పని చేస్తున్న కూలీలు డిహైడ్రేషన్‌కు గురి కాకుండా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందజేయాల్సి ఉండగా, కొంత మేరకే సరఫరా అవుతున్నట్లు ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు తెలిపారు.

ఒక్కో గ్రూపునకు రెండు, మూడు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు మాత్రమే ఇస్తున్నారని, ప్రస్తుతం అవి కూడా అయిపోయాయన్నారు. ప్రాథమిక చికిత్సను అందించడానికి ప్రభుత్వం గతేడాది సరఫరా చేసిన మెడికల్‌ కిట్‌లూ కనిపించడం లేదు. మందుల గడువు తేదీ ముగియడంతో వాటిని వినియోగించడం లేదు. మండల పీహెచ్‌సీల నుంచి మందులను తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఎండలో పని చేసే సమయంలో తీసుకోవాల్సి జాగ్రత్తలపై కూలీలకు డ్వామా అధికారులు అవగాహన కల్పించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top