ప్రభుత్వం సీరియస్.. ఏ2గా టీడీపీ ఎమ్మెల్యే

ప్రభుత్వం సీరియస్.. ఏ2గా టీడీపీ ఎమ్మెల్యే


ఖమ్మం: ఖమ్మం మిర్చి యార్డు రణరంగంగా మారిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో పాటు 11 మందిపై కేసు నమోదైంది. 147, 148, 353, 427, 448, 420(బి) సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఏ-2గా టీడీపీ ఎమ్మెల్యే సండ్ర పేరును చేర్చారు. మార్కెట్‌ కమిటీలో పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసు బలగాలు వచ్చినా మిర్చి ధర రోజురోజుకు తగ్గడంతో చేపట్టిన ఆందోళనను రైతులు అంత సులువుగా విరమించలేదు. మిర్చి ధరను రోజు రోజుకు ఎందుకిలా తగ్గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించారు.శనివారం నాడు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో రైతులు ఆందోళనకు దిగి చైర్మన్, కార్యదర్శుల కార్యాలయాలకు నిప్పుపెట్టారు. అంతటితో ఆగకుండా మార్కెట్లోని సుమారు 1000 కాంటాలు ధ్వంసం చేశారు. ఆ సమయంలో ప్రాణభయంతో ఉద్యోగులు, కార్యదర్శి పరుగులు తీసిన విషయం తెలిసిందే. రైతులకు మద్దతుగా మార్కెట్‌కు వచ్చిన ఎమ్మెల్యే సండ్ర ఆందోళన జరుగుతున్న సమయంలో చైర్మన్ చాంబర్‌లోకి వెళ్లి మిర్చి ధరపై చర్చించారు. అయితే  సండ్ర రైతులకు మద్దతుగా ఆందోళన చేపట్టంతో వారు తీవ్ర ఆవేశానికిలోనై కంప్యూటర్లు, ఫర్నీచర్, ద్విచక్రవాహనాలను ధ్వంసం చేశారని ఆరోపణలున్నాయి. దీంతో ఏ-2గా ఆయన పేరును చేర్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top