
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో సమర్థంగా వ్యవహరించిన అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) అవార్డులను అందజేయనుంది. ‘తెలంగాణ ప్రజాస్వామ్య అవార్డు’ల పేరిట జనవరి 11 న హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. అధికారులు, సిబ్బంది పకడ్బందీగా వ్యవహరించడంతోనే గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని భావించిన ఎస్‌ఈసీ.. వారికి ఈ అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఎన్నికలు జరిగిన 32 జిల్లాల నుంచి సగటున ఆరుగురు అధికారులను సన్మానించనుంది. జిల్లా స్థాయి అధికారి మొదలు.. క్షేత్రస్థాయి సిబ్బంది వరకు 181 మందికి ఈ అవార్డులు అందజేయనున్నారు.