
సాక్షి, హైదరాబాద్: వివిధ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు ప్రతిభ ఆధారంగా ఉపకారవేతనాలను ఇవ్వనున్నట్లు తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి శనివారం తెలిపింది. దుకాణాలు, వాణిజ్య, మోటర్ రవాణా, సహకార, ధార్మిక సంస్థలు, ట్రస్టులు, కర్మాగారాల్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు ఈ పథకం వర్తిస్తుందని పేర్కొంది. సంబంధిత కార్మిక సహాయ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తులు పొందాలని, పూర్తి చేసిన దరఖాస్తులను ఫిబ్రవరి 15లోగా సమర్పించాలని సూచించింది.
2016–17 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులైన పిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది. పదో తరగతి, ఐటీఐ విద్యార్థులకు రూ.1000, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.1,500, డిగ్రీ విద్యార్థులకు రూ.2000 చొప్పున ఉపకారవేతనం ఇవ్వనున్నట్లు వివరించింది. విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తామని పేర్కొంది.