రూట్ల ప్రైవేటీకరణ.. తొలిదశలోనే తప్పుపట్టలేం!

Telangana High Court Serious Comments On TSRTC Roots Privatisation - Sakshi

ప్రైవేటీకరణ పరుగులు పెడుతుంటే ఇంకా 1947లోనే ఉందామా?

5,100 రూట్ల ప్రైవేటీకరణకు కేబినెట్‌ అనుమతిపై హైకోర్టు

కేబినెట్‌ది సూత్రప్రాయ ఆమోదమే.. ఇంకా ప్రక్రియ చాలా ఉంది

చట్ట ఉల్లంఘనల దశకు వస్తేనే న్యాయసమీక్షకు వీలు

ప్రభుత్వంపై ఆరోపణలు కాదు.. ఆధారాలు చూపాలి.. విచారణ నేటికి వాయిదా

సాక్షి, హైదరాబాద్‌ : ‘ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రైవేటీకరణ మన దేశంలోనూ పరుగులు పెడుతోంది. 1991 నుంచి సరళీకృత ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు జరిగాయి. ఎయిరిండియా గుత్తాధిపత్యం పోయి ఎన్నో ఎయిర్‌లైన్స్‌ వచ్చాయి. రైల్వేలోనూ ప్రైవేటీకరణ జరగబోతోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో ఆర్టీసీ గుత్తాధిపత్యం నుంచి సమాతరంగా ప్రైవేట్‌ రూట్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలన్న కేబినెట్‌ ప్రతిపాదన చట్ట వ్యతికమని ఎక్కడ ఉందో చెప్పండి. సుప్రీంకోర్టు కూడా పెట్టుబడిదారీ విధానాలకు అనుగుణంగా వచ్చిన చట్టాలకు లోబడి తీర్పు చెబుతోంది. కాలం మారుతోంది. జనం కూడా మారుతున్నారు. అందుకు అనుగుణంగా చట్టాలు కూడా వస్తున్నాయి. 

రూట్ల ప్రైవేటీకరణకు రాష్ట్రాలకు అనుమతి 
ఇస్తూ పార్లమెంట్‌ చట్టం చేసింది. ఈ నేపథ్యంలో మనం ఇంకా 1947 నాటి సోషలిస్టు విధానాలే ఉండాలంటే ఎలా’ అని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో 5,100 రూట్ల ప్రైవేటీకరణకు కేబినెట్‌ తీర్మానం చేయడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారించింది. 

అది విశ్వాసరాహిత్యమే: పిటిషనర్‌
తొలుత పిటిషనర్‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదిస్తూ.. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్న తరుణంలో రూట్ల ప్రైవేటీకరణకు కేబినెట్‌ నిర్ణయం తీసుకోవడం విశ్వాసరాహిత్యమే అవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి అధికారాలు ఉన్నా.. వాటిని అమలుచేసే సందర్భం కీలకమని, సమ్మె చేస్తున్న తరుణంలో ప్రైవేటీకరణ చేయడం వెనుక రహస్య ఒప్పందాలు ఉన్నాయని చెప్పారు. కార్మిక సంఘాలను చర్చలకు కూడా ఆహ్వానించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఈ దశలో ధర్మాసనం కల్పించుకుని.. సయోధ్య చర్చల నుంచి యూనియన్‌ నేతలు వాకౌట్‌ చేయడంతో చర్చలు విఫలమైనట్లు కన్సిలియేషన్‌ అధికారి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాక ఇక చర్చలకు ఆస్కారం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించింది.

చర్చలు జరపాలని తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌ వినతిపత్రం ఇస్తే, కారణాలు కూడా చెప్పకుండా కార్మిక శాఖ అధికారి వాయిదా వేయడాన్ని ప్రభాకర్‌ తప్పుపట్టగా.. హైకోర్టులో రోజూ ఎన్నో కేసుల్ని వాయిదా వేస్తామని, వాటికి కారణాలు పేర్కొనడం లేదని, రూట్ల ప్రైవేటీకరణ గురించి చెప్పాలని ధర్మాసనం సూచించింది. ‘కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల చట్టాన్ని సవరించింది. ఆ చట్టంలోని సెక్షన్‌ 57లోనే చాలా స్పష్టంగా ప్రైవేటు బస్సులకు రాష్ట్రాలు అనుమతి ఇచ్చేందుకు వీలుందని తేల్చి చెప్పింది. దీని ప్రకారం 5,100 రూట్లను ప్రైవేటీకరణకు అనుమతి ఇస్తే తప్పేముంది. సమ్మె నేపథ్యంలో ఎవరిపైనో కోపంతో, విశ్వాసరాహిత్యంతో ప్రభుత్వం ఇలా చేస్తోందని, చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపణలు చేయడం కాదు. వాటికి ఆధారాలు చూపాలి. సమ్మె లేనప్పుడు ఇదే నిర్ణయాన్ని కేబినెట్‌ తీసుకుని ఉంటే అప్పుడు ఏమని చెబుతారు’అని ప్రశ్నించింది. ఆర్టీసీ గుత్తాధిపత్యం లేదా ఏకస్వామ్య వ్యవస్థను సవరించేందుకు కేంద్రమే ఆస్కారం ఇచ్చిందని స్పష్టంచేసింది.

చట్టాన్ని లోతుగా అధ్యయనం చేయండి..
ప్రభాకర్‌ తిరిగి వాదనలు కొనసాగిస్తూ.. సెక్షన్‌ 104 ప్రకారం నోటిఫైడ్‌ ఏరియాల్లో ప్రైవేట్‌ రూట్లకు అనుమతి ఇవ్వడంపై నిషేధం ఉందని, తెలంగాణ రాష్ట్రమంతా నోటిఫైడ్‌ ఏరియా కాబట్టి పూర్తిగా నిషేధం ఉన్నట్లేనని చెప్పారు. అయితే, ఆ సెక్షన్లకే పరిమితం కావొద్దని, ఇతర సెక్షన్లు పరిశీలిస్తే అది వర్తించదని ధర్మాసనం పేర్కొంది. ‘ఆర్టీసీ గుత్తాధిపత్యాన్ని కొంత వరకూ తగ్గించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఆ నిర్ణయంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పండి. అదే చట్టంలోని సెక్షన్‌ 102ను లోతుగా అధ్యయనం చేస్తే ఈ కేసుకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ప్రజావసరాల కోసం ప్రైవేటు రూట్లకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తే ఉన్న విధానాన్ని సవరించవచ్చు. అయితే అప్పుడు దాని ప్రభావం ఉంటే ఆర్టీసీ లేదా ఇతర సంస్థలు ఉంటే వాటి వాదనలు విన్నాకే సవరణలు చేయాలి. రూట్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకమని ఆర్టీసీ యాజమాన్యం భావించినప్పుడు ఆ వాదనలు కూడా ప్రభుత్వం వినాలి. ఆ విధంగా ప్రభుత్వం చేయలేదని పిటిషనర్‌ చెప్పగలరా? ఆర్టీసీ గుత్తాధిపత్యాన్ని తగ్గించేందుకు ప్రైవేటు రూట్లకు అనుమతి ఇవ్వాలనే ముసాయిదా ప్రతిపై గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువరించాలి. ప్రైవేటీకరణ ప్రభావిత ప్రాంతాలకు తెలియజేసేలా పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలి. 30 రోజుల గడువు ఇచ్చి, అభ్యంతరాలను ఎక్కడ స్వీకరిస్తారో కూడా ప్రదేశాన్ని ముందుగా నిర్ణయించాలి. అభ్యంతరాల్ని పరిష్కరించిన తర్వాత తుది నోటిఫికేషన్‌ వెలువరించాలి. ఆపై ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడితే అప్పుడు జీవో అధికారికం అవుతుంది’అని చట్ట నిబంధనల్ని ధర్మాసనం వివరించింది.

అది సూత్రప్రాయ నిర్ణయమే..
ఆర్టీసీ ఇక ఉండబోదని సీఎం ప్రకటించారని ప్రభాకర్‌ చెప్పగానే ధర్మాసనం కల్పించుకుని.. సీఎం ఏం చెప్పారన్నది ఇక్కడ అప్రస్తుతమని, రూట్ల ప్రైవేటీకరణకు కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం చట్టబద్ధమా కాదా అనేదే తమ ముందున్న న్యాయ సమీక్ష అంశమని తేల్చి చెప్పింది. రూట్ల ప్రైవేటీకరణపై ప్రభుత్వం తుది నిర్ణయానికి రావాల్సి ఉందని, ఈ వ్యవహారంలో కేబినెట్‌ సూత్రప్రాయంగానే అంగీకారం తెలిపిందని పేర్కొంది. ‘సెక్షన్‌ 102 ప్రకారం ప్రైవేటు రూట్ల ప్రక్రియ చేపట్టాలని మాత్రమే కేబినెట్‌ చెప్పింది. సెక్షన్‌ 71 ప్రకారం ఆర్టీఏ అధికారి ప్రైవేట్‌ రూట్ల అంశాన్ని పరిశీలించి సెక్షన్‌ 72 ప్రకారం అనుమతి ఇస్తారు. ఈ చట్ట నిబంధనల అమలులో ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే న్యాయ సమీక్షకు వీలుంటుంది’అని ధర్మాసనం స్పష్టంచేసింది.

పార్లమెంటు చట్టాల్లో జోక్యం చేసుకోలేం..
ప్రభాకర్‌ వాదనలు కొనసాగిస్తూ.. అన్ని రూట్లలోనూ ప్రైవేటు బస్సులకు అనుమతి ఇస్తే 48వేల మంది కార్మికులు, వారి కుటుంబాలు ఏం కావాలని, వారికి జీవించే హక్కును దెబ్బ తీసినట్లు అవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. అయితే, చట్టంలో కార్మికుల ప్రస్తావన లేదని, సెక్షన్‌ 67 ప్రకారం ప్రైవేటు బస్సు రూట్లకు రాష్ట్రాలకు అనుమతి ఇచ్చే అధికారం కేంద్రమే దఖలు పరిచిందని, పార్లమెంటు చేసిన చట్టాల విషయంలో తాము ఎలా జోక్యం చేసుకోగలమని ధర్మాసనం నిస్సహాయత వ్యక్తం చేసింది. కేబినెట్‌ నిర్ణయం ప్రాథమిక దశలోనే ఉందని, అందుకు అనుగుణంగా జీవో వచ్చే వరకు ఆ నిర్ణయంపై న్యాయ సమీక్ష చేయడానికి వీల్లేదని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీల్డ్‌ కవర్‌లో కేబినెట్‌ నిర్ణయాన్ని ధర్మాసనానికి మళ్లీ నివేదించారు. కోర్టు సమయం ముగియడంతో ఈ కేసు విచారణను ధర్మాసనం బుధవారానికి వాయిదా వేసింది. అప్పటివరకు కేబినెట్‌ నిర్ణయంపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. కాగా, ఈ కేసు వాదనల కారణంగా ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం విచారణకు రాలేదు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top