కందులు కొంటాం రండి!

Telangana Government Decided To Purchase Toor Dal From Farmers - Sakshi

కొనుగోలు చేసేందుకు రంగంలోకి దిగిన రాష్ట్ర సర్కార్‌

‘సాక్షి’ కంది.. రంధి కథనానికి వ్యవసాయశాఖ స్పందన

56 వేల మెట్రిక్‌ టన్నులు కొనాలని నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: కందుల కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మార్క్‌ఫెడ్‌ ద్వారా అదనంగా 56 వేల మెట్రిక్‌ టన్నుల కందు లు కొనుగోలు చేయడానికి అనుమతినిస్తూ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరకు 47,500 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేసింది. మరో 56 వేల మెట్రిక్‌ టన్నులు కొనాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కేంద్రం స్పందించకపోవడంతో తానే కొనాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో కేంద్రం, రాష్ట్రం వాటాలు కలిపి మొత్తం 1,03,500 మెట్రిక్‌ టన్నుల కందుల కొనుగోళ్లకు అనుమతి లభించినట్లయింది. ‘కంది.. రంధి’శీర్షికతో ‘సాక్షి’ఈ నెల 21న కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే.

రూ.381 కోట్లు కేటాయింపు..
అదనపు కందుల కొనుగోలు కోసం అనుమతించాలని కోరుతూ మార్క్‌ఫెడ్‌ ఎండీ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వం 2019–20 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి రాష్ట్ర వాటా కింద 56 వేల మెట్రిక్‌ టన్నుల కంది కొనుగోళ్లను మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయాలని ఆదేశించింది. నేషనల్‌ కోఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మొక్కజొన్న కొనుగోలు కోసం మంజూరు చేసిన రూ.1,500 కోట్ల రుణా ల్లో మిగిలిన రూ.381 కోట్లను కందుల కొనుగోలుకు వినియోగించుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర వాటా కందుల కొనుగోలు సందర్భంగా ఎలాంటి ఆర్థిక నష్టాలు వచ్చినా అంతే మొత్తాన్ని మార్క్‌ఫెడ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందని హామీ ఇచ్చింది. కందుల కొనుగోళ్లు నేరుగా రైతుల నుంచే చేపట్టాలని, మధ్య దళారులు, వ్యాపారుల నుంచి కొనుగోలు చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

ఆన్‌లైన్‌లో పేరు లేకున్నా కొనాల్సిందే..
కంది కొనుగోళ్లకు సంబంధించి సజావుగా సేకరించడానికి తామిచ్చే మార్గదర్శకాలను పాటించాలని కలెక్టర్లు, అదనపు కలెక్టర్లను వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఆయన వారికి లేఖ రాశారు. వ్యవసాయశాఖ నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ పోర్టల్‌లో కంది రైతుల పేర్లు లేకపోయినా, కందులు కొనాలని ఆయన ఆదేశించారు. నిజమైన రైతులను గుర్తించడానికి జిల్లా స్థాయి ప్రొక్యూర్‌మెంట్‌ కమిటీ (డీఎల్‌పీసీ) సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏఈవో, వీఆర్వోలు ఇచ్చే ధ్రువీకరణతో మండల వ్యవసాయాధికారి ధ్రువీకరణ ఉంటేనే ఆయా రైతుల కందులను కొనాలని ఆయన ఆదేశించారు. సేకరణ కేంద్రాల నుంచి 50 కిలోమీటర్ల లోపల గోదాముల్లో నిల్వ చేయాలన్నారు. నిబం ధనల ప్రకారం వ్యవహరించకుంటే కఠిన చర్యలుంటాయని ఆయన వ్యవసాయాధికారులను హెచ్చరించారు. వ్యవసాయ, రెవెన్యూ, సహకార, మార్కెటింగ్, పోలీస్‌ విభాగాల సమన్వయంతో జిల్లా స్థాయి విజిలెన్స్‌ బృందాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతిరోజూ కొనుగోలు కేంద్రాల్లో తనిఖీలు చేయాలన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top