అద్దె బస్సులపై అయోమయం!

Telangana Government In Confusion Regarding Rental Buses - Sakshi

 సర్కారు ప్రైవేటు పర్మిట్ల నిర్ణయంతో తెరపైకి కొత్త సమస్య

ప్రస్తుతం ఆర్టీసీలో 3,300 హైర్‌ బస్సులు

అద్దె బస్సుల యజమానులతో ఆర్టీసీ పదేళ్ల ఒప్పందం

వాటిని ‘5100 పర్మిట్‌ బస్సుల’ పరిధిలోకి తెస్తారంటూ ప్రచారం

ఇది తమకు గిట్టుబాటు కాదని తేల్చేస్తున్న యజమానులు

ఆర్టీసీ ఒప్పందాన్ని అతిక్రమిస్తే బస్సులను 

విక్రయించే యోచనలో నిర్వాహకులు!  

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ బస్సుల స్థాయిలోనే సేవలందిస్తున్న అద్దె బస్సుల భవితవ్యం గందరగోళంలో పడింది. ప్రభుత్వం 5,100 బస్సులను ఆర్టీసీ నుంచి మినహాయించి అంతమేర రూట్లను ప్రైవేటీకరించాలని నిర్ణయించడమే దీనికి కారణం. ఆర్టీసీకి సొంత బస్సులు సగం ఉండనుండగా మిగతావి ప్రైవేటు పర్మిట్లతో నడిచే బస్సులుంటాయని సీఎం ఇప్పటికే తేల్చిచెప్పడం, దీనికి హైకోర్టు అడ్డుచెప్పకపోవటంతో ఈ ప్రక్రి య అమలు దాదాపు ఖాయమైంది.

అయితే ప్రైవేటీకరించే కోటా(5,100 బస్సులు) పరిధిలోకే అద్దె బస్సులు వస్తాయని గతంలోనే సీఎం స్పష్టం చేసిన నేపథ్యంలో అద్దె బస్సుల విధానమే రద్దవుతుందన్న ప్రచారం ఆర్టీసీలో మొదలైంది. అద్దె బస్సుల యజమానులనూ ప్రైవేటు పర్మిట్‌ బస్సుల పరిధిలోకి తెస్తారని చర్చ జోరుగా సాగుతోంది. ఆర్టీసీ తమతో పదేళ్ల ఒప్పందం కుదుర్చుకొని ఇప్పుడు దానికి విరుద్ధంగా కొత్త ఒప్పందంలోకి వెళ్లమంటే ఎలా సాధ్యమని అద్దె బస్సుల యజమానులు ప్రశ్నిస్తున్నారు. కొత్త ఒప్పందాన్ని ఒప్పుకోబోమని, అవసరమైతే న్యాయ పోరాటానికి దిగుతామని కొందరు పేర్కొంటున్నారు. 

ఏమిటా ఒప్పందం.. ఎందుకీ సమస్య? 
ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆర్టీసీ సొంతంగా బస్సులు కొనుగోలు చేయడం లేదు. ఏటా పాతవి, నడవలేని బస్సులను సర్వీసు నుంచి తప్పిస్తోంది. వాటి స్థానంలో అద్దె బస్సులను పెంచు తూ వచ్చింది. గతంలో మొత్తం బస్సుల్లో వాటి సంఖ్య 15 శాతంగా ఉండగా.. ప్రస్తుతం 25 శాతానికి చేరింది. అద్దె బస్సులను ప్రోత్సహిం చడం వల్ల వాటి కొనుగోలు భారం లేకపోవడమే కాకుండా డ్రైవర్లను నియమించే అవసరం తప్పింది. దీంతో క్రమంగా వాటి సంఖ్య 2,100కు చేరుకుంది. ఇటీవల కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా యుద్ధప్రాతిపదికన కొత్తగా 1,200 అద్దె బస్సులను తీసుకున్నారు. వెరసి ఇప్పుడు అద్దె బస్సుల సంఖ్య 3,300కు చేరుకుంది.

ఒక్కో బస్సుకు పదేళ్ల ఒప్పందం ఉంది. అయితే ఆర్టీసీ తీసుకున్న అద్దె బస్సుల్లో 2,100 బస్సుల గడువు ఇంకా తీరలేదు. ఇటీవలే కొత్తగా తీసుకున్న 1,200 బస్సులకు పదేళ్ల ఒప్పందం అలాగే ఉంది. అద్దె బదులు వాటిని ప్రైవేటు పర్మిట్ల కోటాలోకి మారాలంటూ ప్రభుత్వం సూచించనుందనే మాట అధికారుల నుంచి వినిపిస్తోందని అద్దె బస్సుల యజమాను లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అద్దె బస్సుల ఒప్పందం ప్రకారం మోటారు వాహన పన్ను, డీజిల్‌ ఖర్చు, కండక్టర్‌ వేతనం, బీమా భారం యజమానులకు లేదు. అన్ని పన్నులూ ఆర్టీసీనే చెల్లించి తిరిగి ప్రభుత్వం నుంచి దాన్ని వసూలు చేసుకుంటోంది.

దీంతో ఒక్కో బస్సుపై యజమానులు ఏటా రూ.1.30 లక్షలే ఖర్చు చేస్తున్నారు. అదే ప్రైవేటు పర్మిట్ల విషయంలో ఆ ఖర్చు రూ. 3.36 లక్షలు అవుతుందని బెంబేలెత్తుతున్నారు. ప్రభుత్వం తమను ప్రైవేటు పర్మిట్ల రూపంలో తిప్పాలని సూచిస్తే ఒప్పందం నుంచి వైదొలుగుతామని, బస్సులను అమ్మేసి ప్రజా రవాణా నుంచి వైదొలగుతామని చెబుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top