విజయం మనదే...!

Telangana Elections KCR B farms Released Karimnagar - Sakshi

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో చొప్పదండి మినహా 12 నియోజకవర్గాల్లో అభ్యర్థులకు గులాబీ దళపతి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం సాయంత్రం బీ ఫారాలు అందించారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేయనుండగా.. ఒక్కరోజు ముందుగానే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు కేసీఆర్‌ బీఫారాలను అందజేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్‌ ఒక్కరోజు ముందుగానే ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేసేందుకు పిలుపునిచ్చారు.

ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకే రావాలన్న ఆదేశం మేరకు మరో అరగంట ముందుగానే ఆశావహులు తెలంగాణ భవన్‌లో రిపోర్టు చేశారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 13 నియోజకవర్గాలకుగాను 12 నియోజకవర్గాలకు సెప్టెంబర్‌ 6న అభ్యర్థులను ప్రకటించారు. చొప్పదండి విషయంలో మాత్రం సస్పెన్స్‌ పెట్టిన టీఆర్‌ఎస్‌ అధిష్టానం సిట్టింగ్‌ ఎమ్మెల్యేను వదిలించుకునే ప్రయత్నం చేసింది. అందుకనే టీఆర్‌ఎస్‌ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు సుంకె రవిశంకర్‌ పేరును తెరమీదకు తెచ్చారు. ఆదివారం 12 మంది అభ్యర్థులకు బీఫారాలు పంపిణీ చేసిన కేసీఆర్‌ చొప్పదండి విషయంలో మాత్రం ఏమీ తేల్చలేదు. 13 నియోజకవర్గాల్లో ఆదివారం నాటి వరకు ఉన్న పరిస్థితులపై వివిధ కోణాల్లో సేకరించిన సర్వే నివేదికలను కూడా కేసీఆర్‌ అభ్యర్థుల కళ్లకు కట్టారు.

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో వెల్లడించిన సర్వే ఫలితాల మేరకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 13 నియోజకవర్గాల్లో హుజూరాబాద్‌ నియోజకవర్గం అగ్రస్థానంలో ఉంది. 81.64 శాతంతో ఉమ్మడి జిల్లాలో మంత్రి కేటీఆర్‌ తదితరుల కంటే హుజూరాబాద్‌ ఎమ్మెల్యే, ఆర్థిక పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో 68.84శాతంతో కరీంనగర్‌ మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గంగుల కమలాకర్‌ ఉన్నట్లు గులాబీ దళపతి కేసీఆర్‌ సమావేశంలో వెల్లడించారు. మానకొండూరు నియోజకవర్గంలో మహాకూటమి అభ్యర్థి 49 శాతంతో ముందుండగా.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి 48.40 శాతంతో వెనుకబడిపోయినట్లు పేర్కొన్నారు. అలాగే పెద్దపల్లి, మంథని, వేములవాడ, రామగుండం నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల పరిííస్థితి పెద్దగా ఆశాజనకంగా లేదని వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు మరింత కష్టపడి పనిచేయాలని కూడా కేసీఆర్‌ ఆదేశించారు.

12మంది అభ్యర్థులకు బీ ఫారాలు.. చొప్పదండిపై తేలని నిర్ణయం..
హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమావేశంలో గులాబీ దళపతి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన 12మంది అభ్యర్థులకు బీ ఫారాలను అందించారు. సెప్టెంబర్‌ 6న తొలి విడతగా 107 మందితో జాబితా ప్రకటించిన కేసీఆర్‌.. ఉమ్మడిజిల్లా నుంచి 12 మంది పేర్లను ఖరారు చేశారు. మొదటగా ప్రకటించిన 12 మందికి కేసీఆర్‌ బి–ఫారాలను అందజేశారు. అనంతరం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అభ్యర్థులతో మాట్లాడిన కేసీఆర్‌ పార్టీ అభ్యర్థులు అప్రమత్తంగా వ్యవహరించాలని, గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని హితబోధ చేసినట్లు తెలిసింది.

వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అధికారం చేపట్టడం ఖాయమని, పలు విధాలుగా నిర్వహించిన సర్వేలు కూడా అవే చెప్తున్నాయని, ఇందుకోసం అభ్యర్థులు, పార్టీ కేడర్‌ అంకితభావంతో పనిచేయాలని కేసీఆర్‌ సూచించారు. కాగా చొప్పదండి నియోజకవర్గానికి అభ్యర్థి నియామకం విషయం ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.  సమావేశంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఆపద్ధర్మ మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, ప్రభుత్వ మాజీ విప్‌ కొప్పుల ఈశ్వర్, తాజామాజీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలికిషన్, దాసరి మనోహర్‌రెడ్డి, పుట్ట మధూకర్, వొడితెల సతీష్‌కుమార్, కె.విద్యాసాగర్‌రావు, సొమారపు సత్యనారాయణ, సీహెచ్‌ రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top