అద్భుత తెలంగాణకు రూపకల్పన | Telangana design fantastic | Sakshi
Sakshi News home page

అద్భుత తెలంగాణకు రూపకల్పన

Jul 15 2014 3:24 AM | Updated on Sep 2 2017 10:17 AM

అద్భుత తెలంగాణకు రూపకల్పన

అద్భుత తెలంగాణకు రూపకల్పన

స్పష్టమైన విజన్‌తో అద్భుత తెలంగాణ కు రూపకల్పన చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అధికారులను కోరారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ

 రాంనగర్ :స్పష్టమైన విజన్‌తో అద్భుత తెలంగాణ కు  రూపకల్పన చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి  అధికారులను కోరారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రణాళికల రూపకల్పనపై జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో ఏర్పాటు చేసి జిల్లా స్థాయి సమావేశంలో మంత్రి మాట్లాడారు. పదేళ్లకు ఉపయోగ పడేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కన్న కలలు నిజం చేయడానికి మన ఊరు - మన ప్రణాళికలు రూపొందించి గ్రామాలను, పట్టణాలను అన్ని హంగులతో అభివృద్ధి పరచాలన్నారు.
 
 తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగానే ముఖ్యమంత్రి మన ఊరు - మన ప్రణాళికకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.ప్రణాళికల రూపకల్పనలో గ్రామీణ, పట్టణ అవసరాలను గుర్తించి ప్రాధాన్యమివ్వాలని అధికారులకు సూచించారు.  ప్రజల అవసరాలు తీర్చడమే నిజమైన అభివృద్ధి అని, పార్టీలకు అతీతంగా ప్రజలను, ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేసి ప్రణాళికలు రూపొందించాలని కోరారు. ప్రణాళికల రూపకల్పనలో  సర్పంచ్‌లు, జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు, కౌన్సిలర్లదే  బాధ్యత ఎక్కువ ఉన్నదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజా ప్రతినిధులు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి గ్రామ ప్రణాళికలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు మధ్య సమన్వయం ఉండాలని, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు గ్రామ, మండల, జిల్లాస్థాయి ప్రణాళికలకు రూపకల్పన జరగాలన్నారు.
 
 ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ఉపాధి-జీవనోపాధి, పారిశుద్ధ్యంపై ప్రణాళికలు కట్టుదిట్టంగా రూపొందించాలని కోరారు. నియోజకవర్గానికి 40 లక్ష చొప్పున మొక్కలు పెంచాలని, ఇందు కోసం వందలాది నర్సరీలను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రణాళికల ద్వారా అధికారులు ప్రజలకు మెరుగైన పాలన అందించాలని సూచించారు. గ్రామ సభలు నిర్వహించి కనీసం గ్రామ జనాభాలో 10 శాతం మంది ప్రజలు, మహిళల భాగస్వామ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామాలలో డప్పు చాటింపు వేయడంతో పాటు అన్ని పార్టీల వారికి సమాచారం అందించాలని కోరారు. ఇప్పటికే అన్ని గ్రామాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రణాళికల రూపకల్పనలో ప్రజలకు అవగాహన కల్పించాలనిఅప్పుడు సమస్యలు వెలుగులోకి వస్తాయన్నారు.
 
 తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, వీధి దీపాల ఏర్పాటు పట్ల గ్రామ పంచాయతీలు ప్రత్యేక శ్రద్ధ చూపితే గ్రామ సమస్యలు 60 శాతం మేర అక్కడికక్కడే పరిష్కారం అవుతాయని తెలిపారు. ప్రణాళికల రూపకల్పనకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అభినందనలు తెలిపారు. జిల్లాలోని కస్తూర్బా పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలకు ప్రహరీల నిర్మాణం చేపట్టాలని, ప్రతి పాఠశాలలో క్రీడలను పెంపొందించేందుకు పీఈటీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని, విద్యా ప్రణాళికల రూపకల్పనలో ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు తీసుకోవాలని మంత్రికి సూచించారు. అక్షరజ్ఞానంలో జిల్లా వెనుకబడి ఉన్నందున స్పెషల్ డ్రైవ్ చేపట్టి అగ్రగామిగా నిలపాలని కోరారు. జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు మాట్లాడుతూ తెలంగాణ జిల్లాల్లో తలసరి ఆదాయంలో జిల్లా నాల్గవ స్థానంలో ఉన్నప్పటికీ విద్యాపరంగా వెనుకబడి ఉందన్నారు.
 
 జిల్లాలోని 30 మండలాల్లో అక్షరాస్యత 50 శాతం కంటే తక్కువగా ఉందన్నారు. జిల్లాలో ప్రధానమైన ఫ్లోరైడ్ సమస్య, అక్షరాస్యత కార్యక్రమాలు, మధ్యా హ్న భోజన పథకానికి వంట గదుల నిర్మాణం తదితర అంశాలకు ప్రాధాన్యమిచ్చి ప్రణాళికల్లో చేర్చాలన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్ మాట్లాడుతూరాజకీయాలకతీతంగా జిల్లా అభివృద్ధికి సహకరిస్తానన్నారు. బాధ్యతలు స్వీరించిన జెడ్పీ చైర్మన్ బాలునాయక్‌కు మంత్రి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎన్.పద్మావతి, వేముల వీరేశం, ఎన్.భాస్కర్‌రావు, పైళ్ల శేఖర్‌రెడ్డి,ఎమ్మెల్సీ రవీందర్, జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్, జేడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి, సీపీఓ నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్లు బొడ్డుపల్లి లక్ష్మి, ప్రవళిక, వి.అనిత, తిరునగరు నాగలక్ష్మి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement