బడ్జెట్‌ అంతంతమాత్రంగానే.. | Telangana Budget Allocates Funds To Nizamabad | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌పై మిశ్రమ స్పందన

Sep 10 2019 11:56 AM | Updated on Sep 10 2019 11:56 AM

Telangana Budget Allocates Funds To Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు అరకొరగా కేటాయింపులు, తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి పైసా విదల్చక పోవడం వంటివి రైతులు, ఉద్యోగులు, ఇతర వర్గాలను నిరాశకు గురి చేసింది. జిల్లాకు సంబంధించి నామమాత్రంగానే నిధులు కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. రైతుబంధు, రైతుబీ మా వంటి వ్యవసాయ పథకాలకు బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యత దక్కడం రైతాంగంలో హర్షం వ్యక్తమవుతోంది.

జిల్లాలోని ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు ఇలా..

ప్రాజెక్టు కేటాయింపులు (రూ.కోట్లలో) 
నిజాంసాగర్‌ 52.20
శ్రీరాంసాగర్‌ ఫేస్‌–1  8.10
అలీసాగర్, గుత్ప  2.10
చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి 4.60
రామడుగు 1.00
పోచారం 1.00
కౌలాస్‌నాలా 2.00
లెండి 1.00

కాగా తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి పైసా కేటాయించకపోవడం.. కేవలం జీతభత్యాలు, నిర్వహణ నిధులతోనే సరిపెట్టడం ఆయా వర్గాల్లో నిరాశను నింపింది. ఇక జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు కూడా నామమాత్రం గా కేటాయింపులతో సరిపెట్టడంతో ఒకిం త అసంతృప్తి కనిపిస్తోంది. రాష్ట్రంలో రెం డోసారి అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయి బడ్జెట్‌ను సీఎం కేసీఆర్‌ సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను గత ఫిబ్రవరిలో రూ. 1.82 లక్షల కోట్ల అంచనాలతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సర్కారు.. సవరించిన అంచనాలతో రూ.1.46 లక్షల కోట్ల బడ్జెట్‌లో పూర్తిస్థాయి బడ్జెట్‌ను సోమవారం శాసనసభ ముందుంచింది. 

వ్యవసాయానికి పెద్దపీట.. 
వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత దక్కడం అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. రైతుబంధు పథకానికి సర్కారు రూ.12 వేల కోట్లు కేటాయించింది. ఈ పథకం ద్వారా జిల్లాలో సుమారు 2.58 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. అలాగే, రైతుబీమా పథకానికి సంబంధించిన బీమా ప్రీమియం కోసం రూ.1,137 కోట్లు కేటాయించారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 1.48 లక్షలు మంది రైతులకు భరోసా లభిస్తుంది. రైతు రుణమాఫీ కోసం రూ.6 వేల కోట్లను బడ్జెట్‌లో ప్రతిపాదించడంతో జిల్లాలో సుమారు 2 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ అయ్యే అవకాశాలున్నాయి.

ఊసే లేని తెయూ అభివృద్ధి.. 
బడ్జెట్‌లో జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి నిధుల ఊసే లేకుండా పోయింది. ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణ కోసం రూ.23.76 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. వర్సిటీ అభివృద్ధి పనులకు నిధులివ్వలేదు. కొత్త కోర్సులు, నూతన భవనాల నిర్మాణం, అంతర్గత రోడ్లు వంటి వాటికి పైసా విదల్చలేదు. గతంలో వీటి కోసం ఓ బడ్జెట్‌లో రూ.20 కోట్లు, మరో బడ్జెట్‌లో రూ.10 కోట్లు కేటాయింపులు జరిపినప్పటికీ ఆ నిధులు విడుదల కాలేదు. ఈసారి కేటాయింపులు కూడా చేయకపోవడం వర్సిటీ వర్గాలను తీవ్ర నిరాశకు గురి చేసింది.

జిల్లా ప్రాజెక్టులకు నిధులు..
సాగునీటి రంగానికి నిధుల కేటాయింపులు తగ్గించిన సర్కారు.. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు కూడా ఆశించిన మేరకు నిధులు కేటాయించలేదు. సాగునీటి ప్రాజెక్టులకు గత బడ్జెట్‌లలో రూ.25 వేల భారీ బడ్జెట్‌ను కేటాయించిన ప్రభుత్వం ఈసారి రూ.8,700 కోట్లతో సరిపెట్టింది. దీంతో జిల్లాలోని ప్రాజెక్టులకు కూటా కేటాయింపులు తగ్గాయి. దీంతో ఆయా ప్రాజెక్టుల పనులు ఆశించిన మేరకు ముందుకు సాగడం ప్రశ్నార్థకమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు 20, 21, 22 ప్యాకేజీ పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు ఈసారి రూ.1,080 కోట్ల బడ్జెట్‌ను కేటాయించిన సర్కారు.. మరిన్ని నిధుల కోసం బ్యాంకుల నుంచి రుణాలు పొందాలని భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement