తహసీల్‌కు తాళం ! | Sakshi
Sakshi News home page

తహసీల్‌కు తాళం !

Published Tue, Nov 12 2019 10:26 AM

Tahsildar Offices Not Opening Since One Week In Rangareddy - Sakshi

సాక్షి, రంగారెడ్డి :  తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవ దహనం నేపథ్యంలో జిల్లాలోని రెవెన్యూ కార్యాలయాలు వారం రోజులుగా తెరుచుకోవడం లేదు. ఉద్యోగులు కార్యాలయాలకు అరకొరగా వస్తున్నా..  విధులకు దూరంగా ఉంటున్నారు. తహసీల్దార్‌ హత్యను ఖండిస్తూ గత వారంలో మూడు రోజులపాటు రెవెన్యూ ఉద్యోగులు విధులు బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ సయమంలో దాదాపు అన్ని తహసీల్దార్‌కార్యాలయాలకు తాళం కనిపించింది. అయితే, తమకు భద్రత కల్పించాలన్న డిమాండ్‌తో రెవెన్యూ ఉద్యోగులు ఆ తర్వాత కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. కనీసం సోమవారమైనా ప్రజావాణి నిర్వహిస్తారని, కార్యాలయాలు తెరచుకుంటాయన్న నమ్మకంతో  సమస్యల పరిష్కారం కోసం తహసీల్దార్‌ కార్యాలయాలకు వెళ్లిన బాధితులకు నిరాశే మిగిలింది. గ్రామీణ ప్రాంతంలో జిల్లా వ్యాప్తంగా 21 తహసీల్‌ కార్యాలయాలు ఉండగా.. ఇందులో 15కుపైగా  తాళం వేసి ఉన్నాయి. ఉద్యోగులు విధులు బహిష్కరించి నగరంలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి వెళ్లారు. ఈ విషయం తెలియని రైతులు, ప్రజలు ఆయా పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చారు. వ్యయ ప్రయాసాలకు ఓర్చి కార్యాలయాలకు వస్తే ఒక్క పని కూడా కావడం లేదని వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగులు ఇంకెన్ని రోజులు విధులకు రారోనంటూ వెనుదిరిగారు. 

వారం రోజులుగా తిరుగుతున్నా..
అధికారులు వస్తారేమోనని తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ వారం రోజులుగా తిరుగుతున్నా. నాకు మైసిగండి గ్రామంలో 9 గుంటల భూమి ఉంది. రికార్డుల్లో ఏడు గుంటల భూమి నమోదైంది. రికార్డుల్లో భూమి తక్కువగా నమోదు కావడంతో ఆన్‌లైన్‌లో సరిచేసుకుందామని తహసీల్దార్‌ కార్యాలయానికి రోజూ వస్తున్నా. మైసిగండి నుంచి కడ్తాల్‌కు రావడం.. కార్యాలయం మూసి ఉండటంతో తిరిగి ఇంటికి వెళ్లిపోవడం జరుగుతోంది. రోజూ తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చి పోతుండటంతో వేరే పనులు చేసుకోలేకపోతున్నా. ప్రభుత్వం దృష్టిసారించి రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి. 
– జవహర్‌లాల్, మైసిగండి, కడ్తాల్‌ మండలం  

ప్రభుత్వం స్పందించాలి
భూమికి సంబందించి పాత రికార్డులు పట్టుకుని రోజూ తహసీల్దార్‌ కార్యాలయానికి వస్తున్నా. వారం రోజులుగా కార్యాలయం మూసే ఉంటుంది. ప్రభుత్వం స్పందించి తహసీల్దార్‌ కార్యాలయాలు తెరిచేలా చర్యలు చేపట్టాలి. రైతుల సమస్యలు పరిష్కరించాలి. 
– సుందర్, మైసిగండి

Advertisement
Advertisement