‘అధికారులకు అలా జరగాల్సిందే..’

Tahsildar Murder : Gowrelly Farmer Phone Conversation With A Politician - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అబ్దుల్‌పూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డిని సురేశ్‌ అనే రైతు పెట్రోల్‌ పోసి నిప్పంటించి సజీవ దహనం చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్య అనంతరం.. గౌరెల్లి గ్రామంలోని 412 ఎకరాల భూ వివాదం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం సంచలనం రేపుతున్న ఈ హత్య గురించి ఓ రాజకీయ నేత గౌరెల్లి గ్రామానికి చెందిన రైతుతో మాట్లాడారు. వారిద్దరి సంభాషణకు సంబంధించిన ఆడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.  ఆ భూములు తాతల కాలం నాటివని.. అందులో 7 ఎకరాలు విజయారెడ్డిపై దాడికి పాల్పడ్డ సురేశ్‌ కుటుంబానికి చెందినవని గౌరెల్లి రైతు సదరు రాజకీయ నేతతో అన్నారు. ఇది రజకార్లు ఉన్నప్పుడు కొన్న భూమి అని.. దీని కోసం దాదాపు 1950 నుంచి కొట్లాడుతున్నామని తెలిపారు. ఎన్నో ఎళ్లుగా వాటిని కాజేయాలని చాలా మంది యత్నించారని ఆరోపించారు. ప్రభుత్వాలు మారిన సమస్య మాత్రం తీరలేదన్నారు.   

ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్లు నకిలీ పత్రాలు సృష్టించి భూములు కాజేసేందుకు యత్నించారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ భూముల కోసం రైతులు తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. ఈ భూములు రైతులకు ఇప్పిస్తానని చెప్పి..  ఓ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వారి వద్ద నుంచి రూ. 30 లక్షలు వసూలు చేశారని ఆరోపించారు. అందులో సురేశ్‌ కుటుంబానివి కూడా 2 నుంచి 3 లక్షల రూపాయలు ఉంటాయని చెప్పారు. 

రాజకీయ నేతతో రైతు జరిపిన సంభాషణ..

అలాగే పై అధికారులకు కూడా అలా జరగాల్సిందేనని సదరు రైతు అన్నారు. అయితే గౌరెల్లికి చెందిన రైతుతో మాట్లాడుతున్న సమయంలో సదరు రాజకీయ నేత కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెద్ద అంబర్‌పేటలో కూడా ఇలాగే 402 ఎకరాల భూమి ఉందని అన్నారు. 1955లో అక్కడి రైతులు ఈ భూములను కొనుగోలు చేశారని.. 1976 వరకు వారి పేర్లపైనే పట్టాలు ఉన్నాయని.. ఆ తర్వాత పేరు మార్చారని.. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉందని తెలిపారు. ఈ వివాదాన్న వెనకనుంచి ఓ ప్రముఖ నాయకుడి కుమారుడి నడిపిస్తున్నాడని ఆరోపించారు. అయితే చివర్లో ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించేలా పోరాటం రెండు గ్రామాల రైతులు చేసేలా చూడాలని వారి ఇరువురు అనుకున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top