గురుకులాల్లో ‘ సమ్మర్‌ సమురాయ్‌’ | Summer Samurai Camps In Gurukul Schools In Telangana | Sakshi
Sakshi News home page

గురుకులాల్లో ‘ సమ్మర్‌ సమురాయ్‌’

Apr 16 2019 4:16 AM | Updated on Apr 16 2019 4:16 AM

Summer Samurai Camps In Gurukul Schools In Telangana - Sakshi

సోమవారం తెలంగాణ సచివాలయంలో సమురాయ్‌ క్యాంపులను ప్రారంభిస్తున్న  మంత్రి కొప్పుల ఈశ్వర్‌. చిత్రంలో ఎమ్మెల్యే ఆనంద్, ఐఏఎస్‌ అజయ్‌ మిశ్రా, గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ తదితరులు

గురుకుల విద్యార్థులకు శారీరక దృఢత్వం, మానసికోల్లాసం కోసం ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీలు ‘సమ్మర్‌ సమురాయ్‌’పేరుతో ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు శ్రీకారం చుట్టాయి.

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల విద్యార్థులకు శారీరక దృఢత్వం, మానసికోల్లాసం కోసం ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీలు ‘సమ్మర్‌ సమురాయ్‌’పేరుతో ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు శ్రీకారం చుట్టాయి. వేసవి సెలవుల్లో సమయం వృ«థా చేయకుండా క్రీడలపై దృష్టిని సారించేందుకు సొసైటీ యంత్రాంగం వీటికి రూపకల్పన చేశాయి. దీంతో తల్లిదండ్రులకు భారం కాకుండా ఉపయోగకరంగా ఉంటాయనేది అధికారుల భావన. ఈ శిక్షణల్లో పోటీపరీక్షలకు సన్నద్ధం కావడం, క్రీడా నైపుణ్యాలు, కంప్యూటర్‌ కోర్సుల్లో శిక్షణ తదితర అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని ఈ శిబిరాలను నిర్వహిస్తున్నాయి. వాస్తవానికి 2013 నుంచే 3 చోట్ల ‘సమ్మర్‌ సమురాయ్‌’ని అందుబాటులోకి తెచ్చినప్పటికీ దాన్ని విస్తరిస్తూ 2019లో 88 క్యాంపులను ఏర్పాటు చేశారు.  

తల్లిదండ్రుల కోసం అమ్మానాన్న హల్‌చల్‌.. 
గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకే కాకుండా వారి తల్లిదండ్రులకు కూడా అవగాహన సదస్సులు నిర్వహించాలని సొసైటీలు నిర్ణయించాయి. ‘అమ్మా–నాన్న హల్‌చల్‌ ’పేరిట నిర్వహించే ఈ కార్యక్రమాల్లో పిల్లల పెంపకం, వారు ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటిని అధిగమించే మార్గాలు తదితర వాటిపై అవగాహన కల్పిస్తారు. ఏప్రిల్, మే నెలలో దశల వారీగా ఈ క్యాంపులను నిర్వహిస్తారు.  

శిబిరాలను ప్రారంభించిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌ 
‘సమ్మర్‌ సమురాయ్‌’, అమ్మానాన్న హల్‌చల్‌ కార్యక్రమాలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సోమవారం సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భం గా మంత్రి ఈశ్వర్‌ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తమ ప్రభుత్వం రాష్ట్రంలో గురుకులాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుందన్నారు. అన్ని రకాల వసతులు కల్పిస్తూ ప్రైవేటుకు ధీటుగా తయారు చేసిందన్నారు.  
ఐదేళ్ల క్రితం కేవలం 3వేల మంది విద్యార్థులతో ఈ శిబిరం ప్రారంభమైందని, ప్రస్తుతం 2లక్షలకు పెరిగిందన్నారు. ఈ క్యాంపుల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు భోజన సౌకర్యాలతో పాటు వసతి కూడా కల్పిస్తోందని, శిక్షణ పొంది న విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ పోటీల్లో మెరుగైన ఫలితాలు సాధించినట్లు చెప్పారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు పిల్లల పెంపకంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ‘అమ్మా–నాన్న హల్‌ చల్‌’పేరుతో కార్యక్రమా లు చేపట్టామన్నారు. గురుకుల సొసైటీ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, ఎస్సీ అభివృద్ధిశాఖ సంచాలకులు పి.కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.  

రెండు లక్షల మంది విద్యార్థులకు...
ఈ ఏడాది ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలకు చెందిన దాదాపు రెండు లక్షల మందికి వేసవి శిబిరాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో ఎస్సీ గురుకులాలకు చెందిన 1.5లక్షలు, గిరిజన సంక్షేమ గురుకులాలకు చెందిన 50వేల మంది విద్యార్థులున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి సంబంధిత సెట్‌(ప్రవేశ పరీక్ష)లకు శిక్షణ ఇస్తారు. క్రీడలపై ఆసక్తి ఉన్నవారికి నిర్దేశిత వాటిలో కోచ్‌లతో శిక్షణ ఇస్తారు. స్పోకెన్‌ ఇంగ్లీష్, మొబైల్‌ యాప్స్, డ్రోన్‌ తయారీ, మల్టీ మీడియా, లైఫ్‌ కెరీర్‌ కోడింగ్, కంప్యూటర్‌ కోర్సుల్లో నిపుణులతో శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. గుర్రపుస్వారీ, మార్షల్‌ ఆర్ట్స్, వాటర్‌ స్పోర్ట్స్, వెయిట్‌ లిఫ్టింగ్, స్టాక్‌ మార్కెట్‌పై అవగాహన, శాస్త్రీయ, పాప్‌ సంగీతం, స్కేటింగ్‌ తదితరాల్లోనూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement