రాష్ట్రానికి 54 టీఎంసీలొస్తాయి

The state will have 54 tmcs of water

‘కృష్ణా’ ప్రస్తుత నీటి లభ్యతపై మంత్రి హరీశ్‌తో అధికారులు

కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులు, వినియోగంపై మంత్రి సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా జలాలకు సం బంధించి ప్రస్తుత నీటి లభ్యతలో తెలంగాణకు 54.23 టీఎంసీల వాటా ఉందని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుకు అధికారులు తెలిపారు. పోతిరెడ్డిపాడు కింద అదనపు నీటి వినియోగం ఆపాలని ఆంధ్రప్రదేశ్‌ను కృష్ణా బోర్డు ఆదేశించిందని పేర్కొన్నారు. కృష్ణా బేసిన్‌ పరిధిలోని ప్రాజెక్టులు, నీటి లభ్యత, రెండు తెలుగు రాష్ట్రాల నీటి వినియోగంపై మంగళవారం జలసౌధలో మంత్రి చర్చించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీ, తెలంగాణకు కృష్ణా బోర్డు జరిపిన కేటాయింపులను ఈ సందర్భంగా మంత్రి ఆరా తీశారు.

ప్రస్తుతం కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టుల్లోకి 243 టీఎంసీల మేర నీరు రాగా, వాటా ప్రకారం ఏపీకి 154.09, తెలంగాణకు 89.95 టీఎంసీలు దక్కుతాయని.. అయితే తెలంగాణ వినియోగం 35.72 టీఎంసీలను పక్కనపెడితే మరో 54.23 టీఎంసీలు ఉంటాయని మంత్రికి అధికారులు వివరించారు. పోతిరెడ్డిపాడు కింద ఏపీకి 10 టీఎంసీల నీటి కేటాయింపులు ఉండగా, అదనంగా 2.35 టీఎంసీల నీరు వినియోగించిందని.. దీనిపై బోర్డుకు లేఖ రాయగా, వినియోగం ఆపమని ఏపీని బోర్డు ఆదేశించిందని వివరించారు. కాగా, రాష్ట్ర అవసరాల దృష్ట్యా మరింత నీటి కేటాయింపులు జరిగేలా బోర్డుతో చర్చించాలని అధికారులకు మంత్రి సూచించినట్లుగా తెలిసింది. భేటీలో ప్రభుత్వ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ మురళీధర్, సీఈలు సునీల్, నరసింహారావు పాల్గొన్నారు.  

నేడు, రేపు పీఆర్పీ టెలిమెట్రీ ప్రాంత పర్యటన..
పోతిరెడ్డిపాడు టెలిమెట్రీ విషయమై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేయడం తో నీటి ప్రవాహ లెక్కలను సరిచూ సేందుకు ముగ్గురు అధికారులను అక్కడికి పంపాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. ఈఈ రవీందర్‌ నేతృత్వంలోని బృందం బుధ, గురువారాల్లో పోతిరెడ్డిపాడు టెలిమెట్రీ ప్రాంతంలో పర్యటించి నివేదికివ్వాలని సూచించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top