నోటి గీత..మార్చింది రాత

srilekha special interview for women empowerment - Sakshi

వైకల్యాన్ని జయించి స్వయం ఉపాధి

పిల్లలకు చిత్రకళలో శిక్షణ, మోటివేషనల్‌ క్లాసెస్‌

ఆడపిల్ల అంటే ఆధారపడేదని ఎందుకు అనుకోవాలి? వైకల్యం ఉన్నంత మాత్రాన ఎవరో ఒకరి ఆసరా తీసుకోవాల్సిందేనని ఎందుకు భావించాలి? అని ప్రశ్నిస్తుంది శ్రీలేఖ. తన ప్రశ్నలకు తానే సమాధానం.. అంతేనా? మరెందరినో లక్ష్యం వైపు నడిపించే మోటివేషనల్‌ స్పీకర్‌. వైకల్యాన్ని జయించి, వైవిధ్యభరితమైన కళలకు ప్రాణం పోస్తున్న ఈ అమ్మాయి ‘అందరితో ఉందాం.. ఆధారపడకుండా ఉందాం’ అంటోంది.    

సాక్షి, సిటీబ్యూరో:  కుంచె నోటితో పట్టుకొని కాన్వాస్‌పై చిత్రాలు గీస్తున్న చందానగర్‌ నివాసి మందలపల్లి శ్రీలేఖను చూస్తే మన కళ్లు ఆశ్చర్యంతో ఆమెనే చూస్తాయి. పుట్టుకతోనే కాళ్లు, చేతులు పనిచేయకపోయినా తనలోని ప్రతిభ, ఆత్మవిశ్వాసాలనే అవయవాలుగా మలచుకొని... తాను కదలలేకపోయినా ఎందరినో కదిలించే చిత్రాలు గీస్తోంది. ‘మనిషి తలచుకుంటే ఏమైనా సాధించొచ్చు. జీవితమంటే ఎంతో ఉందని తెలుసుకున్నాను. తెలుసుకున్నది నలుగురికి తెలియజేయడమే ఇప్పుడు నా పని’ అంటున్న ఈ యువతి నోటితో కళాత్మక అపురూపాలు ఆవిష్కరిస్తున్న తీరు... విధిపై ఆమె సాధించిన విజయాల ‘చిత్రం’. ‘సాక్షి.. నేను శక్తి’ శీర్షికతో శ్రీలేఖ పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే...  

పుట్టుకతోనేపరీక్ష...
పాకడం, తప్పటడుగులు వేయడం, పరుగెత్తడం ఇలాంటివేవీ చిన్నప్పుడు నాకు తెలీదు. నాకు కండరాల క్షీణత వ్యాధి. శరీరం పెరుగుదల, కండరాల్లో పట్టుండదు. కీళ్లు పనిచేయవు. దేహం గాలి ఊదిన బెలూన్‌లా ఉంటుందని... పుట్టుకతోనే నేను జీవితకాల వైకల్య బాధితురాలని వైద్యులు తేల్చారు. అయితే ‘ఇలాంటి జబ్బున్న పిల్లల్లో మెదడు ఎదుగుదల ఉండదు. కానీ అదృష్టవశాత్తు మీ అమ్మాయికి మెదడు బాగానే పనిచేస్తుంద’ని మా అమ్మానాన్నకు చెప్పారు. ఇక నా తల్లిదండ్రులు చేతనైన చికిత్సలన్నీ చేయించినా ఎలాంటి మార్పు రాలేదు. కూర్చోవడం, పడుకోవడం, తినిపిస్తే తినడం తప్ప మరేమీ చేయలేని నన్ను కంటికిరెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. మిగతా ఇద్దరు పిల్లల్లానే చదివించారు. నన్ను ఎత్తుకొని స్కూల్‌కి తీసుకెళ్లి  బెంచిమీద కూర్చోబెట్టి వెళ్లేది అమ్మ. మళ్లీ మధ్యాహ్నం వచ్చి అన్నం తినిపించి, టాయ్‌లెట్‌కి తీసుకెళ్లి బట్టలు శుభ్రం చేసి, స్కూల్‌ టైమ్‌ అయ్యేంత వరకు ఉండి... తిరిగి ఇంటికి తీసుకెళ్లేది. ఇలాగే నానాయాతన పడుతూ డిగ్రీ వరకు చదివించారు.

పట్టుదలతో ఫస్ట్‌క్లాస్‌...   
‘చలనం లేని శరీరానికి చదువులెందుకని’ కొందరు... ‘ఏం సాధించాలని?’ అని మరికొందరు ఎద్దేవా చేశారు. ఆ మాటలు నాలో మరింత పట్టుదలను పెంచాయి. కుడి చెయ్యి ఒక్కటి లేపి పుస్తకం మీద పెడితే రెండువేళ్లతో అతి కష్టంగా, చాలా మెల్లగా రాసేదాన్ని. ఆ రాత కోసం రాత్రి పగళ్లు సాధన చేసి నేర్చుకున్నాను. పరీక్ష మూడు గంటల సమయముంటే.. టీచర్లు, లెక్చరర్లు నాకోసం మరో అరగంట అదనంగా కేటాయించేవారు. ప్రతి తరగతిలోనూ ఫస్ట్‌ క్లాస్‌లో పాసయ్యాను. డిగ్రీలో 70శాతం మార్కులు సాధించాను.    

ఉపాధి సృష్టి
బీకామ్‌ పూర్తయ్యాక ఉద్యోగం చేద్దామంటే.. ‘95 శాతం వైకల్యం. ఒకరి అండ లేకుండా కదలలేని వ్యక్తికి ఉద్యోగం ఎలా ఇస్తాం?’ అని ప్రశ్నించారు. ఉద్యోగం పేరుతో ఒకరిని అడిగే కన్నా.. ప్రతిభకు సానబెట్టి మనమే ఏదో ఉద్యోగం ఎందుకు సృష్టించుకోకూడదు? అని ఆలోచించాను. చిన్నప్పటి నుంచి అమ్మ చీరల మీద ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్‌ వేస్తుంటే... చూస్తూ కొంచెం నేర్చుకున్నాను. దాన్నే ఆధారం చేసుకోవాలనుకున్నాను. అయితే బరువైన బ్రష్‌లు చెయ్యితో పట్టుకోవడం కుదిరేది కాదు. బ్రష్‌ తీసి చేతిలో పెట్టినా జారిపోయేది. దీంతో నోటితో పట్టుకున్నాను. ‘నువ్వేం వేయగలవు. చాలా కష్టం’ అని నా పంతం తెలిసిన అన్నయ్య నన్ను మరింత రెచ్చగొట్టేవాడు. నోటితో అన్ని రకాల స్ట్రోక్స్‌ ఇవ్వడం అసాధ్యమని, క్లాస్‌ తీసుకోలేనని చెప్పారు టీచర్‌. ఒక్క అవకాశం ఇవ్వమని వేడుకున్నాను. సార్‌ చెప్పినట్టు పెయింటింగ్‌ వేసి చూపించాను. అలా రోజు ఐదారు గంటలు పెయింటింగ్‌ ఎగ్జిబిషన్స్‌లో పాల్గొంటున్నాను. అంతర్జాతీయ ఫుట్‌ అండ్‌ మౌత్‌ ఆర్టిస్ట్‌ల కాంటెస్ట్‌కి పెయింటింగ్స్‌ పంపాను. ఈ మధ్యే ఇంటి దగ్గర చిన్నపిల్లలకు పెయింటింగ్‌ క్లాస్‌లు కూడా తీసుకుంటున్నాను. అయితే ఇది ఆదాయం కోసం కాదు... నాకు వచ్చిన కళ మరికొందరికి నేర్పడానికి మాత్రమే. వీల్‌చైర్‌ మీద కూర్చున్నా.. వీలైనంత మందిని మార్చాలని ఉంది. అందుకే మోటివేషన్‌ క్లాసెస్‌.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top