
‘చెత్త’ ఆదేశాలు ఇవ్వలేదు: సోమేశ్ కుమార్
ఆస్తి పన్ను చెల్లించనివారి ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపార సముదాయాల ముందు చెత్త డబ్బాలుంచాలని తాను ఎటువంటి ఆదేశాలు...
సాక్షి, హైదరాబాద్: ఆస్తి పన్ను చెల్లించనివారి ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపార సముదాయాల ముందు చెత్త డబ్బాలుంచాలని తాను ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) కమిషనర్ సోమేశ్‌కుమార్ హైకోర్టుకు బుధవారం నివేదించారు. ఇలా చెత్త డబ్బాలుంచుతున్నారని పత్రికలు, టీవీ చానళ్ల ద్వారా తెలుసుకుని చట్ట ప్రకారం వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.
అందువల్ల ఈ అంశంపై దాఖలైన వ్యాజ్యాన్ని మూసివేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ఇటీవల ఈ అంశంపై న్యాయవాది బాలాజీ వదేరా హైకోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ కౌంటర్ దాఖలు చేశారు.