
'అసెంబ్లీ ముగిసింది.. కరెంట్ చార్జీలు పెంచేశారు'
టీఆర్ఎస్ సర్కారు దొంగచాటుగా విద్యుత్ చార్జీల భారాన్ని మోపిందని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ సర్కారు దొంగచాటుగా విద్యుత్ చార్జీల భారాన్ని మోపిందని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రూ.816 కోట్ల భారాన్ని ప్రభుత్వం ప్రజలపై మోపిందని ఆయన అన్నారు. బడ్జెట్ మేరకు మరో 20 వేల కోట్ల పన్నులను ప్రజలపై వేసే ప్రమాదం ఉందని అన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రం.. రెవెన్యూ మిగులు ఉందంటూనే ప్రజలపై పన్నుల భారం మోపడం సీఎం కేసీఆర్కే చెల్లిందని షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు.
విద్యుత్ చార్జీలు పెంచితే కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. గతంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కేవలం ఒక్కసారి మాత్రమే విద్యుత్ చార్జీలు పెంచిందని ఆయన సమర్థించుకున్నారు. పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని.. లేదంటే సబ్సిడీగా ప్రభుత్వమే ఈ భారాన్ని భరించాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.