
తాడూరు (నాగర్‌కర్నూల్) : ఆర్టీసీ బస్సు సెల్ఫ్ స్టార్టర్ పనిచేయకపోవడంతో అర్ధంతరంగా ఓ కాజ్‌వేపై నీటిలో నిలిచిపోయింది. బుధవారం ఉదయం నాగర్‌కర్నూల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సుమారు 25 మంది ప్రయాణికులతో చర్లతిర్మలాపురానికి బయలుదేరింది. దారిలోని కాజ్‌వే మధ్యలోకి వెళ్లి అకస్మాత్తుగా ఆగిపోయింది. కేఎల్‌ఐ కాల్వల ద్వారా వస్తున్న నీరు పెద్ద ఎత్తున చేరుకోవడంతో అక్కడ లోతుగా ఉంది. ఆగిన బస్సు వెంటనే స్టార్ట్ కాకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే వారు కిందకి దిగి బస్సును తోసి కాజ్‌వేను ఎలాగోలా దాటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.