చేతికి రాని పంట!

Rice Crops Losses With Heavy Rains - Sakshi

తొమ్మిది వందల ఎకరాల్లో కేఎన్‌ఎం118 రకం వరి సాగు

కాలపరిమితి ముగియడంతో రైతుల్లో ఆందోళన

125 రోజుల్లో పంట చేతికొస్తుందని ప్రచారం

145 రోజులు గడుస్తున్నా కోత దశకు చేరుకోలేదు

అకాల వర్షాలకుదెబ్బతింటున్న పంటలు

మోర్తాడ్‌(బాల్కొండ):సాధారణంగా రబీ సీజనులో ఈదురు గాలులు, అకాల వర్షం కురిసే అవకాశాలు ఉంటాయి. ఈ ప్రకృతి వైపరీత్యాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు తక్కువ కాల పరిమితిలో చేతికి వచ్చే వరి రకాలను సాగు చేయాలని భావిస్తున్నారు. ఈ తరుణంలో పెద్దపల్లి జిల్లా కూనారం వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఉత్పత్తి చేసిన కేఎన్‌ఎం 118 రకం వరి వంగడాలను రుద్రూర్‌ పరిశోధన కేంద్రంలో సీడ్‌ ప్రాసెసింగ్‌ చేసి రైతులకు సరఫరా చేశారు. దాదాపు 900 సంచుల కేఎన్‌ఎం 118 రకం వరి విత్తనం ఉండటంతో ఈ విత్తనాలను రైతులకు ఈ రబీ సీజనుకు గాను పరిశోధన కేంద్రం ఉద్యోగులు విక్రయించారు. జిల్లాలోని కమ్మర్‌పల్లి, మోర్తాడ్, ఏర్గట్ల, మెండోరా, ముప్కాల్, బాల్కొండ, వేల్పూర్, జక్రాన్‌పల్లి, రెంజల్, ఎడపల్లి, నవీపేట్, బోధన్, వర్ని, కోటగిరి, రుద్రూర్‌ తదితర మండలాల్లోని రైతులు ఈ కొత్త రకం వరి విత్తనాన్ని కొనుగోలు చేసి సుమారు తొమ్మిది వందల ఎకరాల్లో సాగు చేశారు. 125 రోజుల్లో వరి పంట చేతికి వస్తే అకాల వర్షాలు రాక ముందే పంట కోత దశకు చేరుకుంటుందని రైతులు  ఆశించారు. సాధారణంగా రబీ పంటల సాగు డిసెంబర్‌లోనే మొదలు పెడుతున్నారు. డిసెంబర్‌లో నారు పోస్తే జనవరిలో పంటను నాటుతారు. ఈ లెక్కన ఏప్రిల్‌ రెండో వారంలో పంట కోత దశకు చేరుకుంటుంది. నెలలు, రోజుల ప్రకారం లెక్కలు వేసిన రైతులు కేఎన్‌ఎం 118 రకం వరిని సాగు చేశారు. శాస్త్రవేత్తలు ప్రకటించిన ప్రకారం 125 రోజుల్లో వరి పంట చేతికి రావాల్సి ఉంది. అయితే 145 రోజులు గడుస్తున్నా ఇంకా వరి పంట కోత దశకు చేరుకోలేదు.

ఈ పంట చేతికి రావాలంటే మరో 10 రోజుల సమయం పడుతుంది. వారం రోజుల నుంచి వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకోవడంతో పాటు అక్కడక్కడ అకాల వర్షాలు కురుస్తున్నాయి. వరి పంట ఇంకా కోత దశకు చేరుకోకపోవడంతో రైతులు తమ పంట పరిస్థితి ఏమిటని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కేఎన్‌ఎం 118 రకం తక్కువ కాల పరిమితితో పాటు ఎకరానికి 30 క్వింటాళ్ల నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు ప్రకటించడంతో ఈ రకం వరి వంగడాలను రైతులు కొనుగోలు చేసి సాగు చేశారు. దిగుబడి మాట ఎలా ఉన్నా పంట కోత దశకు చేరుకోకపోవడంతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది.  

ఖరీఫ్‌లోనే తక్కువ సమయంలో చేతికి వస్తుంది
కేఎన్‌ఎం 118 రకం ఖరీఫ్‌లోనే 125 రోజుల్లో కోతకు వస్తుంది. రబీలో 10 రోజుల కాల పరిమితి ఎక్కువ అవుతుంది. అయితే వాతావరణ పరిస్థితుల ప్రకారం ఇంకా పది రోజుల సమయం ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది. ఈ వంగడాన్ని మేము కేవలం ప్రాసెసింగ్‌ మాత్రమే చేశాం. ఉత్పత్తి చేసిన వారు కునారం వారు.– ప్రభాకర్‌రెడ్డి,శాస్త్రవేత్త, రుద్రూర్‌ పరిశోధన కేంద్రం

కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్‌కు చెందిన రైతు బద్దం ప్రసాద్‌ రబీలో అకాల వర్షాలు కురుస్తాయనే ఉద్దేశంతో తక్కువ కాలపరిమితిలో చేతికి వచ్చే వరి రకాన్ని సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. అంతలోనే రుద్రూర్‌ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఇచ్చిన ఒక ప్రకటన చూసి కేఎన్‌ఎం 118 రకం వరి విత్తనాన్ని కొనుగోలు చేసి పది ఎకరాల్లో వరిని సాగు చేశారు. కేఎన్‌ఎం 118 రకం సాగు చేస్తే 125 రోజుల్లో పంట కోతకు వస్తుందని పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు ప్రకటించారు. కాని బద్దం ప్రసాద్‌ సాగు చేసిన వరి పంటకు 145 రోజులు గడచిపోయినా పంట ఇంకా కోత దశకు చేరుకోలేదు. ఈ పంట కోత దశకు చేరుకోవాలంటే మరో పది రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఇది ఒక బద్దం ప్రసాద్‌కు సంబంధించిన సమస్యనే కాదు. జిల్లాలో సుమారు 900 ఎకరాల్లో వరి పంటను సాగు చేసిన రైతుల పరిస్థితి ఇది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top