6 నెలల్లో..రీజనల్‌ రింగ్‌ రోడ్డు! | Regional Ring Road in 6 month | Sakshi
Sakshi News home page

6 నెలల్లో..రీజనల్‌ రింగ్‌ రోడ్డు!

Jul 14 2017 12:55 AM | Updated on Sep 5 2017 3:57 PM

రాష్ట్ర రాజధానికి మణిహారంలా ఉన్న ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు ఆవల మరో మణిహారం రీజినల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) పనులపై కదలిక వచ్చింది.

కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు
సమగ్ర ప్రాజెక్టు నివేదికకు కేంద్రం ఆమోదం తప్పనిసరి..
అనుమతి కోసం రోడ్లు భవనాల శాఖ నిరీక్షణ
285 కి.మీ. మార్గంలో రూ.5 వేల కోట్లతో నిర్మాణం


అలైన్‌మెంట్‌ ఖరారు: ఆర్‌అండ్‌బీ
సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర రాజధానికి మణిహారంలా ఉన్న ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు ఆవల మరో మణిహారం రీజినల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) పనులపై కదలిక వచ్చింది. సుమారు 285 కి.మీ. మార్గంలో నాలుగు వరుసల్లో రూ.5 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రీజినల్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ ఖరారు, సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) తయారీకి అవసరమైన అనుమతులు కోరుతూ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ తాజాగా కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. ఈ మేరకు కేంద్ర రహదారులు, హైవేల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపింది. ఆ శాఖ అనుమతి, మార్గదర్శకాల ప్రకారం ఆరు నెలల్లో డీపీఆర్‌ సిద్ధం చేయనున్నట్లు ఆర్‌అండ్‌బీ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. చౌటుప్పల్, సంగారెడ్డి, షాద్‌నగర్, కంది తదితర ప్రాంతాలను కలుపుతూ వెళ్లే రీజినల్‌ రింగ్‌ రోడ్డు.. ఆయా ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేయనుంది. ఆర్‌ఆర్‌ఆర్‌తో ఆయా ప్రాంతాల్లో రవాణా, వాణిజ్య, విద్య, పారిశ్రామిక అవకాశాలు మెరుగుపడనున్నాయి. రీజినల్‌ రింగ్‌ రోడ్డుతో నగరంలోని పది ప్రధాన రహదారులు అనుసంధానం కానుండటం విశేషం.

ఇదీ రీజినల్‌ రింగ్‌రోడ్డు ప్రతిపాదన..             
152 కి.మీ.
సంగారెడ్డి–నర్సాపూర్‌–తూ్రప్రాన్‌–
గజ్వేల్‌–జగదేవ్‌పూర్‌–
భువనగిరి–చౌటుప్పల్‌

133 కి.మీ.
చౌటుప్పల్‌–ఇబ్రహీంపట్నం–
ఆమన్‌గల్‌–షాద్‌నగర్‌–చేవెళ్ల–
శంకర్‌పల్లి–కంది


అలైన్‌మెంట్, భూసేకరణే కీలకం..
రీజినల్‌ రింగ్‌ రోడ్డు పనులు ప్రారంభించాలంటే తుది అలైన్‌మెంట్‌ ఖరారు, భూసేకరణ, బాధితులకు పరిహారం చెల్లింపు వంటి అంశాలు కీలకంగా మారాయి. ఆయా ప్రాంతాల్లో భూముల విలువ కోట్లకు చేరుకోవడంతో నాలుగు వరుసల రహదారి ఏర్పాటుకు అవసరమైన భూములను సేకరించడం వ్యయ ప్రయాసలతో కూడినదని రోడ్లు, భవనాల శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కేంద్రం అలైన్‌మెంట్‌ ఖరారు, డీపీఆర్‌ తయారీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన పక్షంలో కన్సల్టెన్సీని నియమించి డీపీఆర్‌ను సిద్ధంచేసి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులను త్వరితగతిన చేపడతామని పేర్కొంటున్నాయి. తుది అలైన్‌మెంట్‌లో మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు ఉంటాయని చెపుతున్నాయి. షాద్‌నగర్‌–కంది మార్గంలో ఇప్పటికే నాలుగు వరుసల రహదారి అందుబాటులో ఉందని.. ఈ మార్గంలో రహదారిని మరింత విస్తరించాలా? వద్దా? అన్న అంశాలపైనా కసరత్తు చేయాల్సి ఉందని పేర్కొన్నాయి. ప్రతిపాదిత రీజినల్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న పది రాష్ట్ర రహదారులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపాయి. ఇప్పటికే సంగారెడ్డి–చౌటుప్పల్‌ మార్గాన్ని జాతీయ రహదారిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చినట్లు వివరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement