చదవడం.. రాయడం!

Read And Write Program In Nalgonda Govt Schools - Sakshi

నల్లగొండ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో సామర్థ్యం పెంపునకు విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాఠశాలల్లో నెల రోజులపాటు విద్యార్థులకు చదవడం, రాయడం నేర్పించే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఆ తర్వాతే ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి తరగతులు చేపట్టాలని నిర్ణయించారు. తద్వారా విద్యార్థుల్లో సామర్థ్యం పెరిగి  విద్యాభివృద్ధిలో ముందుకు సాగుతారని  విద్యాశాఖ అధికారుల ఉద్దేశం. అందులో భాగంగానే ఈ కార్యక్రమానికి పూనుకున్నారు. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మొత్తం 1,483 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో చదివే విద్యార్థులకు చదవడం, రాయడం సక్రమంగా రావడం లేదనేది విద్యాశాఖ ఉన్నతాధికారుల పరిశీలనలో వెల్లడైంది.

గత సంవత్సరం ఎస్‌ఈఆర్‌టీ అధికారులు జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో పర్యటించి 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల సామర్థ్యాలపై పరీక్షలు నిర్వహించారు. 1 నుంచి 5వ తరగతి పిల్లలకు చదవడం, రాయడం సక్రమంగా రావడం లేదు. 6 నుంచి10వ తరగతి విద్యార్థులకు కొందరికి చదవడం, రాయడం రాకపోగా మరికొంతమందికి సైన్స్‌లో సామర్థ్యం లేదని గుర్తించారు. ఇంకొందరికి గణితం, సైన్స్, సోషల్‌ సబ్జెక్టుల్లో సామర్థ్యాలు తక్కువగా ఉన్నాయని వెల్లడైంది.  చాలామందికి ఆయా సబ్జెక్టుల్లో సున్నా మార్కులు వచ్చాయి. ఎస్‌ఈఆర్‌టీవారు రాష్ట్ర వ్యాప్తంగా సామర్థ్యాలపై పరీక్షలు నిర్వహించగా అందులో నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే వెనుకబడినట్లు తేలింది. దీంతో ఆ నివేదికలు జిల్లాకు పంపించారు.

సామర్థ్యం పెంపునకు డీఈఓ ప్రత్యేక కార్యక్రమం 
నివేదికలను పరిశీలించిన డీఈఓ సరోజినీ దేవి ఆయా విద్యార్థుల్లో సామర్థ్యం పెంపు కోసం నెల రోజులపాటు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పాఠశాల ప్రారంభం అయిన నాటినుంచి బడిబాట మినహా రోజూ ప్రతి తరగతిలోని విద్యార్థులకు ప్రత్యేకంగా చదవడం, రాయడం కార్యక్రమాలే నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల తర్వాత పీఈటీలు లేని పాఠశాలల్లో రోజూ ఆ పీరియడ్‌లో చదవడం, రాయడం కార్యక్రమాన్ని కూడా అమలు చేయాలని నిర్ణయించారు. అదే విధంగా మిగతా పాఠశాలల్లో కూడా ఒక పిరియడ్‌ను తప్పనిసరి చదివించడం, రాయించే కార్యక్రమం చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. 

సామర్థ్యాల పెంపు తప్పనిసరి 
చదవడం, రాయడం కార్యక్రమం వల్ల విద్యార్థుల్లో సామర్థ్యం పెంపొందేందుకు అవకాశం ఉంటుంది. ఈనెల ఈ చదవడం, రాయడం చేపట్టి ఆతర్వాత కూడా ఓ పిరియడ్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. రోజూ పాఠ్యాంశాలను చదివించడం వల్ల విద్యార్థుల్లో భయాలు తొలగి ధైరంగా చదువుకునే అవకాశం ఉంది. పది సార్లు చదివినా ఒకసారి రాసినా ఒకటే. రాయడం వల్ల పాఠ్యాంశం మనస్సులో ఉండిపోయే అవకాశం ఉన్నందున ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం.   – డీఈఓ సరోజినీదేవి, నల్లగొండ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top