రేషన్‌లో భారీ కోత..! | Ration shop in subsidy rice Massive cuts | Sakshi
Sakshi News home page

రేషన్‌లో భారీ కోత..!

Oct 13 2015 11:19 PM | Updated on Sep 3 2017 10:54 AM

రేషన్‌లో భారీ కోత..!

రేషన్‌లో భారీ కోత..!

పేదలకు రేషన్ దుకాణాల ద్వారా అందించే సబ్సిడీ బియ్యంపై ప్రభుత్వం గత నెల నుంచి భారీ కోత విధిస్తోంది.

మెదక్ : పేదలకు రేషన్ దుకాణాల ద్వారా అందించే సబ్సిడీ బియ్యంపై ప్రభుత్వం గత నెల నుంచి భారీ కోత విధిస్తోంది. పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో సైతం 4 నుంచి 5 శాతం వరకు పంపిణీ చేసే మొత్తంలో కోత పెడుతున్నారు. దీంతో గ్రామాల్లోని పేదలు డీలర్లతో వాగ్వాదానికి దిగుతున్నారు. గత రెండేళ్లుగా వర్షాలు సరిగా పడక గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా మంది ప్రజలు పొట్టచేతబట్టుకొని వలస వెళ్లారు. అయినప్పటికీ వారు నెలనెలా గ్రామాలకు వచ్చి రేషన్ బియ్యం  తీసుకెళ్తుంటారు. అయితే అధికారులు స్థానికంగా ఉండని ప్రజలకు రేషన్ బియ్యం ఇవ్వొద్దంటూ ఆదేశాలు జారీచేసినట్లు విశ్వసనీయ సమాచారం.

అలాగే గ్రామాల్లో ట్రాక్టర్ల వంటి వాహనాలు ఉన్న వారికి సైతం బియ్యంలో కోత విధించాలని అధికారుల నుంచి డీలర్లకు ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది. అధికారుల ఆదేశాలు పాటించడంతో గ్రామాల్లో ప్రజలనుంచి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, రేషన్ షాపులను వదిలేసుకోవడమే మేలని పలువురు డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ పట్టణంతోపాటు మండలంలో మొత్తం 61 రేషన్ షాపులు ఉన్నాయి.

వీరికి నెలకు 6023.09 క్వింటాళ్ల బియ్యాన్ని ప్రభుత్వం నెలనెలా సరఫరా చేస్తోంది. కాగా గతనెల నుంచి రేషన్ బియ్యంలో  కోత విధించాలని అధికారులకు ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. దీంతో ప్రతినెలా డీలర్లకు సరఫరా చేసే 6023.09 క్వింటాళ్ల బియ్యంలో గతనెల 238 క్వింటాళ్ల కోత విధించారు. దీంతో ఒక్కో గ్రామానికి 4నుంచి 5 శాతం సరఫరా నిలిపివేశారు. ఫలితంగా పట్టణాలతోపాటు పల్లెల్లో డీలర్లకు ప్రజలకు మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి.  ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ముఖ్యమైనది రేషన్ బియ్యమే.  

ఈ పథకానికి ఏమైనా అటంకాలు కల్పిస్తే...ప్రభుత్వం ఇరకాటంలో పడక తప్పదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుత కరువు, కాటకాల్లో రోజంతా కూలీ నాలీ చేసుకునే ప్రజలకు ఈ పథకం ఎంతగానో ఆదుకుంటోంది. అలాంటి గొప్ప పథకాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వానికి మచ్చ వస్తుందని పలువురు వాపోతున్నారు.

ఈవిషయమై రెవెన్యూ అధికారి ఒకరు మాట్లాడుతూ తమకు ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చిన విషయం వాస్తవమేనన్నారు. వలస వెళ్లిన ప్రజల కార్డులతోపాటు గ్రామాల్లో ఉండే కొద్దిపాటి మందికి సరఫరా చేసే బియ్యంలో కోత విధించాలంటూ ఆదేశాలు జారీ అయినట్లు తెలిపారు.  కానీ వలస వెళ్లేది పేదలేకదా.. అనే  ప్రశ్నకు ఆయన మౌనం పాటించారు.
 
అధికారి వివరణ
ఈ విషయంపై జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి అనురాధను సాక్షి వివరణ కోరగా తాను ఇటీవలే బదిలీపై వచ్చానని, రేషన్ బియ్యం కోత విషయం తనకు తెలియదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement