పకడ్బందీగా రేషన్‌ బియ్యం పంపిణీ

Ration Rice Distributed In The Presence Of Joint Collector - Sakshi

జాయింట్‌ కలెక్టర్‌ వెంకట్రావు

తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌

జడ్చర్ల : జిల్లాలో రేషన్‌బియ్యం పంపిణీకి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ వెంకట్రావు తెలిపారు. రేషన్‌ డీలర్ల సమ్మె నేపథ్యంలో మంగళవారం ఆయన జడ్చర్ల స్టాక్‌ పాయింట్‌ను పరిశీలించి బియ్యం పంపిణీకి సంబంధించి ఆరా తీశారు. సకాలంలో లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించారు. అనంతరం జేసీ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 804 రేషన్‌ దుకాణాలకు సంబంధించి 420 దుకాణాలకు డీలర్లు డీడీలు కట్టారని మిగతా 384 రేషన్‌ దుకాణాలకు ఐకేపీ, మెప్మా ద్వారా ఆర్‌ఓలు జారీ చేశామని తెలిపారు.

ఇప్పటికే 121 దుకాణాలకు బియ్యం స్టాక్‌ పాయింట్ల నుండి తరలించామని చెప్పారు. రాతీ, పగలు తేడా లేకుండా అదనపు లారీలను ఏర్పాటు చేసి గోదాముల నుండి అన్ని దుకాణాలకు బియ్యాన్ని చేరుస్తామని తెలిపారు. కలెక్టర్‌ కార్యాలయంలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కంట్రోల్‌ రూం కూడా ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేయాలనుకుంటే 08542–241330 నంబర్‌ ఫోన్‌ చేయాలని సూచించారు. మండల స్థాయిలో తహసీల్దార్‌ను నోడల్‌ అధికారిగా నియమించగా, గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి, వీఆర్‌ఓ, ఐకేపీ సీసీలను పర్యవేక్షకులుగా ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా పోలీసుల సహకారాన్ని కూడా తీసుకుంటామని తెలిపారు. స్థానిక తహసీల్దార్‌ లక్ష్మీనారాయణ, సివిల్‌ సప్లయీస్‌ డీటీ హరికృష్ణ, ఆర్‌ఐ రఘు తదితరులు పాల్గొన్నారు. 

ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు 
మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌ : ప్రజాపంపిణీ కార్యక్రమంలో భాగంగా సరుకుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు సూచించారు. జడ్చర్ల నుండి మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బందితో సమీక్షించగా కలెక్టరేట్‌ నుండి డీసీఎస్‌ఓ శారదా ప్రియదర్శిని, సివిల్‌ సప్లయీస్‌ డీఎం బిక్షపతి పాల్గొన్నారు. జిల్లాలో మొత్తం 420 మంది డీలర్లు డీడీలు కట్టారని, మిగిలిన స్థానాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అన్నిచోట్ల ఈ నెల 5వ తేదీ నుండి 10వ తేదీ వరకు సరుకుల పంపిణీ చేయించాలని సూచించారు.

భూసేకరణ ప్రక్రియలో ఆలస్యం చేయొద్దు 
మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌ : జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం చేయొ ద్దని జేసీ ఎస్‌.వెంకట్రావు సూచించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంగళ వారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలమూరు–రంగారెడ్డి, భీమా, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులతో పాటు జాతీయ రహదారి నిర్మాణం ప్రాజెక్టులకు భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top