2 రోజులు..  23 వేల ఓటర్లు!

Ranga Reddy Votes Removed - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  నూతన ఓటరు నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఈ ఏడాది జనవరి ఒకటి నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులతోపాటు జాబితాలో పేరులేని అర్హులంతా నమోదుకు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా వివిధ మాధ్యమాల ద్వారా ఓటు విలువ, ప్రాధాన్యత తెలుసుకుంటున్న యువత పెద్దఎత్తున ఓటరుగా నమోదు చేయించుకునేందుకు బూత్‌ లెవల్‌ ఆఫీసర్స్‌ (బీఎల్‌ఓ) వద్దకు బారులుదీరుతున్నారు. రెండు రోజుల్లోనే 23 వేల మందికి పైగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 15, 16 తేదీల్లో అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వెళ్లే జిల్లా ఏరియాల్లో 3,073 ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసి బీఎల్‌ఓలు దరఖాస్తులు స్వీకరించారు.

రెండు రోజుల్లో కలిపి మొత్తం 23,174 మంది ఓటు హక్కు కోసం అర్జీలు అందాయి. ఈనెల 25వ తేదీ వరకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు గడువు ఉంది. ఈ లోగా దరఖాస్తుల సంఖ్య 35 వేలకు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈనెల 10న విడుదలైన ముసాయిదా జాబితా ప్రకారం జిల్లా ఓటర్ల సంఖ్య 26.56 లక్షలు. కొత్తగా వస్తున్న దరఖాస్తులనూ పరిగణనలోకి తీసుకుంటే ఓటర్ల సంఖ్య 27 లక్షలకు చేరే అవకాశం ఉంది. మొత్తం మీద ప్రత్యేక క్యాంపులకు మంచి స్పందన వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులకు ఈ నెల 25 వరకు అవకాశం కల్పించారు. వచ్చేనెల 8న ఓటర్ల తుది జాబితా విడుదల కానుంది.

తొలగింపులు తక్కువే! 
ప్రత్యేక క్యాంపులు కొనసాగిన రెండు రోజుల్లో ఓటరు జాబితా నుంచి పేర్ల తొలగింపు కోసం మొత్తం 1,144 దరఖాస్తులు అందాయి. ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి ఓటర్లు మారితే తప్పనిసరిగా తొలి జాబితాలో తమ పేర్లను తొలగించుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే మరో నియోజకవర్గం లో ఓటు హక్కు పొందే వీలుంటుంది.  వివిధ జిల్లాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చి నగ ర శివారు ప్రాంతాలైన ఎల్బీనగర్, సరూర్‌నగర్‌తోపాటు పరిశ్రమల కేంద్రంగా మారుతున్న షాద్‌నగర్‌ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నారు.

వీరంతా తమ సొంత ఊళ్లలో ఓటు హక్కు ఉండేలా చూసుకుంటున్నారు. దీంతో తాత్కాలిక నివాస ప్రాంతాల్లోని ఓటరు జాబితాలో తమ పేర్లను తొలగించుకుని తమ సొంత నియోజకవర్గంలో పొందేందుకు ఆసక్తి కనబర్చుతారు. అలాగే తమ పేర్లు, ఇంటిపేరు, పుట్టిన తేదీ తదితర వాటిలో తప్పుల సవరణకు కూడా 1,097పైగా దరఖాస్తులు అధికారులకు అందాయి. వీటితోపాటు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నివాస స్థలం మారితే.. చిరునామా మార్పు కోసమూ 1,553 మంది అర్జీలు సమర్పించారు.

అందుబాటులోకి కాల్‌ సెంటర్‌ 
ఓటరు జాబితాపై ఫిర్యాదులు, ఓటరు నమోదులో ఎదురవుతున్న ఇబ్బందులు, సందేహాల నివృత్తి కోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేక కాల్‌ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. తమ సమస్యను కాల్‌ సెంటర్‌లోని సిబ్బంది దృష్టికి తీసుకెళ్తే పరిష్కార మార్గాలు చూపిస్తారు. కలెక్టరేట్‌లోని ఎన్నికల విభాగంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఓటరు జాబితా, ఎన్నికలకు సంబంధించిన అన్ని విషయాలను ఈ కాల్‌ సెంటర్‌ దృష్టికి తీసుకెళ్లొచ్చు. 040–23230811, 040–23230813, 040–23230814 కు అన్ని రోజుల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్‌ చేయవచ్చు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top