చిరంజీవి రామస్వామి | Sakshi
Sakshi News home page

చిరంజీవి రామస్వామి

Published Sun, Nov 23 2014 3:13 AM

చిరంజీవి రామస్వామి - Sakshi

హన్మకొండ కల్చరల్: అబ్రకదబ్రా.. అంటూ ఆయన చేసే ఇంద్రజాల ప్రదర్శనలు అబ్బురపరిచేవి. సంబ్రమాశ్చర్యాలకు గురిచేసేవి. మ్యాజిక్‌కు కేరాఫ్‌గా నిలిచి.. తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఆ ఇంద్రజాలికుడు కెమిడి రామస్వామి. జీవితాంతం ఇంద్రజాలాన్నే శ్వాసించిన రామస్వామి.. తుది శ్వాస విడిచిందీ కళావేదిక సమీపంలోనే. శుక్రవారం సాయంత్రం ప్రదర్శనలిస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు రామస్వామి. వేదిక దిగిన కొద్దినిమిషాల్లోనే గుండెపోటుతో కుప్పకూలడం అందరినీ కలచివేసింది.  

తండ్రి స్ఫూర్తితో..
జిల్లాలోని జనగామలో 1947 నవంబర్ 4న జన్మించారు రామస్వామి. బాల్యంలోనే తల్లి మరణించింది. తండ్రి మల్లయ్య మేజిక్ ప్రదర్శనలు రామస్వామిని ఆకట్టుకునేవి. అలా తండ్రి వద్దే అసిస్టెంట్‌గా చేరి తన ఆసక్తి.. పరిశీలన శక్తితో ఇంద్రజాలాన్ని ఔపోసన పట్టారు. స్వయంకృషితో క్రమక్రమంగా ఎదిగారు. 14 ఏళ్ల వయస్సులోనే తండ్రిని కోల్పోయారు.

దేశసేవలో..
పదహారేళ్ల ప్రాయంలో దేశసేవ చేయాలని ఆయన భావించారు. కానీ ఎత్తు తక్కువ కావడంతో మిలటరీలో ఎంపిక కాలేకపోయారు. 1964లో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీసులో చేరారు. 1965-66 పాకిస్థాన్ యుద్ధ సమయంలో ఇంఫాల్, మణిపూర్ నాగాలాండ్, బర్మా సరిహద్దుల్లో ఏడాదిపాటు పోరుసల్పారు. తర్వాత వరంగల్ తిరిగి వచ్చారు. 1966లో పెళ్లి చేసుకున్నారు. 2005లో అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా రిటైర్డయ్యారు.
 
వెయ్యికి పైగా ప్రదర్శనలు
1979 మార్చి 11న ప్రఖ్యాత ఇంద్రజాలికుడు ఓపి అగర్వాల్ వరంగల్‌లో ఇచ్చిన మ్యాజిక్ ప్రదర్శన రామస్వామిని ఆకర్షించింది. అదే ఏటా ఆగస్టు 7న పీసీ సర్కార్ జూనియర్ హైదరాబాద్‌లో ప్రదర్శన ఇవ్వగా రామస్వామి వెళ్లొచ్చారు. విశాఖపట్నంలోని అరిపాక సూరిబాబు వద్ద మేజిక్‌లో శిక్షణ పొందారు. 1986 మే 25న జగిత్యాలలో డాక్టర్ కేసినో ప్రదర్శన చూసి ఆయనకు శిష్యుడిగా చేరారు. వరంగల్‌లో డాక్టర్ కేసినో ప్రదర్శన ఇచ్చినప్పుడు వారం పాటు అసిస్టెంట్‌గా ఉన్నారు. హైదరాబాద్‌లో డాక్టర్ వాసూస్ వద్ద హిప్నాటిజంలో శిక్షణ పొందారు. 1993 డిసెంబర్ 2న మొదటిసారిగా మామునూరు క్యాంప్‌లో మ్యాజిక్ ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాతా పోలీసు క్యాంపులలోనే ఎక్కువసార్లు ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వెయ్యికిపైగా ప్రదర్శనలు ఇచ్చారు.

అవార్డులు..
1993 నవంబర్ 7న మంగపేటలోని నవభారత్ స్కూల్ వారు ఆయన్ను మైటీస్టార్ బిరుదుతో సత్కరించారు. 2012లో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన రాష్ట్రస్థాయి ఇంద్రజాల ప్రదర్శన పోటీల్లో పాల్గొని జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. గుంటూరులో జరిగిన పోలీసు స్కౌట్ మీట్స్ బంగారు పతకాన్ని పొందారు. నెక్కొండ కళారంజన్ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో అద్భుతంగా ఇంద్రజాల ప్రదర్శన చేసి జాదూగర్ ప్రవీణ  బిరుదాంకితుడయ్యారు.

నటుడిగానూ..
ఇంద్రజాలికుడి, హిప్నాటిస్టుగానేకాక నటుడిగానూ రామస్వామి పేరు తెచ్చుకున్నారు. పలు టెలీఫిల్మ్‌ల్లో నటించారు. 2006లో పిల్లలుకాదు పిడుగులు, 2007లో ఇదీ ప్రేమంటే, రేపటి పౌరులు, 2008లో అడవిలో, 2011 ఆటమొదలైంది. 2011లో వైఎస్ మహాప్రస్థానం తదితర చిత్రాల్లో నటించారు. 2006లో మంచుముల్లు, సందేశం, 2007లో నాప్రేమ, 2009లో హారిక, స్నేహలత, మగువ తదితర టెలీఫిల్మలలో నటించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement