ఆస్తి పన్ను మూడింతలు!

Property Tax Will Hike In New Municipalities In Telangana - Sakshi

పల్లె కాస్త పట్నంగా మారగానే పన్నుల బాదుడు

జూలై 31 తర్వాత కొత్తగా 71 పురపాలికల ఏర్పాటు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడనున్న 71 పురపాలికల్లోని ప్రజలకు ముందుంది ముసళ్ల పండగే. గ్రామ పంచాయతీలు కాస్త పురపాలికలుగా మారగానే స్థానికంగా ఆస్తి పన్నులు మూడింతలై పోతున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని బాదెపల్లి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు రూ.74.48 లక్షల ఆస్తి పన్నులుండగా, మునిసిపాలిటీగా మారిన తర్వాత రూ.2 కోట్లకు పైగా పెరిగిపోయాయి. గ్రామ పంచాయతీలకు మునిసిపాలిటీ హోదా కల్పించిన తర్వాత రాష్ట్ర మునిసిపాలిటీల చట్టం ప్రకారం ఆస్తి పన్నుల వసూళ్లు జరిపేందుకు పురపాలక శాఖ చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో మునిసిపాలిటీల చట్టంలోని నిబంధనల ప్రకారం అక్కడి నివాస, వాణిజ్య, ప్రభుత్వ స్థిరాస్తులపై విధించాల్సిన ఆస్తి పన్నులను గణించేందుకు ప్రత్యేకంగా ఆస్తి పన్నుల గణన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

గ్రామ పంచా యతీ స్థాయి నుంచి రెండేళ్ల కింద మునిసిపాలిటీగా మారిన బాదెపల్లిలో ఆస్తి పన్నుల సవరణ కార్యక్రమాన్ని ఇటీవల రాష్ట్ర పురపాలక శాఖ పూర్తి చేసింది. ఈ పురపాలికలో 9 వేలకు పైగా గృహాలు, భవ నాలు, ఇతర స్థిరాస్తులపై ఆస్తి పన్నులు సగటున మూడింతల వరకు పెరిగిపోయాయి. ఇదిలా ఉండ గా, గ్రామ పంచాయతీ స్థాయి నుంచి ఏడాది కింద మునిసిపాలిటీగా మారిన దుబ్బాకలో త్వరలో ఆస్తి పన్నులు పెరగనున్నాయి. వచ్చే ఆగస్టు 1 నుంచి దుబ్బాకలో ఆస్తి పన్నుల సవరణ అమలు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ ఆదేశించింది. స్థానికంగా ఆస్తి పన్నుల పెంపునకు కసరత్తు జరుగుతోంది. 

ఆస్తి పన్నుల సవరణకు కసరత్తు 
కొత్తగా 71 మునిసిపాలిటీలు ఏర్పాటు కానున్న విషయం తెలిసిందే. 173 గ్రామ పంచాయతీల విలీనం చేయడంతో ఈ పట్టణ ప్రాంతాలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలోని ఐదు మున్సిపల్‌ కార్పొరేషన్లు, 36 మున్సిపాలిటీల్లోకి మరో 136 గ్రామ పంచాయతీలు విలీనం కానున్నాయి. వచ్చే జూలై 31తో ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించిన పాలక మండళ్ల పదవీకాలం ముగియనుంది. ఆ వెంటనే వీటికి మునిసిపాలిటీల హోదా లభించనుంది. ఈ 71 మునిసిపాలిటీలతో పాటు ఇప్పటికే ఉన్న పురపాలికల్లో విలీనం కానున్న గ్రామ పంచాయతీల పరిధిలో మునిసిపాలిటీల చట్టం ప్రకారం ఆస్తి పన్నుల సవరణ జరిపేందుకు రాష్ట్ర పురపాలక శాఖ ముందస్తుగా కసరత్తు ప్రారంభించింది.

రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్‌ టీకే శ్రీదేవి నేతృత్వంలోని ఆస్తి పన్నుల బోర్డు ఇటీవల సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 308 గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం వసూలు చేస్తున్న ఆస్తి పన్నులకు సంబంధించిన డిమాండ్‌ కలెక్షన్‌ బ్యాలెన్స్‌ (డీసీబీ) వివరాలను స్థానిక జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారుల నుంచి సేకరించాలని పురపాలక శాఖ అధికారులను ఆదేశించింది. ఎల్‌ఆర్‌ఎస్‌/బీఆర్‌ఎస్‌ పెండింగ్‌ దరఖాస్తులు, జారీ చేసిన భవన నిర్మాణ అనుమతులు, ల్యాండ్‌ రిజిస్ట్రీ తదితరాలకు సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించాలని కోరింది. కొత్తగా ఏర్పాటు కానున్న పురపాలికల్లో ఆస్తి పన్నుల సవరణ కార్యక్రమాన్ని చేపట్టి, కసరత్తు పూర్తి చేసే వరకు మరో ఏడాది సమయం పట్టనుందని పురపాలక శాఖ వర్గాలు తెలిపాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top