
‘సార్’ ఆశయ సాధనతోనే బంగారు తెలంగాణ
‘నిధులు, నీళ్లు, ఉద్యోగాలు.. తెలంగాణ ప్రాంత ప్రజలకు అందాలి...
- అభివృద్ధికి కొర్రీలు పెడుతున్న చంద్రబాబునాయుడు
- ఆంధ్రా ఉద్యోగులు తెలంగాణ నుంచి వెళ్లాల్సిందే..
- ప్రోసర్ జయశంకర్ విగ్రహావిష్కరణ సభలో మంత్రులు జగదీష్‌రెడ్డి, తుమ్మల
ఖమ్మం: ‘నిధులు, నీళ్లు, ఉద్యోగాలు.. తెలంగాణ ప్రాంత ప్రజలకు అందాలి.. ఇక్కడి ప్రజలు వలస వెళ్లకుండా సొంత ఊళ్లో సుఖసంతోషాలతో బతకాలి’ అని తపించిన తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, తొలి, మలితరం ఉద్యమాలకు మార్గదర్శి ప్రొఫెసర్ జయశంకర్‌సార్ ఆశయసాధనే బంగారు తెలంగాణ ఏర్పాటుకు కృషి అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. ఖమ్మం నగరంలోని బైపాస్‌రోడ్ ట్రాన్స్‌కో కార్యాలయంలో తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయశంకర్ విగ్రహాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన గురువారం ఆవిష్కరించారు.
తెలంగాణకు విద్యుత్ రాకుండా సీలేరు ప్రాజెక్టును ఏపీలో కలుపుకుని కుట్ర పన్నారని, ప్రైవేట్‌విద్యుత్ ఉత్పత్తిదారులను కూడా బెదిరించి తెలంగాణను అంధకారం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నించారని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. బాబు కుట్రలను తిప్పి కొట్టి విద్యుత్ కోతలు లేని తెలంగాణను చూపించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనన్నారు. జయశంకర్ సార్ ఆశయసాధన కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, కృష్ణ, గోదావరి జలాలను తెలంగాణ బీడు భూములకు మళ్లించేం దుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. బాధలు లేని బంగారు తెలంగాణ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆ దిశగా కృషి చేస్తున్నారన్నారు.
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ తో పోటీ పడలేని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ రాజకీయాలు, ఇతర విషయాలలో జోక్యం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధిని ఆటంక పరిచేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. ప్రజల దీవెన ఉన్నంత వరకు ఎవరూ అభివృద్ధిని అడ్డుకోలేరన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ విగ్రహాన్ని జిల్లాలో ఆవిష్కరించడం అభినందనీయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ఏపీ ఉద్యోగులు వారి ప్రాంతాలకు వెళ్లాల్సిందేనని, తెలంగాణ బిడ్డలకే ఇక్కడ ఉద్యోగాలు దక్కేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ట్రాన్స్‌కో సీఎండీ వెంకటనారాయణ, ఎస్‌ఈ ధన్‌సింగ్, ఉద్యోగులు తిరుపతి, రామకృష్ణ, బాబూనాయక్, రాధాకృష్ణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం..
రాష్ట్రంలో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి జగదీష్‌రెడ్డి హామీ ఇచ్చా రు. గురువారం రామకృష్ణ ఫంక్షన్‌హాలు లో జరిగిన తెలంగాణ విద్యుత్ కార్మికసంఘం జిల్లా మహాసభలకు ఆయన హాజరై ప్రసంగించారు. విద్యుత్ కోతలు లేని తెలంగాణ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు అయినా వెచ్చించేం దుకు సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణలో అత్యధికంగా విద్యుత్ శాఖలోనే ఉద్యోగా లు భర్తీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోవర్దన్, నాగయ్య, మూర్తి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బేగ్, ఆర్‌జేసీ కృష్ణ, పగడాల నాగరాజు పాల్గొన్నారు.