ఖైదీలకూ గౌరవంగా జీవించే హక్కు

The prisoners have the right to live in honor - Sakshi

నిందితులకు బేడీలు వేయకూడదు

శిక్ష పడ్డ ఖైదీలపై థర్డ్‌ డిగ్రీకి చెల్లుచీటి

సుప్రీం పలు కీలక తీర్పులు చెప్పింది

అన్సారీ స్మారకోపన్యాసంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సిక్రీ

సాక్షి, హైదరాబాద్‌: నేరారోపణల దశలోని నిందితులకే కాకుండా ఆ ఆరోపణలు కోర్టులో నిర్ధారణ అయ్యాక కూడా ఖైదీలకు గౌరవంగా జీవించే హక్కులుంటాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే సిక్రీ చెప్పారు. శనివారం సోమాజిగూడ ‘ఆస్కీ’ కార్యాలయంలోని జస్టిస్‌ అన్సారీ స్మారక సేవా ట్రస్ట్‌ కార్యదర్శి ఫరీదా హుస్సేన్‌ ఆధ్వర్యంలో జస్టిస్‌ ఎం.ఆర్‌.ఎ.అన్సారీ ఆరో స్మారక ఉపన్యాస కార్యక్రమంలో జస్టిస్‌ ఎ.కె.సిక్రీ, హైకోర్టు సీజే జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్, జస్టిస్‌ పీవీ రెడ్డి, జస్టిస్‌ ఎంఎన్‌ రావ్‌ పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా ‘న్యాయ వ్యవస్థ–గౌరవంగా జీవించే హక్కు–మానవహక్కులు’ అనే అంశంపై జస్టిస్‌ సిక్రీ మాట్లాడుతూ.. ప్రాథమిక హక్కులు, జీవించే హక్కు, వ్యక్తి స్వేచ్ఛలకు సంబంధించిన 14, 19, 21 అధికరణాలే వ్యక్తి గౌర వంగా జీవించాలని అంతర్లీనంగా చెబుతున్నాయని చెప్పారు. పౌరుడు గౌరవంగా జీవించే అంశాలపై సుప్రీంకోర్టు వెలువరించిన పలు కీలక తీర్పులను ఆయన ఉదహరించారు. ఎవరిపైనైనా నేరారోపణల ఫిర్యాదు పోలీసులకు అందినప్పుడు కూడా ఆ వ్యక్తి గౌరవానికి భంగం కలకూడదని డీకే బసు కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందన్నారు.

జైలు శిక్ష పడిన వ్యక్తికి కూడా హక్కులుంటాయని చెప్పారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు.. సునీల్‌ బాత్ర కేసులో మరో కీలక తీర్పు వెలువరించిందన్నారు. సునీల్‌ బాత్ర ఖైదీగా ఉన్నప్పుడు జైలు వార్డెన్‌ అతనిని చితగ్గొడితే సహచర ఖైదీ రాసిన లేఖను వ్యాజ్యంగా పరిగణించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌ కృష్ణయ్యర్‌ వెలువరించిన తీర్పులో ఖైదీ కూడా గౌరవం గా జీవించే హక్కు ఉందని స్పష్టమైందన్నారు. ఖైదీకి కూడా జీవించే హక్కులే కాకుండా గౌరవంగా బతికే హక్కులున్నాయని సుప్రీంకోర్టు తేల్చిందన్నారు.  

నిందితులకు బేడీలు సరికాదు
చాలా చోట్ల పోలీసులు కేసు నమోదు చేయగానే నిం దితులకు బేడీలు వేయడంపైనా సుప్రీంకోర్టు మరో కీలక తీర్పు చెప్పిందని జస్టిస్‌ సిక్రీ అన్నారు. ప్రేమ శంకర్‌ శుక్లా కేసులో ఆరోపణల దశలో నిందితులకు బేడీలు వేయకూడదని తీర్పు వచ్చిందన్నారు. దేశ భద్రత, సమగ్రతలకు సంబంధించిన అంశాల పేరు తో నిందితులకు బేడీలు వేసేప్పుడు కూడా అందుకు కచ్చితమైన ఆధారాలు చూపాలని తెలిపిందన్నారు.  

చిన్నారులపై అఘాయిత్యాలు బయటకు రావడం లేదు: హైకోర్టు సీజే
చిన్నారులపై దాడులు, వేధింపులు, అత్యాచారాలు జరుగుతున్నాయనే ఘటనల పట్ల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తమపై జరిగిన వాటి గురించి పిల్లలు బయటకు చెప్పుకోలేకపోవడం, ఎవరికైనా చెబితే చంపేస్తామని నిందితులు బెదిరించడం.. ఇలా అనేక కారణాల వల్ల పిల్లలపై జరిగే ఘటనలు ఫిర్యాదు కాకుండాపోతున్నాయన్నారు. ఈ ఘటనలు ఫిర్యాదు అయితేనే నేరస్తుల ఆటలు కట్టించేందుకు వీలవుతుందన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top