పీఓపీ విగ్రహాలే అత్యధికం

POP Idols More Percentage in Ganesh Nimajjanam - Sakshi

అవగాహన పెరిగినా ఆచరణలో వెనుకబాటు

నిమజ్జనానికి 50 వేల ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాలు సిద్ధం

115 తాగు నీటి క్యాంపులు

జలాశయాల నీటి కాలుష్యంపై పరీక్షలు

సాక్షి,సిటీబ్యూరో: గతానికి భిన్నంగా ఈసారి గ్రేటర్‌ నగరంలో పర్యావరణ హిత మట్టివిగ్రహాల ఏర్పాటుపై సిటీజనుల్లో అవగాహన పెరిగినప్పటికీ...ఈసారి సుమారు 50 వేల ప్లాస్టర్‌ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాలను ఆయా జలాశయాల్లో నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇళ్లలో పూజలందుకునే చిన్న పరిమాణంలో ఉన్న మట్టి ప్రతిమలను నగరవాసులు ఎక్కువగా ప్రతిష్టించినప్పటికీ..కాలనీలు, బస్తీల కూడళ్లలో ఏర్పాటుచేసిన విగ్రహాల్లో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌వే అత్యధికంగా ఉన్నాయి. మహానగరం పరిధిలో సుమారు 30 జలాశయాల్లో వినాయకనిమజ్జనం జరగనున్నప్పటికీ..అత్యధిక విగ్రహాలు నిమజ్జనం జరిగే 21 చెరువుల్లో నీటి కాలుష్యంపై పీసీబీ దృష్టిసారించింది. ఇక జలమండలి అధికారులు శోభాయాత్రలో పాల్గొనే భక్తుల సౌకర్యార్థం శోభాయాత్ర జరిగే మార్గంలో 115 తాగునీటి క్యాంపులను ఏర్పాటుచేయనుంది. ఈ క్యాంపుల్లో 32 లక్షల తాగునీటి ప్యాకెట్లను పంపిణీ చేయనున్నారు. భక్తుల దాహార్తిని తీర్చేందుకు అవసరమైతే నీటి ప్యాకెట్ల సంఖ్యను పెంచుతామని ఎండీ దానకిశోర్‌ తెలిపారు. 

21 చెరువుల కాలుష్యంపై పీసీబీ నజర్‌..  
నవరాత్రి పూజలందుకున్న గణనాథులను నిమజ్జనం చేసే చెరువులు, కొలనుల కాలుష్యంపై పీసీబీ దృష్టిసారించింది. గ్రేటర్‌ పరిధిలో హుస్సేన్‌సాగర్‌ సహా 21 చెరువుల్లో కాలుష్య మోతాదును పీసీబీ నిపుణులు లెక్కించనున్నారు. నిమజ్జనానికి ముందు, నిమజ్జనం జరిగే రోజులు, నిమజ్జనం తరవాత ఆయా జలాశయాల్లో నీటి నమూనాలను సేకరించి వాటి నాణ్యతను పరిశీలించనున్నారు. వీటిలో మీరాలం(బహదూర్‌పురా), లంగర్‌హౌజ్‌ లేక్, సరూర్‌నగర్‌ లేక్, రంగధాముని చెర్వు, సఫిల్‌గూడా చెర్వు, హస్మత్‌పేట్‌లేక్, అంబర్‌చెర్వు(కూకట్‌పల్లి), కాప్రాచెర్వు, దుర్గంచెర్వు, పెద్దచెర్వు, లింగంచెర్వు(సూరారం), ముండ్లకుంట(మూసాపేట్‌), పత్తకుంట(రాజేంద్రనగర్‌), నాగోల్‌చెర్వు, కొత్తచెర్వు(అల్వాల్‌), నల్లచెర్వు(ఉప్పల్‌), కాయిదమ్మకుంట(హఫీజ్‌పేట్‌), గుర్నాథ్‌చెర్వు(మియాపూర్‌), సాఖిట్యాంక్‌(పటాన్‌చెర్వు), రాయసముద్రం (రామచంద్రాపురం), గోపిచెర్వు(లింగంపల్లి) చెర్వులున్నాయి. ఈ చెరువుల్లో నిమజ్జనానికి ముందు ఆగస్టు 26న, నిమజ్జనం జరిగే సెప్టెంబరు 3,5,8,11,12 తేదీలతోపాటు సెప్టెంబరు 20న (నిమజ్జనం అనంతరం)నీటి నమూనాలను సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించనున్నారు. ఈ జలాశయాల నీటిలో కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్, బయలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్, గాఢత, బ్యాక్టీరియా, ఘన వ్యర్థాలు, కాఠిన్యత, విద్యుత్‌ వాహకత, కోలిఫాం, భారలోహాలు ఇలా అన్ని రకాల కాలుష్యాలను లెక్కించనున్నారు. నిమజ్జనం సందర్భంగా ఆయా జలాశయాల్లోకి సుమారు యాభైవేల వరకు విగ్రహాల నిమజ్జనం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో ఆయా జలాశయాలు కాలుష్యకాసారంగా మారనున్నాయి. ఈ విషయంపై స్థానికులను అప్రమత్తం చేసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు పీసీబీ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top