
25 ఏళ్లుగా వినాయక విగ్రహాలు తయారు చేస్తున్న వైనం
ఒక అడుగు నుంచి 15 అడుగుల ఎత్తు గణనాథుల తయారీ
ఒక్కో గణపతి ధర రూ.1500 నుంచి రూ.2 లక్షల వరకు
ఎస్‌పీఎస్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో గణేష్ విగ్రహాల రూపకల్పన
సాక్షి,బళ్లారి: లోకంలో తొలి పూజలు అందుకునే గణనాథుల పండుగ అంటే చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తూ, పండగను ఆచరించడం అనాదిగా వస్తోంది. ఏడాదికి ఒకసారి భాద్రపద మాసంలో వినాయక చవితి పండుగను కులమతాలకతీతంగా, ఇంటింటా, వాడవాడలా పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేయడం చూస్తుంటాం. అలాంటి వినాయక విగ్రహాలను తయారు చేసి గ్రామాల నుంచి పట్టణాలు, నగరాల్లో కూడా అమ్మకాలు సాగిస్తుంటారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు గత 25 ఏళ్లుగా వినాయక విగ్రహాలు తయారు చేయడంలో పేరుగాంచింది ఎస్‌కేఎస్ ఆర్ట్స్ సంస్థ. బళ్లారి తాలూకా వీరాపురం గ్రామంలో ఎస్‌పీఎస్(శ్రీకాంత్, పురుషోత్తం, శిల్పా) ఆర్ట్స్ అనే సంస్థ పేరుతో సదరు కుటుంబ సభ్యులు మొత్తం 30 మంది వరకు వినాయక విగ్రహాలను తయారు చేస్తూ జీవిస్తున్నారు. తమ అద్భుత ప్రతిభతో వివిధ రకాల, ఆకృతుల గణనాథుల విగ్రహాలను తయారు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు.
పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి కొనుగోలు
బళ్లారి జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, అనంతపురం తదితర ప్రాంతాల నుంచే కాకుండా తెలంగాణ, మహారాష్ట్రల నుంచి కూడా వినాయకుని విగ్రహాలు తీసుకెళ్లేందుకు వీరాపురం వచ్చి కొనుగోలు చేస్తున్నారంటే ఇక్కడ ఎంతటి అద్భుతమైన, ఆకట్టుకునే విధంగా గణనాథులను తయారు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా నిర్వాహకులు సాక్షితో మాట్లాడుతూ తాము గత 25 ఏళ్లుగా గణనాథులను తయారు చేస్తున్నామన్నారు. ఒక్కో గణపతి విగ్రహానికి రూ.1500 నుంచి రూ.లక్షా 50 వేలకు పైగా ధరలు ఉంటాయని, ఇతర ప్రాంతాల్లో తయారు చేసే గణనాథుల కంటే ఎంతో అద్భుతంగా తయారు చేస్తుంటామన్నారు.
ఆరు నెలలుగా విగ్రహాల తయారీపై కసరత్తు
దీపావళి పండుగ నుంచి వినాయక విగ్రహాలు తయారు చేయడం ప్రారంభిస్తామని తెలిపారు. ఆరు నెలలుగా వినాయక విగ్రహాలు తయారు చేయడంపై కసరత్తు చేస్తామన్నారు. ఆరు నెలల్లో 500 గణనాథులను తయారు చేస్తామని, వీటిలో కనీసం 300 నుంచి 400 వరకు గణనాథుల విగ్రహాల అమ్మకాలు జరుగుతుంటాయన్నారు. కొన్ని డ్యామేజ్ కావడం వల్ల నష్టాలు కూడా వస్తుంటాయన్నారు. గత ఆరు నెలల నుంచి తయారు చేసిన గణనాథులను షెడ్లలో భద్రంగా ఉంచుతామన్నారు. మట్టి గణనాథుల విగ్రహాల తయారీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఇతర వ్యాపారాల మాదిరిగా గణనాథుల తయారీకి పోటీ పెరిగిందన్నారు. అయితే నమ్మకం, నాణ్యత, మట్టితో తయారు చేసే గణనాథులను తయారు చేయడం వల్ల ఏటేటా తమ వద్దకు పెద్ద సంఖ్యలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి గణనాథుల విగ్రహాలను కొనుగోలు చేస్తుంటారని అన్నారు.