ఖమ్మంలో ఖాకీ నిఘా | police focus on khammam | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో ఖాకీ నిఘా

Nov 21 2014 1:52 AM | Updated on Sep 2 2017 4:49 PM

ఖమ్మంలో ఖాకీ నిఘాను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మంలో ఖాకీ నిఘాను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. హైదరాబాద్  తరహాలో పటిష్టంగా పోలీస్ కార్యకలాపాలు నిర్వహించడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం సన్నద్ధం అవుతోంది. పెరుగుతున్న నేరాలు, శాంతిభద్రతల పరిరక్షణ, వైట్ కాలర్ నేరాలను అరికట్టేందుకు నగరంలో ప్రతి పోలీస్ స్టేషన్‌కు నలుగురు ఎస్సైల చొప్పున కేటాయించారు. పని విభజన చేసి వారికి విభాగాల వారీగా కేటాయించాలని యోచిస్తున్నారు. ఇప్పటికే నగరంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఈ తరహా విధానం కొనసాగుతోంది. ఖమ్మం నగరంతోపాటు జిల్లాలోని ప్రధానస్టేషన్‌లలోనూ ఇదే విధానాన్ని ప్రవేశపెట్టాలని పోలీసు అధికారుల భావన.
 
కొత్త పంథాలో ముందుకెళ్తున్న నూతన ఎస్పీ
 జిల్లా ఎస్పీగా షానవాజ్‌ఖాసిం బాధ్యతలు తీసుకున్న పదిహేను రోజుల్లోనే పోలీస్‌స్టేషన్‌ల తనిఖీలు, శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. స్టేషన్‌ల వారీగా చేయాల్సిన పనులపై ఇప్పటికే కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది. ఖమ్మం నగరంలోని మూడు టౌన్‌లు, అర్బన్, రూరల్, మహిళా, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి ఎస్‌హెచ్‌వో (స్టేషన్ హౌస్ ఆఫీసర్)గా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ఉన్న ఎస్సైల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని శాంతిభద్రతల అవసరాల దృష్ట్యా నగరంలోని ఒక్కో పోలీస్‌స్టేషన్‌కు నలుగురు ఎస్సైలను నియమించారు.

అయితే ఆ స్టేషన్ పరిధిలో ఎవరు ఏ రకమైన విధులు నిర్వహించాలనే అంశంపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. స్టేషన్ అవసరాల దృష్ట్యా అక్కడి పరిస్థితులకు అనుగుణంగా సీఐ సూచనల మేరకు ఎస్సైలు విధులు నిర్వహిస్తున్నారు. కానీ ఇకమీదట స్టేషన్ పరిధిలోని వివిధ అంశాలపై ప్రతి ఎస్సైకి అవగాహన ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. స్టేషన్ పరిధిలో క్రైమ్ ఆధారంగా పనిని విభజించనున్నారు. దీని ప్రకారం ఒక్కో ఎస్సైకి ఒక్కో బాధ్యతను అప్పగిస్తారు.

 పని విభజన ఇలా..
 పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎనిమిది బీట్లు ఉంటే ఇద్దరు ఎస్సైలకు చెరో నాలుగు బీట్ల బాధ్యత అప్పగిస్తారు. మరో ఎస్సైకి పోలీస్ స్టేషన్ పరిపాలన బాధ్యతలు, రోజువారీ కోర్టు వ్యవహారాలు,  పోలీస్ సిబ్బంది పాలనా వ్యవహారాలు అప్పగించాలని యోచిస్తున్నారు. అలాగే మరో ఎస్సైని ప్రత్యేకంగా క్రైమ్ కోసం నియమించనున్నారు. ఈ తరహా పాలన ఇప్పటికే హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో కొనసాగుతోంది. ఎస్సై స్థాయి అధికారుల్లో జవాబుదారీ తనాన్ని పెంచడంతోపాటు ప్రత్యేకంగా ఆయా అంశాలపై పట్టు పెంచేందుకు ఈ తరహా విధానం అనుకూలిస్తుందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ఏయే పోలీస్‌స్టేషన్‌లలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు, వారి రోజువారీ విధులు, బందోబస్తు, ఏఎస్సై, ఎస్సైలు ఎంతమంది ఉన్నారో వివరాలు సేకరించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ షానవాజ్‌ఖాసిం సిబ్బంది మధ్య పని విభజన చేసి బాధ్యతాయుతమైన పోలీసింగ్‌కు శ్రీకారం చుట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం.

 అతి జోక్యం తగదు..!
  పోలీస్‌శాఖ నిర్వహించాల్సిన ప్రధాన విధులు నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఇప్పటికే క్షేత్రస్థాయిలో పోలీసులకు మౌఖిక ఆదేశాలు అందాయి. ఇతర ప్రభుత్వ శాఖలు పోలీసుల సహకారాన్ని కోరినప్పుడు మాత్రమే స్పందించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి అంశంలోనూ జోక్యం చేసుకోరాదని ఎస్సై, సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. ఎస్సై స్థాయి అధికారులతోపాటు సిబ్బంది పనుల్లోనూ విభజన చేయాలని యోచిస్తుండటం పట్ల పోలీస్ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

అలాగే ఖమ్మం నగరంలో ట్రాఫిక్ నియంత్రణపైనా జిల్లా ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. నగరంలో సీసీ కెమెరాలు పనిచేస్తున్న తీరు, కొత్తగా ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాలపై కసరత్తు ప్రారంభమైంది. పోలీస్‌స్టేషన్‌లలో సీసీ కెమెరాల ఆవశ్యకతను గుర్తించిన ఉన్నతాధికారులు అన్ని పోలీస్‌స్టేషన్‌లలో ఈ తరహా  కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇక జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై సైతం ఎస్పీ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఓఎస్‌డీగా అడవులను జల్లెడ పట్టిన అధికారిగా, మావోయిస్టు కార్యకలాపాలపై పట్టున్న ఎస్పీ, వరంగల్‌రేంజ్ డీఐజీ మల్లారెడ్డితో కలిసి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. భద్రాచలం, చర్ల, వెంకటాపురం, వాజేడు, దుమ్ముగూడెం వంటి ప్రాంతాలను చుట్టి అక్కడి పరిస్థితులను సమీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement