పేకాట సామ్రాజ్యం కూల్చేస్తాం!

Poker Game Plays In The Forest In Hanwada - Sakshi

మహబూబ్‌నగర్‌ క్రైం : పేకాట రాయుళ్లు తీరు మార్చుకోవాలని.. లేకపోతే ఎంతటి వారైనా దాడులు చేసి చర్యలు తీసుకుంటామని  ఇన్‌చార్జ్‌ డీఎస్పీ సాయి మనోహర్‌ హెచ్చరించారు. ఆదివారం హన్వాడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కొత్తచెరువుతండా అడవిలో పేకాట అడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా అందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ విలేకరులకు వివరించారు. పేకాట రాయుళ్లది పెద్ద సామ్రాజ్యమే ఉందని, ప్రతి ఆదివారం పక్కా ప్లాన్‌తో పేకాట ఆడటానికి ప్రణాళిక రచిస్తారని తెలిపారు.

అందులో భాగంగానే ఈనెల 1న హన్వాడ పరిధిలోని కొత్త చెరువు తాండ సమీపంలో ఉన్న అటవి ప్రాంతంలో అడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఎస్‌ఐ రాంబాబు ఆధ్వర్యంలో దాడులు జరిగాయని చెప్పారు. ఈ దాడులలో మొత్తం 14 మందిని అరెస్టు చేయగా బాలరాజు అలియాస్‌ బాలు అనే వ్యక్తి ఈ వ్యవహారంలో కీలకంగా పనిచేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇతడు శివ అనే వ్యక్తితో పేకాట రాయుళ్లకు సమాచారం అందిస్తూ కావాల్సిన ఏర్పాటు చేస్తాడని, పద్ధతి మార్చుకోవాలని గతంలో నోటీసులు ఇచ్చినా మారకపోవడంతో దాడులు చేసి అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. ఈ కేసులో మొత్తం 16మంది ఉన్నారని, వారిలో రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్‌ జావేద్‌ కూడా ఉన్నట్లు నిర్దారణ కావడంతో అతనిపై శాఖ పరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

వారిని రిమాండ్‌ చేయడంతో పాటు రూ.లక్షా 21 నగదు, 10ద్విచక్ర వాహనాలు, 16 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకుని సీజ్‌ చేసినట్లు వెల్లడించారు. కేసు నమోదైన వారిలో పల్లె వంశీ, పాష, సయ్యద్‌ మెహిజ్, సతీష్, సలాన్, రాజు, తిరుపతయ్య, నర్సింహులు, చంద్రనారాయణ్, వెంకటస్వామి, రాఘవేందర్, నాగరాజు, వెంకటేష్, శంకర్‌నాయక్, శివ, బాలరాజు ఉన్నారు. కానిస్టేబుల్‌ జావేద్‌ పరారీలో ఉన్నాడు. సమావేశంలో రూరల్‌ సీఐ కిషన్, హన్వాడ ఎస్‌ఐ రాంబాబు ఉన్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top