ప్రధాని పర్యటన తొమ్మిది గంటలు | PM Modi To Inaugurate Hyderabad Metro Rail Project | Sakshi
Sakshi News home page

ప్రధాని పర్యటన తొమ్మిది గంటలు

Nov 25 2017 2:59 AM | Updated on Oct 16 2018 5:14 PM

PM Modi To Inaugurate Hyderabad Metro Rail Project - Sakshi - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 28న మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రధాని ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కణ్నుంచి హెలికాఫ్టర్‌లో 2.05 గంటలకు మియాపూర్‌ హెలిప్యాడ్‌కు.. అక్కణ్నుంచి రోడ్డు మార్గంలో కార్యక్రమ వేదిక వద్దకు చేరుకుంటారు. 2.15 నుంచి 2.23 వరకు మెట్రో పైలాన్‌ను ఆవిష్కరించి.. హైదరాబాద్‌ మెట్రోను జాతికి అంకితం చేస్తారు. అక్కడ ప్రదర్శించే ఆడియో విజువల్‌ దృశ్యమాలికను తిలకిస్తారు. మెట్రో రైలు బ్రోచర్‌ను, ప్రయాణికులకు అనువుగా రూపొందించిన యాప్‌ను విడుదల చేస్తారు.

మధ్యాహ్నం 2.30 నుంచి 2.40 వరకు మియాపూర్‌ నుంచి కూకట్‌పల్లి, అక్కణ్నుంచి మియాపూర్‌ వరకు మెట్రో రైలులో ప్రయాణం చేస్తారు. 2.55కు మియాపూర్‌ నుంచి హెలికాఫ్టర్‌లో బయల్దేరి 3.15కు హెచ్‌ఐసీసీ చేరుకుంటారు. 3.25కు ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు వేడుక వద్దకు చేరుకుంటారు. 3.25 నుంచి 7.25 వరకు సదస్సు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. సదస్సునుద్దేశించి ప్రసంగిస్తారు. 7.30కి అక్కణ్నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 8 గంటలకు తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకుంటారు. 8 గంటల నుంచి 10 గంటల వరకు అక్కడ విందులో పాల్గొంటారు. 10.05 గంటలకు అక్కణ్నుంచి రోడ్డు మార్గంలో 10.25కు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

ముఖాముఖీ భేటీలు..
సాయంత్రం 5.30 నుంచి 5.48 వరకు మూడు మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల బృందాలతో ప్రధాని ప్రత్యేకంగా భేటీ అవుతారు. 5.48 నుంచి 5.56 వరకు మెమెంటోలను బహూకరిస్తారు. 5.56 నుంచి 6.03 వరకు గ్రూప్‌ మీటింగ్‌లో పాలుపంచుకుంటారు. 6.32 వరకు నలుగురు పారిశ్రామిక దిగ్గజాలతో విడివిడిగా ప్రధాని సమావేశమవుతారు. 6.32 నుంచి రాత్రి 7 గంటల వరకు రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొంటారు. మర్యాదపూర్వక భేటీల అనంతరం 7.30కు అక్కణ్నుంచి బయల్దేరి ఫలక్‌నుమా చేరుకుంటారు.

ఫలక్‌నుమాలో ప్రత్యేక ఆకర్షణలు
ఫలక్‌నుమాలో రాత్రి 8 గంటలకు భారత ప్రభుత్వం ఇచ్చే విందులో ముందుగా దేశ, విదేశీ అతిథులకు స్వాగతం పలుకుతారు. 8.05 నుంచి 8.20 వరకు ‘ట్రీ ఆఫ్‌ లైఫ్‌’పేరుతో భారతీయ కళలు, దుస్తుల ప్రదర్శన ఉంటుంది. 8.20 నుంచి 8.35 వరకు భారత చారిత్రక వారసత్వంపై లైవ్‌ షో ప్రదర్శిస్తారు. 8.45 నుంచి 9.50 వరకు విందు ఉంటుంది. 10 గంటలకు ప్రధాని మోదీ తిరుగుపయనమవుతారు.  


3 నిమిషాలు కేసీఆర్‌.. 5 నిమిషాలు ఇవాంకా..
జీఈఎస్‌ ప్రారంభోత్సవ షెడ్యూల్‌ ఖరారైంది. 3.25 నిమిషాలకు హెచ్‌ఐసీసీకి చేరుకోనున్న ప్రధాని 3.35 నుంచి 3.55 వరకు 20 నిమిషాల పాటు ఇవాంకా ట్రంప్‌తో ప్రత్యేకంగా భేటీ అవుతారు. నాలుగు గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. 4 గంటల నుంచి 4.25 వరకు భారత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కలుసుకునేందుకు సమయం కేటాయిస్తారు. 4.30కు కాన్ఫరెన్స్‌ హాల్‌కు చేరుకుంటారు.

4.30–4.40 వరకు మహిళల ప్రాధాన్యాంశంగా, నాలుగు కీలక రంగాలపై జీఈఎస్‌ రూపొందించిన ఆడియో, వీడియో దృశ్యమాలికను తిలకిస్తారు. 4.40 నుంచి 4.43 నిమిషాల వరకు సీఎం కేసీఆర్‌ సదస్సులో స్వాగతోపన్యాసం చేస్తారు. 4.43కు అధికారికంగా సదస్సును ప్రారంభిస్తారు. 4.45 నుంచి 4.50 నిమిషాల వరకు ఇవాంకా సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం 4.50 నుంచి 5.10 వరకు ప్రధాని ప్రసంగిస్తారు. 5.10 నుంచి 5.13 వరకు కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ కృతజ్ఞతలు తెలుపుతారు. 5.30 వరకు విరామ సమయంగా కేటాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement