‘పాలిథిన్‌’పై సమరం.. నేటినుంచి నిషేధం

Plastic Covers Banned In Joint Nizamabad District - Sakshi

నేటి నుంచి జిల్లాలో నిషేధం

అందరూ స్పందిస్తేనే విజయం

దేవాలయాల్లో స్వచ్ఛతా హీ సేవా

పర్యావరణానికి హాని కలిగిస్తున్న పాలిథిన్‌ కవర్లపై ప్రభుత్వం నిషేధం విధించింది. దీనిని పక్కాగా అమలు చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నా రు. నెలరోజులుగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 

 సాక్షి, బాన్సువాడ: పాలిథిన్‌ కవర్ల వాడకం ప్రజారోగ్యానికి పెను భూతంలా పరిణమించింది. ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో ఎటు చూసినా కొండల్లా పేరుకుపోయిన చెత్తకుప్పల్లో సింహభాగం పాలిథిన్‌ కవర్లే నిండి ఉంటున్నాయి. పాలిథిన్‌ కవర్లను నిషేధిస్తూ జారీ అయిన ఉత్తర్వులు బుధవారం నుంచి అమలులోకి రానున్నాయి. మున్సిపల్, గ్రామ పంచాయతీల అధికారులు పాలిథిన్‌ కవర్ల నిషేధం గురించి గత నెల రోజులుగా విస్తృత ప్రచారం చేశారు. అయితే ప్రజలందరూ స్పందించి సహకరిస్తేనే పాలిథిన్‌ కవర్లను నిషేధించేందుకు వీలుంటుంది. అలాగే దుకాణాల యజమానులు వీటి విక్రయాలను పూర్తిగా నిషేధించాల్సి ఉంది. 

పర్యావరణానికి ముప్పు 
 భూమిలో ఏ మాత్రం కరిగే అవకాశం లేని వీటి వల్ల వర్షపు నీరు లోతుల్లోకి ఇంకకపోవడమే కాకుండా, వాటిని తిన్న పశువులను తీవ్ర అనారోగ్యాల పాలు చేస్తున్నాయి. పాలథిన్‌ కవర్లను కాల్చడం వల్ల వెలువడే విష వాయువులు మనుషులు ఆరోగ్యానికి తీరని ముప్పు చేస్తున్నాయి. ప్రభుత్వం, అధికారుల చిత్తశుద్ధి లోపంతో గతంలో విధించిన నిషేదాజ్ఞలు నీరుగారిపోయాయి.  పాలథిన్‌ కవర్ల వాడకం వల్ల పర్యావరణానికి, జంతుజాలానికి, మానవులకు వచ్చే ముప్పును ప్రభుత్వాలు గుర్తించడం వల్లే నిషేధాన్ని అమలు చేసింది.  జిల్లాలోని  నిజామాబాద్, బోధన్, ఆర్మూర్‌ మున్సిపాలిటీలు, కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో  పాలథిన్‌ కవర్ల నిషేధం అమలుకు చర్యలు తీసుకొంటున్నారు.

బాన్సువాడలో పాలిథిన్‌ కవర్లను సేకరించి తరలిస్తున్న  మున్సిపల్‌ సిబ్బంది 

ఆలయాల్లో ప్లాస్టిక్‌ నిషేధం
మానవాళికి ప్రమాదకర పరినమిస్తున్న ప్లాస్టిక్‌పై  దేశవ్యాప్తంగా ఉద్యమం చేయటానికి ప్రధాని గ్రామస్థాయి నుంచి సన్నద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే నేటి నుంచి ‘స్వచ్చతా హీ సేవా’ కార్యక్రమాన్ని చేపడుతోంది. దీని ప్రధాన ఉద్ధేశ్యం పాలిథిన్‌ వాడకాన్ని దేవాలయాల్లో నిషేధించడం. ఒక్కసారి వాడి పారేసిన ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. దీపావళి పండుగ నుంచి గ్రామాలు, పట్టణాలు, నగరాలు, దేవాలయాలు, పాఠశాలల పరిసరాలను పాలిథిన్‌ వ్యర్థాల నుంచి విముక్తి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి.  

పాలిథిన్‌ కవర్ల వల్ల అనర్థాలు..

  •      పాలిథిన్‌ కవర్లు, వేల లక్షల సంవత్సరాలు కరిగిపోకుండా అలాగే భూమి పొరల్లో పేరుకుపోతాయి. 
  •      ఇవి అడ్డుపడడం వల్ల భూమిలోకి నీరు ఇంకడం ఆగిపోయి భూగర్భ జల మట్టాలు తగ్గిపోతాయి.
  •      పాలిథిన్‌ కవర్ల వల్ల సారవంతమైన వ్యవసాయ భూములు నిస్సారంగా మారిపోతాయి.
  •      చెత్తకుప్పల్లోని పాలిథిన్‌ కవర్లను పశువులు ఆహారంగా తీసుకోవడం వ్లల ఉదరకోశ, శ్వాస సంబంధ వ్యాధులతో మరణిస్తాయి.
  •      ఎక్కడపడితే అక్కడ ఆ పాలిథిన్‌ కవర్లు పారేయడం వల్ల అవి అడ్డుపడి మురుగునీటి సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తమైపోతుంది.

 పర్యావరణం కోసం..
 ప్టాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించి సంప్రదాయ పర్వదినాల్లో ప్రకృతి ప్రసాదించిన మోదుగాకులను ఇతర సామాగ్రిని వినియోగించవలిసిన అవసరం ఎంతైన ఉంది. 
–డాక్టర్‌ సుధీర్‌సింగ్, పర్యావరణవేత్త, కంఠేశ్వర్‌

దేవాలయాలు కలుషితమవుతున్నాయి
భక్తులు విచ్చల విడిగా వినియోగిస్తున్న ప్లాస్టిక్‌ వల్ల దేవాలయాలు కలుషితమవుతున్నాయి. పూజాసామాగ్రికి కూడా ప్లాస్టిక్‌ కవర్లను వినియోగిస్తున్నాము. నైవేద్యం, భోజనం కూడా ప్లాస్టిక్‌ ప్లేట్లను ఉపయోగిస్తున్నారు.
–సోమయ్య, సహాయ కమిషనర్‌

అన్ని కార్యాలయాల్లో అమలు
జాతి పిత మహాత్మగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని నేటి నుంచి నిజామాబాద్‌ జిల్లాను ప్లాస్టిక్‌ రహిత జిల్లాగా మార్చడానికి అన్ని కార్యాలయాలు, దైనందిన జీవితంలో అన్ని చోట్ల ప్లాస్టిక్‌ వాడకాన్ని నిర్మూలిద్దాం.
 – ఆర్‌.ఎం.రావు.. జిల్లా కలెక్టర్‌   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top