
గల్ఫ్ దేశం నుంచి వచ్చిన మృతుని శవపేటిక (ఫైల్)
గల్ఫ్ దేశాల్లో అనారోగ్యం, మానసిక ఒత్తిడితో చనిపోతున్న కార్మికులు
ఏడాదిలో 200 మంది వరకు మృతి
ఆరోగ్య హక్కు ఉన్నా.. అవగాహన లేమి
రెండు నెలల్లో బ్రెయిన్‌డెడ్‌తో 20 మంది మృతి
వలస కార్మికుల ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించాలంటున్న కార్మిక సంఘాల నేతలు
మోర్తాడ్ (బాల్కొండ): జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రేగుంటకు చెందిన కర్న గణేశ్ (55) రెండ్రోజుల కిందట సౌదీ అరేబియాలో గుండెపోటుతో మరణించాడు. వారం రోజుల కిందనే ఒమన్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన రాజన్న అనే వలస కార్మికుడు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై బ్రెయిన్‌డెడ్‌తో మృత్యువాత పడ్డాడు. ఇలా గల్ఫ్ దేశాల్లో తెలంగాణ (Telangana) జిల్లాలకు చెందిన వలస కార్మికులు అనారోగ్యం, మానసిక ఒత్తిడితో గుండెపోటుకు గురై చనిపోతూనే ఉన్నారు. మరికొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఏడాది కాలంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఖతర్, ఒమన్ (Oman), బహ్రెయిన్, కువైట్, ఇరాక్‌లలో దాదాపు 200 మంది వలస కార్మికులు వివిధ కారణాలతో మరణించారు. గతంలో కంటే మరణాల సంఖ్య రెండేళ్ల నుంచి పెరగడంతో కార్మిక సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వలస కార్మికుల ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించకపోవడంతోనే ప్రమాదం పొంచి ఉందనే వాదన వినిపిస్తోంది.
అంపశయ్యపై ప్రవాసీల ఆరోగ్యం
గల్ఫ్ దేశాలకు పొట్ట చేతపట్టుకుని వెళ్లిన వలస కార్మికుల్లో అత్యధికులు తక్కువ నైపుణ్యం గల అల్పాదాయ వర్గాలకు చెందిన వారే ఉన్నారు. తాము పని చేసేచోట అనారోగ్యం పాలైతే ఖరీదైన వైద్యం అందుకోలేని దుస్థితిలో ఉన్నారు. వైద్య ఖర్చులను భరించలేక ఎడారి దేశాల్లో వలస కార్మికులు మృత్యువాత పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎల్లలు దాటి విదేశాలకు వలస వెళ్లిన వారికి అంతర్జాతీయ సూత్రాల ప్రకారం ఆరోగ్య హక్కు ఉన్నా దీనిపై అవగాహన లేకపోవడం, విదేశాంగ శాఖ దృష్టి సారించకపోవడం, కంపెనీ యాజమాన్యాల నిర్లక్ష్యంతో వలస కార్మికుల ఆరోగ్య సంరక్షణ గాలిలో దీపంలా మారింది.
చదవండి: ఆదిలాబాద్ కా అమితాబ్
అధిక పనిగంటలు, తీవ్ర ఒత్తిడి, విశ్రాంతి లేకుండా జీవనం సాగిస్తుండటంతో వలస కార్మికులు మానసిక వేదనకు గురవుతున్నారు. గడిచిన రెండు నెలల్లో 20 మంది బ్రెయిన్‌డెడ్‌తో మరణించినట్లుగా నమోదవడం గమనార్హం. పనిచేసే చోట భద్రత లేకపోవడం, నైపుణ్యం లేక ప్రమాదాలకు గురి కావడం వలస కార్మికులను ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రవాసీ బీమాలో ‘ఆరోగ్యం’కరువు
దేశం నుంచి గల్ఫ్‌తో సహా 18 దేశాలకు వలస వెళ్తున్న ఈసీఆర్ కేటగిరీ (10వ తరగతి కంటే తక్కువ విద్యార్హత కలిగిన) వారికి భారత ప్రభుత్వం ప్రవాసీ భారతీయ బీమా యోజన పథకం తప్పనిసరి విధానంలో అమలు చేస్తుంది. ప్రమాదంలో మరణించిన లేదా శాశ్వత అంగవైకల్యానికి గురైన వారికి రూ.10 లక్షల పరిహారం లభిస్తుంది. వలస కార్మికుల కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం చేకూరుస్తున్న ఈ బీమా పథకంలో ఆస్పత్రి ఖర్చులకు సంబంధించిన అంశం లేకపోవడంపై కార్మిక సంఘాల నేతలు పెదవి విరుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి వలస కార్మికుల అనారోగ్య మరణాలు, ఆత్మహత్యలను నిరోధించడానికి విదేశాంగ శాఖ ద్వారా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment