నల్లగొండలో ‘పెట్రో’ మోసం..!

Petrol Bunk Fraud In Nalgonda - Sakshi

కొలతల్లో తక్కువ.. నాణ్యతలో కల్తీ

అక్రమాలకు పాల్పడుతున్న బంకుల యజమానులు

సాక్షి, మిర్యాలగూడ :  కొలతల్లో తేడా.. నాణ్యతలో కల్తీ ఇదీ జిల్లాలోని పెట్రోల్‌ బంక్‌ల పరిస్థితి. గ్రామాల్లో విడిగా లభించే పెట్రోల్, డీజిల్‌లో కల్తీ ఉంటుందని వినియోగదారులు బంకుల వద్దకు వెళ్తుంటారు. కానీ బంకుల్లో కూడా కల్తీ పెట్రోల్, డీజిల్‌తో పాటు కొలతలో కూడా తేడా ఉండడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌ ధరలతో ఇప్పటికే వినియోగదారులు ఆవేదన చెందుతుండగా కొలతల్లో మోసంతో మరింత ఆందోళన చెందుతున్నారు. మిర్యాలగూడలో రైస్‌ మి ల్లులు ఎక్కువగా ఉండడం వల్ల లారీలు, ఇతర వాహనాలు ఎక్కువగా ఉన్నాయి. దానిని ఆసరాగా చేసుకుంటున్న పెట్రోల్‌ బంక్‌ల యజమానులు కొలతల్లో తక్కువ వచ్చే విధంగా బంక్‌లో ఏర్పాటు చేసిన పిల్లింగ్‌ మిషన్‌లో చిప్‌లు అమర్చి మోసాలకు పాల్పడుతున్నారు.

ఇటీవల హనుమాన్‌పేట సమీపంలో ఒక పెట్రోల్‌ బంక్‌లో కొలతల్లో తేడాలు రావడం వల్ల తూనికల కొలతల అధికారికి వినియోగదారులు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు తనిఖీలు చేయగా.. కొలతల్లో తేడాలు రావడంతో బంక్‌ను సీజ్‌ చేశారు. అదే విధంగా మిర్యాలగూడ రోడ్‌లోని బంగారుగడ్డ వద్ద ఉన్న బంక్‌లో కూడా కొలతల్లో తేడాలు రావడం వల్ల వినియోగదారులు అధికారులకు ఫిర్యాదు చేశారు. 

భారీగా డీజిల్, పెట్రోల్‌ వినియోగం..
రాష్ట్రంలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అత్యధికంగా డీజిల్, పెట్రోల్‌ వినియోగం ఉంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 300 పెట్రోల్‌ బంక్‌లు ఉన్నాయి. జిల్లాలో నాలుగు చక్రాల వాహనాలు మొత్తం 5 లక్షలు, ద్విచక్ర వాహనాలు 3.50 లక్షలు ఉన్నాయి. కాగా వాటితో పాటు ఉమ్మడి జిల్లాలో జాతీయ రహదారులు ఉండడం వల్ల ఇతర జిల్లాలకు సంబంధించిన వాహనాలు కూడా జిల్లా మీదుగా వెళ్లడం వల్ల డీజిల్, పెట్రోల్‌ వినియోగం ఎక్కువగా ఉంది. ఉమ్మడి జిల్లాలో రోజూ 6 లక్షల లీటర్ల డీజిల్, 11 లక్షల లీటర్ల పెట్రోల్‌ వినియోగం ఉంది. 

పట్టించుకోని అధికారులు..
బంకుల్లో పెట్రోల్, డీజిల్‌ కొలతలో తక్కువగా రావడం, కల్తీ పెట్రోల్‌ విక్రయిస్తున్నప్పటికీ కనీసం స్థానిక అధికారులు తనిఖీలు చేయడం లేదు. తూనికల కొలతల అధికారులు బంకుల్లో తనిఖీలు చేయడంతోపాటు.. సివిల్‌ సప్లయీస్‌ అధికారులు నాణ్యతపై పరిశీలించాల్సి ఉంది. కానీ ఫిర్యాదు వస్తేనే తప్ప బంక్‌ల వైపు చూడడం లేదు. కల్తీ పెట్రోల్‌ వాడకం వల్ల వాహనాలు మొరాయించడంతో మెకానిక్‌లను ఆశ్రయించాల్సి వస్తుందని వినియోగదారులు పేర్కొంటున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top